system investment plan
-
కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేను ప్రతి నెలా కొంత మొత్తం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది మంచి ఫండేనా? దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –లావణ్య, విశాఖపట్టణం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్... ఆ కేటగిరీలోని అత్యుత్తమ ఫండ్స్‌లో ఒకటి. సాధారణంగా బ్లూచిప్ ఫండ్స్ అన్నీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. గత ఐదేళ్లలో ఈ ఫండ్ సగటు రాబడి 8 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 4 శాతం మేర నష్టపోయింది. ఇదే కాలానికి బీఎస్ఈ 100 సూచీ 11 శాతం మేర నష్టపోయింది. ఇక గత ఆర్నెల్లలో ఈ ఫండ్ ఒకింత రికవరీ అయింది. మంచి వృద్ధి అవకాశాలున్న అత్యున్నత స్థాయి నాణ్యత గల కంపెనీల్లోనే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. మార్కెట్ పుంజుకుంటే, ఈ ఫండ్ రాబడులు మరింతగా పెరుగుతాయి. ఈ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. షేర్లకు, బాండ్లకు మధ్య తేడా ఏమిటి? కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? –ఫయాజ్, విజయవాడ కంపెనీ యాజమాన్యంలో భాగస్వామ్యంగా గల వాటాలనే షేర్లుగా పరిగణిస్తారు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ట్రేడింగ్‌లో ఈ షేర్ల క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. సాధారణంగా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న షేర్లను కొనుగోలు చేస్తారు. షేర్ ధరల్లో వృద్ధి, బోనస్ షేర్లు, డివిడెండ్లు...తదితర ప్రయోజనాలు లభిస్తాయి. ఇక బాండ్ల జారీ ద్వారా కంపెనీ రుణాలను సమీకరిస్తుంది. ఈ బాండ్లకు కాలపరిమితి, వడ్డీరేటు ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్టులాంటిదే కంపెనీ బాండ్ కూడా. అయితే బ్యాంక్ డిపాజిట్లలాగా బాండ్లు సురక్షితమనే విషయం.. మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా కంపెనీ ఎంత పటిష్టమో అనే విషయాన్ని బట్టే ఆ కంపెనీ బాండ్ల నష్టభయం ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న కంపెనీ తన బాండ్లపై తక్కువ వడ్డీనే ఇవ్వవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉంటాయనే ధీమానే దీనికి కారణం. ఇక ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్న కంపెనీ అధిక వడ్డీరేటును ఆఫర్ చేయవచ్చు. కానీ ఇలాంటి కంపెనీల బాండ్లకు నష్ట భయం అధికంగా ఉంటుంది. కంపెనీ ఆర్థిక స్థితిగతులను కూలంకషంగా మదింపు చేసిన తర్వాతే కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రస్తుత పరిస్థితుల్లో ‘సిప్’లు ఆపేయాలా?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉంది కదా ! ఈ నేపథ్యంలో నా సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లను వాయిదా వేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? –ప్రియాంక, హైదరాబాద్ చాలా మంది ఇన్వెస్టర్లను ప్రస్తుతం అత్యధికంగా తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, సిప్‌లను ఆపేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సమీప భవిష్యత్తులో ఈ సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ములు మీకు అవసరం లేని పక్షంలో సిప్‌లను వాయిదా వేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదు. మార్కెట్ పుంజుకొని మళ్లీ పెరగడానికి ఎంత కాలం పడుతుందో సరైన అంచనాలు లేవు. మూడు నెలలు కావచ్చు. లేదా ఏడాది పట్టవచ్చు. మార్కెట్ రికవరీకి ఇంకా ఎక్కువ కాలమే పట్టినా, ఆశ్చర్యపోవలసిన పని లేదు. మార్కెట్ రికవరీకి ఎంత కాలం పట్టినా, మీరు మీ సిప్‌లను కొనసాగిస్తే, మీకు చౌకగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభించే అవకాశాలున్నాయి. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ సిప్‌లను నిరభ్యంతరంగా కొనసాగించండి. మార్కెట్ ఇంకా పతనమవుతుందనే భయాలతో ఇప్పటికిప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను అమ్మేస్తే, మీకు నష్టాలు రావచ్చు. మార్కెట్ పడుతుంది కదా అని మీ సిప్‌లను ఆపేస్తే, చౌకలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ప్రస్తుత మార్కెట్ పతన సమయంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువలు బాగా తగ్గి, మీకు నిరాశను కలిగిస్తున్నా, మీరు మాత్రం మీ సిప్‌లను ఆపేయక, కొనసాగించండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎనిమిది నుంచి పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకున్నాను. మూడేళ్ల రాబడులను పరిగణనలోకి తీసుకొని ఈ ఫండ్‌ను ఎంపిక చేశాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? నా దగ్గర ప్రస్తుతం రూ. లక్ష ఉన్నాయి. ఈ లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. –నరేంద్ర, విజయవాడ మీరు ఎంచుకున్న కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్ మంచిదే. ఈ కేటగిరీ ఫండ్స్‌లో మంచి రాబడులు అందిస్తున్న కొన్ని ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఏడాది నుంచి రెండేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. స్టాక్ మార్కెట్ ఉత్థాన, పతనాలు ఈక్విటీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపుతాయి. ఈ ఫండ్ కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తుతం ఈ ఫండ్ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫండ్ మీకు మంచి రాబడులనే అందించగలుగుతుంది. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుకులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మరింతగా మేలు కలుగుతుందనే చెప్పవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. మీ దగ్గర ఉన్న రూ. లక్షను కనీసం ఆరు నుంచి పన్నెండు సమభాగాలుగా విభజించి, నెలకు కొంత మొత్తం చొప్పున సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా ఇన్వెస్ట్ చేయండి. నేను 2013లో క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. 2016లో ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేసుకున్నాను. మంచి రాబడులే వచ్చాయి. ఇప్పుడు చూస్తే, ఆ ఫండ్ రాబడులు ఏమంత సంతృప్తికరంగా లేవు. ఎందుకిలా ? –శివరాం, నల్లగొండ రాబడులు కాలాన్ని బట్టి, స్టాక్ మార్కెట్ గమనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 2016లో మంచి రాబడులు ఇచ్చిన క్యాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఇప్పుడు అంతంత మాత్రం రాబడులిస్తోంది. మరో మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మూడేళ్ల కాలానికే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. కనీసం ఐదేళ్లు, అంతకు మించిన కాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇలా కూడా ‘సిప్’ చేయొచ్చు
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ముద్దుగా సిప్. ఇన్నాళ్లూ సిప్ అంటే మనకు తెలిసిందొకటే. నెలనెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం. కానీ... ఇపుడు సిప్ చేసే పద్ధతి కూడా మారుతోంది. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూనే... కావాలనుకున్నపుడు కొన్నాళ్లు విరామం తీసుకోవచ్చు. అంటే మార్కెట్లు మరీ గరిష్ట స్థాయిలో ఉన్నాయనిపిస్తే... ఆ నెలో, రెండు నెలలో సిప్ చేయటం ఆపేయొచ్చు. మళ్లీ కాస్త తగ్గాయనిపించినపుడు చేయొచ్చు. అదీ కొత్త కథ. అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం కూడా... కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ హెచ్చు తగ్గులు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సూచీలు గరిష్ట స్థాయిల వద్ద ఉన్నప్పటికీ చాలా షేర్లు విలువ పరంగా బాగా పడిపోయి ఉన్నాయి. కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... భవిష్యత్తులో పెరుగుతాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో సిప్ ఎంచుకోవడమే మంచిదంటున్నారు మార్కెట్ నిపుణులు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ ఖాతాదారులను ఆకర్షించడానికి సరికొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. అవి... డైలీ సిప్: నెలకు ఒకసారి కాకుండా ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేసేదే డైలీ సిప్. ఉదాహరణకు డాయిష్ మ్యూచువల్ ఫండ్ రోజుకు కనిష్టంగా రూ.300 చొప్పున కనిష్టంగా రెండు నెలలు ఇన్వెస్ట్ చేసేలా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐ సిప్: ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశమిచ్చేదే ఈ ఐ సిప్. దాదాపు అన్ని మ్యూచు వల్ ఫండ్ సంస్థలూ ఇపుడు ఆన్లైన్లో సిప్ ఇన్వెస్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చాయి. సిప్ పాజ్: రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూనే... చేతిలో డబ్బులు లేకున్నా, మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉండి తక్కువ యూనిట్లు వస్తాయనిపించినా బ్రేక్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ మధ్యే బరోడా పయనీర్ సిప్ పాజ్ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం వివిధ సందర్భాల్లో గరిష్టంగా 3 ఇన్స్టాల్మెంట్స్ వరకు ఆపొచ్చు. సిప్ ఇన్ డెట్: ఈ మధ్య కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెట్ ఫండ్స్‌లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్స్‌ను ఆరంభించాయి. ఎస్టీపీ: అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మీ దగ్గరున్న మొత్తాన్ని తక్కువ రిస్కుండే డెట్ పథకాల్లో మొదట ఇన్వెస్ట్ చేసి, దాన్నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి ప్రతి నెలా కొంత ఇన్వెస్ట్ చేసే విధానమిది. సిప్ పనిచేసేదిలా... స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అన్నదాంతో సంబంధం లేకుండా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమే సిప్. ఇలా చేసినపుడు మార్కెట్లు పడిపోతున్నాయనో, పెరిగిపోతున్నాయనో ఆందోళన ఉం డదు. ఎందుకంటే ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్నాం కనక... మార్కెట్లు బాగా పెరిగి ఉన్నపుడు మన సొమ్ముకు తక్కువ యూనిట్లు వచ్చినా... మార్కెట్లు తగ్గి ఉన్నపుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుందన్న మాట. అధిక లాభాలు... చిన్న ఉదాహరణ చూద్దాం. రాజేష్ 2009 ఫిబ్రవరిలో తన దగ్గరున్న రూ.1.2 లక్షలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్‌లో ఒకేసారి ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఈ ఐదేళ్లలో ఈ పథకం మొత్తమ్మీద 24 శాతం రాబడి అందించింది. అంటే రాజేష్ ఇన్వెస్ట్మెంట్ ఇపుడు రూ.1.48 లక్షలకు చేరింది. ఇదే ఫండ్‌లో రాకేష్ మాత్రం ఒకేసారి కాకుండా 2009 ఫిబ్రవరి నుంచి నెలకు రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఐదేళ్లలో తను కూడా రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ తనకు మొత్తమ్మీద 35 శాతం రాబడి లభించింది. తన మొత్తం ఇపుడు రూ.1.62 లక్షలకు చేరింది. గత ఐదేళ్లలో మన స్టాక్ మార్కెట్లు తీవ్రమైన హెచ్చు తగ్గులకు లోనవటంతో ఇది సంభవించింది. రాజేష్‌కు ఒకేసారి తన మొత్తమంతా పెట్టడం వల్ల వడ్డీ కూడా చాలావరకు నష్టపోయాడు. రాకేష్ మాత్రం నెలకు కొంత చొప్పున పెట్టడం వల్ల పెద్దగా ఇబ్బంది పడకున్నా తగిన లాభం మాత్రం పొందాడు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం సిప్ ప్రయోజనాలు... హా మార్కెట్లు పెరుగుతుంటే తక్కువ యూనిట్లు పతనం అవుతున్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి కనక కాస్ట్ యావరేజింగ్కి ఉపయోగపడుతుంది. మార్కెట్లు పెరుగుతాయా? పడతాయా? అనే సందేహాలను పక్కనబెట్టి ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వలన ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. కొంచెం కొంచెం మొత్తాలతో దీర్ఘకాలంలో పెద్ద నిధిని సమకూర్చుకోవచ్చు.