రెండేళ్ల పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్ | Best arbitrage funds to investment in two years | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్

Published Mon, Nov 30 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

రెండేళ్ల పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్

రెండేళ్ల పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్

ప్రస్తుతం నా దగ్గర రూ. 2 లక్షలున్నాయి. నా కూతురు ప్రస్తుతం పదవ తరగతి చదువుతోంది. ఈ డబ్బులను తన ఉన్నత విద్య కోసం  వినియోగించాలనుకుంటున్నాను. అంటే రెండు/మూడేళ్ల తర్వాత ఈ డబ్బులు నాకు అవసరం అవుతాయి. అప్పటిదాకా ఈ సొమ్ములను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు ? లిక్విడ్ స్కీమ్, డైనమిక్ బాండ్ ఫండ్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్‌లోనా ? తగిన సలహా ఇవ్వండి.
 - శ్రీనివాస్, గుంటూరు


 మీ జాబితా నుంచి లిక్విడ్ ఫండ్స్‌ను తీసేయండి. స్వల్పకాలిక పెట్టుబడుల కోసమైతేనే లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని వారాలు, లేదా నెలలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ ఫండ్స్‌ను పరిశీలించాలి.  మూడేళ్లకు ముందే మీకు ఈ డబ్బులు అవసరమైతే, మీరు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. పన్ను అంశాల దృష్ట్యా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే ఈ ఫండ్స్‌లో ఏడాదికి మించి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల తర్వాత మీకు  ఈ డబ్బులు అవసరమైన పక్షంలో డైనమిక్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక అధిక పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ ఫండ్స్‌లో మీ పెట్టుబడులను మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తే మీరు 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి(ఇండెక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. ఒకవేళ మూడేళ్లలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. వీటిని మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను ట్యాక్స్ శ్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. వడ్డీరేట్లు తగ్గితే, డైనమిక్ బాండ్ ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి.

నా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ కాలపరిమితి వచ్చే ఏడాది ముగియనున్నది. దీనిని పొడిగించుకోవచ్చా ? పొడిగించుకోవాలంటే నేను ఏం చేయాలి?           - సౌభాగ్య, హైదరాబాద్

 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్) అకౌంట్ కాలపరిమితి ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ ఎస్‌సీఎస్‌ఎస్ అకౌంట్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. లేదా ఈ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు తీసుకోవాలంటే, ఫారమ్ ఈను పాస్‌బుక్‌తో పాటు సమర్పించాలి. అకౌంట్‌ను పొడిగించుకోవాలంటే ఏడాదిలోపు ఫారమ్ బిని సమర్పించాలి. అకౌంట్ పొడిగింపు మీరు దరఖాస్తు చేసినప్పటి నుంచి కాకుండా మెచ్యూరిటీ తేదీ నుంచి మరో మూడేళ్లు ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఫారమ్‌ను డిపాజిటర్ దాఖలు చేయలేకపోతే, అకౌంట్‌ను మూసివేసినట్లుగానే భావిస్తారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు ఎంతైతే వడ్డీరేటు వస్తుందో అంతే వడ్డీరేటు మెచ్యూరిటీ అకౌంట్‌పై వస్తుంది.
 
పదేళ్ల క్రితం రెండు జీవన్ సరళ్ పాలసీలు తీసుకున్నాను. ఒక్కోదానికి ఏడాది ప్రీమియం రూ. 24,000గా ఉంది. ఈ పాలసీలను కొనసాగించమంటారా?                      - జాన్సన్, నెల్లూరు


 ఎల్ ఐసీ జీవన్ సరళ్ పాలసీ ఎండోమెంట్ పాల సీ. ఇలాంటి పాలసీలకు  వ్యయాలకు సంబంధించి పారదర్శక విధానాలుండవు. బీమా మొత్తానికి కొంత లాయల్టీ బోనస్‌ను కలిపి చెల్లిస్తారు. పదవ పాలసీ సంవత్సరం నుంచి లాయల్టీ మొత్తాలను పొందవచ్చు. మీరు ఈ పాలసీ తీసుకొని పదేళ్లయినందున మీకు లాయల్టీ బోనస్ అందిఉండాలి. కొంత మొత్తాన్ని పదేళ్ల పాటు  డిపాజిట్ చేస్తే ఏడాదికి 7.5 శాతం వడ్డీ లెక్కేసుకున్నా ఆ మొత్తం రెట్టింపవుతుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా  ఈ పాలసీ ఇవ్వలేదనే చెప్పవచ్చు. మీరు చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి చూస్తే, మీ జీవన్ సరళ్ పాలసీ రూ.5 లక్షల బీమా ఉంటుందని తెలుస్తోంది. మీపై ఆధారపడినవారికి వారి ఆర్థిక అవసరాలను ఈ మొత్తం తీర్చలేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది తగిన జీవిత బీమాను ఇవ్వలేదు. మరోవైపు ఇది ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ కాదని చెప్పవచ్చు.  అందుకని ఇలా బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలసిన స్కీమ్‌లకు దూరంగా ఉండమని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తాం. జీవిత బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇవి చాలా చౌక. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ మొత్తానికి బీమా పాలసీ తీసుకోవచ్చు. మీకు కనుక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటే, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు  కొంత మొత్తాన్ని ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
 
 ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement