సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్ | Earnings to be Term Insurance | Sakshi
Sakshi News home page

సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్

Published Mon, Feb 23 2015 12:30 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM

సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్ - Sakshi

సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్

నేను రూ.10-15 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇవన్నీ కాగిత రూపంలోనే ఉన్నాయి. వీటిని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవాలా? అలాచేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రస్తుతం నా దగ్గర రూ.5 లక్షల వరకూ డబ్బులున్నాయి. దీనిని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయాలనుకుంటున్నాను. సరైన డెట్ ఫండ్‌ను సూచించండి. -ఉమశ్, వరంగల్

ప్రత్యేకమైన ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కాగిత రూపంలోని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ అకౌంట్‌లోకి మార్చుకుంటే మంచిదే. ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే..., మీరు వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాటి వివరాలు తెలియకుండా ఏదో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వలేను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ముందుగా ఏదైనా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయండి. కాకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్, బదిలీ చేసే ఈక్విటీ ఫండ్- ఈ రెండు ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందినవైతే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

నేను ఒక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు చెందిన డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ నుంచి డివిడెండ్ పే అవుట్ స్కీమ్‌కు మారాలనుకుంటున్నాను. ఎలా మారాలో వివరించండి? -అమరేశ్వరి, గుంటూరు
 
మీరు ప్రస్తుతం డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.  ఈ ఫండ్ నుంచి డివిడెండ్ పేఅవుట్(చెల్లించే) ఆప్షన్‌కు మారాలనుకుంటున్నట్లు ఒక రిక్వెస్ట్ లెటర్‌ను గానీ, చేంజ్ ఆప్షన్ స్లిప్‌ను గానీ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించాలి. మీ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ ఉన్నా ఇలా మార్చుకోవచ్చు. అయితే గ్రోత్ ఆప్షన్ స్కీమ్‌లైతే లాకిన్ పీరియడ్ తర్వాతనే మార్చుకోవడానికి వీలవుతుంది. మీ పెట్టుబడులను 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఇటీవలనే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.  
 
నేను కొటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేనేమన్నా లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలా? ఎన్ని సంవత్సరాల పెట్టుబడి తర్వాత లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది?
 -సరళ, హైదరాబాద్

 
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, దేశీయ ఈక్విటీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు, ఇలా కాని వాటిని నాన్-ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. కొటక్ వరల్డ్ గోల్డ్ ఫండ్‌ను విదేశీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దీనిని నాన్-ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు.ఈ ఫండ్ నుంచి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే మీరు షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ట్యాక్స్ శ్లాబులననుసరించి ఈ పన్ను విధిస్తారు. మూడేళ్ల త ర్వాత ఉపసంహరించుకుంటే దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్‌తో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది.
 
నా కొడుకు వయస్సు 20 సంవత్సరాలు. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడిపేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకున్నాను, రెండు మూడు జీవిత బీమా వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ ద్వారా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నాలు చేశాను. కానీ ఈ వెబ్‌సైట్‌లన్నీ ఆదాయ ధ్రువీకరణ అడుగుతున్నాయి. నా కొడుకు ఇంకా చదువుతున్నాడు. కాబట్టి అతడికి ఆదాయ ధ్రువీకరణ లేదు. నా కొడుక్కి వేరే మార్గాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
-ఆంజనేయ శాస్త్రి, కర్నూలు


సాధారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తులే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఈ సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, అతడి పై ఆధారపడ్డ వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. సంపాదన లేని వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం  సరైనది కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement