ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఆదా చేసుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే లాభాలపై పన్ను ఆదా చేసుకునే మార్గం ఉందా? –జగన్మోహన్
2018 వరకు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదు. 2018లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో దీన్ని ప్రతిపాదించారు. ఏడాదికి మించిన దీర్ఘకాల పెట్టుబడులపై మూలధన లాభం రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. అంతకుమించిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. లాభం రూ.లక్ష వరకు ఉంటే విక్రయించుకోవాలి. లాభాలను కాపాడుకోవడానికి మార్గం ఇదే. నిర్ణీత కాలానికి మీ పెట్టుబడులపై పన్నుల్లేని లాభాలను సమకూర్చుకోవచ్చు. అంటే మినహాయింపుల పరిమితి మేరకు లాభం తీసుకుంటూ, తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నది నేనిచ్చే సలహా. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇదేమీ పెద్దదిగా అనిపించదు. ప్రతీ రూ.లక్ష లాభంపై ఆదా చేసేది కేవలం రూ.10,000. ఇంత చిన్న మొత్తానికి తలపోటు పని పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ ఇదేమీ శ్రమగా భావించడం లేదనుకుంటే లాభం రూ.లక్షకు చేరగానే వెనక్కి తీసుకోవచ్చు.
క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా? ఈక్విటీ షేర్ల మాదిరిగా.. క్రిప్టోలను వాటి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) ఆధారంగా విశ్లేషించే మార్గం ఏదైనా ఉందా?
– పీఎం అన్నాదురై
క్రిప్టో కరెన్సీలను వాటి మూలాల ఆధారంగా విశ్లేషించే మార్గమే లేదు. ఒక దేశం గురించి తెలుసుకోవడం ద్వారా కరెన్సీని విశ్లేషించగలరు. ఒక దేశంగా భారత్ మరిన్ని డాలర్లను కొనుగోలు చేయగలదు. లేదా విక్రయించగలదు. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఎన్నో స్థూల ఆర్థిక వ్యత్యాసాలున్నా కానీ ఒక దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కరెన్సీని విశ్లేషించుకోవచ్చు. క్రిప్టోలకు సంబంధించి విశ్లేషించేందుకు అటువంటి అంశాలేవీ లేవు.
ఒకే ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తున్నా కానీ వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్‌ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – అశోక్ కుమార్
ఒక్కో పథకం ఒక్కో సమయంలో ప్రారంభం కావడం వల్లే ఈ అంతరం కనిపిస్తుంది. ఉదాహరణకు బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆధారితంగా 2000 సంవత్సరంలో ఒక పథకం రూ.10 ఎన్‌ఏవీతో ప్రారంభమై ఉంటే.. సెన్సెక్స్ పనితీరు ఆధారంగా ఇప్పుడు అదే పథకం ఎన్‌ఏవీ ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది. ఒకవేళ ఏడాది క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ ఆధారిత పథకం ఎన్‌ఏవీ రేటు భిన్నంగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ ఎన్‌ఏవీ అన్నది ఇక్కడ కీలకం కాదు. మీరు పెట్టుబడులు పెట్టిన తర్వాత సంబంధిత పథకం రాబడి రేటు.. ఇండెక్స్ రాబడికి అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూసుకోవాలి.
సిప్‌లు అన్నింటికీ ఒకటే తేదీ ఉండడం సరైనదేనా? నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ప్రతీ నెలా మొత్తం మీద రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. తద్వారా రిటైర్మెంట్ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) తేదీ 15వ తేదీనే ఉంది. ఇలా ఉంటే ప్రతికూలమా? – విష్ణు కుమార్
మీ పెట్టుబడులను ప్రణాళికకు అనుగుణంగా కొనసాగించుకోండి. ప్రతీ నెలా అనుకున్నట్టుగానే, అనుకున్న రోజున నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లేలా చూసుకోండి. పెట్టుబడి కొనుగోలు వ్యయం సగటుగా మారడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది. ఐదు మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లకు నెలలో భిన్నమైన తేదీలను నిర్ణయించుకోవడం అన్నది క్లిష్టమైనది. కనుక అన్నింటికీ ఒక్కటే తేదీ సిప్‌గా ఉండడం ప్రతికూలమేమీ కాదు.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే
Comments
Please login to add a commentAdd a comment