ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్‌పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్‌పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్‌బీఐ, యూటీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ యూనిట్లను గతేడాది కొనుగోలు చేశాను. వాటిని నేను ఇప్పుడు విక్రయించినట్టయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుందా? – శశికళ
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో మీ పెట్టుబడి తేదీ నుంచి ఏడాది పూర్తయినట్టయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఒకవేళ ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే అప్పుడు పెట్టుబడి మొత్తానికి ఏడాది పూర్తయి ఉండదు. అలా ఏడాది పూర్తి కాని మొత్తాలను వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. ఎగ్జిట్ లోడ్ విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. కానీ, వారు పెట్టుబడి చేసిన నాటికి ఉన్న ఎగ్జిట్ లోడ్ విధానమే అమలవుతుందని గుర్తు పెట్టుకోవాలి. పైగా కొందరికి అసలు ఎగ్జిట్ లోడ్ గురించే తెలియదు. పెట్టుబడి వెనక్కి తీసుకున్న సమయంలో.. అందులోంచి ఎగ్జిట్‌లోడ్‌ను మిహాయించిన తర్వాతే వారికి ఆ విషయం తెలిసి వస్తుంది. కనుక మీ పెట్టుబడులకు సంబంధించి ఎగ్జిట్ లోడ్ విషయంలో స్పష్టత కోసం కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. కామ్స్ వెబ్‌సైట్ నుంచి ఎగ్జిట్ లోడ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ ప్రీమియం చందాదారులు ‘మై ఇన్వెస్ట్‌మెంట్’ టూల్ సాయంతో తాము ఇన్వెస్ట్ చేసిన పథకానికి సంబంధించి ఎగ్జిట్ లోడ్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో వ్యయాలు, లిక్విడిటీ పరంగా ఏది మెరుగైనది? – దినేష్ జనార్థన్
వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్ (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్ పాయింట్లకే ఈటీఎఫ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు సైతం 10–15 బేసిస్ పాయింట్ల ఎక్స్‌పెన్స్ రేషియోకి పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నవీ ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్‌ఫండ్స్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. పెట్టుబడుల ఉపసంహరణను అన్ని పనిదినాల్లో నాటి ఎన్‌ఏవీ ఆధారంగా చెల్లింపులకు ఫండ్స్ సంస్థలు కట్టుబడి ఉండాల్సిందే. కనుక లిక్విడిటీ విషయంలో ఇక్కడ ఆందోళన అనవసరం. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్ (పరిమాణం)లో ట్రేడ్ అవుతుంటాయి. కానీ, అన్నింటి విషయంలో ఇలా ఉండదు. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఈటీఎఫ్ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment