ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉంది కదా ! ఈ నేపథ్యంలో నా సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లను వాయిదా వేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?
–ప్రియాంక, హైదరాబాద్
చాలా మంది ఇన్వెస్టర్లను ప్రస్తుతం అత్యధికంగా తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, సిప్‌లను ఆపేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సమీప భవిష్యత్తులో ఈ సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ములు మీకు అవసరం లేని పక్షంలో సిప్‌లను వాయిదా వేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదు. మార్కెట్ పుంజుకొని మళ్లీ పెరగడానికి ఎంత కాలం పడుతుందో సరైన అంచనాలు లేవు. మూడు నెలలు కావచ్చు. లేదా ఏడాది పట్టవచ్చు. మార్కెట్ రికవరీకి ఇంకా ఎక్కువ కాలమే పట్టినా, ఆశ్చర్యపోవలసిన పని లేదు. మార్కెట్ రికవరీకి ఎంత కాలం పట్టినా, మీరు మీ సిప్‌లను కొనసాగిస్తే, మీకు చౌకగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభించే అవకాశాలున్నాయి.
కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ సిప్‌లను నిరభ్యంతరంగా కొనసాగించండి. మార్కెట్ ఇంకా పతనమవుతుందనే భయాలతో ఇప్పటికిప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను అమ్మేస్తే, మీకు నష్టాలు రావచ్చు. మార్కెట్ పడుతుంది కదా అని మీ సిప్‌లను ఆపేస్తే, చౌకలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ప్రస్తుత మార్కెట్ పతన సమయంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువలు బాగా తగ్గి, మీకు నిరాశను కలిగిస్తున్నా, మీరు మాత్రం మీ సిప్‌లను ఆపేయక, కొనసాగించండి.
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎనిమిది నుంచి పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కాలానికి కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకున్నాను. మూడేళ్ల రాబడులను పరిగణనలోకి తీసుకొని ఈ ఫండ్‌ను ఎంపిక చేశాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? నా దగ్గర ప్రస్తుతం రూ. లక్ష ఉన్నాయి. ఈ లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.
–నరేంద్ర, విజయవాడ
మీరు ఎంచుకున్న కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్ మంచిదే. ఈ కేటగిరీ ఫండ్స్‌లో మంచి రాబడులు అందిస్తున్న కొన్ని ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఏడాది నుంచి రెండేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. స్టాక్ మార్కెట్ ఉత్థాన, పతనాలు ఈక్విటీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపుతాయి. ఈ ఫండ్ కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తుతం ఈ ఫండ్ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు.
ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫండ్ మీకు మంచి రాబడులనే అందించగలుగుతుంది. మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదుకులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మరింతగా మేలు కలుగుతుందనే చెప్పవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. మీ దగ్గర ఉన్న రూ. లక్షను కనీసం ఆరు నుంచి పన్నెండు సమభాగాలుగా విభజించి, నెలకు కొంత మొత్తం చొప్పున సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ఇన్వెస్ట్ చేయండి.
నేను 2013లో క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. 2016లో ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేసుకున్నాను. మంచి రాబడులే వచ్చాయి. ఇప్పుడు చూస్తే, ఆ ఫండ్ రాబడులు ఏమంత సంతృప్తికరంగా లేవు. ఎందుకిలా ?
–శివరాం, నల్లగొండ
రాబడులు కాలాన్ని బట్టి, స్టాక్ మార్కెట్ గమనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 2016లో మంచి రాబడులు ఇచ్చిన క్యాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఇప్పుడు అంతంత మాత్రం రాబడులిస్తోంది. మరో మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మూడేళ్ల కాలానికే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. కనీసం ఐదేళ్లు, అంతకు మించిన కాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
-ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment