మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌.. | What is Factor Investing and How the Strategy Works full details here | Sakshi
Sakshi News home page

Factor Investing: మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌..

Published Mon, Oct 14 2024 7:25 PM | Last Updated on Mon, Oct 14 2024 7:25 PM

What is Factor Investing and How the Strategy Works full details here

గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ విస్తృతి, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లకు (సిప్‌) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్‌ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.

సెక్యూరిటీస్‌లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ పని చేస్తుంది. ఫ్యాక్టర్‌ ఫండ్స్‌ అనేవి భారత్‌లో ఇండెక్స్‌ ఫండ్, ఈటీఎఫ్‌ ఫార్మాట్‌లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్‌), గతి (మూమెంటమ్‌), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్‌ అనేది ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్‌ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్‌ ఇ న్వెస్టింగ్‌ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్‌ ఆధారితమైనదిగా ఉంటుంది.

సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్‌ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్‌ క్లాస్‌లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్‌లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ అనేది మార్కెట్‌ బెంచ్‌మార్క్‌లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.

రిస్క్‌ మేనేజ్‌మెంట్‌: వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్‌ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.

పారదర్శకత: మిగతా పాసివ్‌ ఫండ్స్‌ (ఇండెక్స్‌ ఫండ్, ఈటీఎఫ్‌) తరహాలోనే ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్‌ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్‌ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.

డైవర్సిఫికేషన్‌: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్‌ పనితీరు బాగా లేకపోతే పోర్ట్‌ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.

సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్‌ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది.  

గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. 
ఫ్యాక్టర్స్‌ కొన్నాళ్ల పాటు అండర్‌పెర్ఫార్మ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్‌ అనేవి నిర్దిష్ట మార్కెట్‌ పరిస్థితుల్లో గ్రోత్‌ స్టాక్స్‌తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్‌ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్‌ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్‌ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్‌ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్‌ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్‌ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్‌ ప్రయోజనం తగ్గిపోవచ్చు.  ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్‌ పాటించాలి. మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది.  

చ‌ద‌వండి:  మిడ్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!

రిస్కు సామర్థ్యాలను బట్టి.. 
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తమ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న‌ ఇన్వెస్టర్లు, మూమెంటమ్‌ లేదా సైజ్‌ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్‌ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్‌కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్‌ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు.  

చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది క‌ల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొఫైల్‌ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక‌ లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement