అనుకోకుండా ఒక లావాదేవీ ద్వారా రూ. 30 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులు ప్రస్తుతం నాకు అవసరం లేదు. వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలో సలహా ఇవ్వండి. ? – వీరేష్, నెల్లూరు
ఈ సొమ్ములను మీరు ఎలా ఉపయోగిస్తారో అనే దానిని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు ఉంటాయి. మార్కెట్ బాగా ఉంది కదా అని గుడ్డిగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం సరైన పనికాదు. జీవితంలో ఇలాంటి అనూహ్య లాభాలు ఒక్కసారి వస్తాయి. అందుకని ఈ సొమ్ములను ఇన్వెస్ట్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అనూహ్య లాభాలు కాబట్టి.. ఎలా బడితే అలా ఇన్వెస్ట్ చేయకండి.
సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ని మూడేళ్ల పాటు పాటించండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థకు చెందిన ఒకటి లేదు రెండు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ రూ.30 లక్షల మొత్తాన్ని ఈ డెట్ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయండి. నెలకు కొంత మొత్తం చొప్పున ఈ ఫండ్స్ నుంచి ఎస్‌టీపీ మార్గంలో మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ ఫండ్స్‌లోకి ఈ పెట్టుబడులను బదిలీ చేయండి. ఈ ఈక్విటీ ఫండ్స్‌లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం ఐదేళ్లపాటైనా కొనసాగిస్తే, మీకు మంచి రాబడులు వస్తాయి.
నేను నా పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం నెలకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. తగిన సూచనలు ఇవ్వండి ? – మనోజ్, కరీంనగర్
పిల్లల ఉన్నత చదువులకు వివిధ దశల్లో పెద్ద మొత్తాలు అవసరమవుతాయి. పాఠశాల విద్య ముగిసిన తర్వాత వాళ్లు కాలేజీలో చేరేటప్పుడు, కాలేజీ విద్య ముగిసి, డిగ్రీలో చేరేటప్పుడు, ఆ తర్వాత పీజీ చేసేటప్పుడు మీకు డబ్బులు అవసరమవుతాయి. మొదటి దశ డబ్బులు మరో ఐదేళ్లలో అవసరమనుకుంటే, ముందుగా ఒక బ్యాలన్స్‌డ్ ఫండ్‌లో ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. రెండో దశ డబ్బులు మరో పదేళ్లలో అవసరమనుకుంటే ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని మల్టీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.
మూడో దశకు అవసరమైన డబ్బులు మరో పదిహేనేళ్లలో అవసరమనుకుంటే ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్‌లో ప్రతి నెలా కొంత, కొంత మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఆయా దశ డబ్బులు అవసరమయ్యే ఏడాదికి ముందే ఆయా ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు మొదటి దశ డబ్బులు మీకు ఐదేళ్లలో అవసరమనుకుంటే, నాలుగో ఏట నుంచి ఆ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. ఐదే ఏటనే తీసుకోవాలనుకుంటే మార్కెట్ పతన బాటలో ఉంటే మీకు తగిన రాబడులు రావు. అందుకని ఒక ఏడాది ముందే ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరించుకుంటే మంచిది.
నేను ఒక సెక్టోరియల్ ఫండ్‌లో రెండు నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన ఫండ్‌ను సూచించండి? – కల్పన, హైదరాబాద్
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానర్థం డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందాలని. అయితే సెక్టోరియల్ ఫండ్స్ దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఫండ్స్ కేవలం ఒక్క రంగం కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బలమైన కారణాలుండాలి.
మీ పోర్ట్‌ఫోలియోలో లేని రంగం కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి సెక్టోరియల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. లేకుంటే. సదరు రంగంపై మీకు అపారమైన అవగాహన, పరిజ్ఞానం ఉండి, భవిష్యత్తులో ఈ రంగం అంతులేని వృద్ధిని సాధిస్తుందనే అంచనాలు మీకు ఉంటేనే సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇవేవీ లేనప్పుడు సెక్టోరియల్ ఫండ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
నేను కోటక్ గోల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ బాగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పుత్తడిపై పెట్టుబడి పెట్టడం సమంజసమేనా ? – సారథి, విజయవాడ
భారత్‌లో పుత్తడికి బాగా ప్రాధాన్యం ఉంది. కానీ దీర్ఘకాలంగా ఇది మంచి రాబడులనిస్తుందనే నమ్మకం చాలా మంది మార్కెట్ నిపుణుల్లో ఉండదు. కొన్ని యాదృచ్చిక కారణాల వల్ల మాత్రమే గత కొంత కాలంగా ఇది ఆకర్షణీయమైన పెట్టుబడిగా నిలుస్తోంది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, పుత్తడి ఈటీఎఫ్‌లు అందుబాటులోకి రావడం వల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. కాదూ, కూడదు పుత్తడిలో కొంతైనా పెట్టుబడి పెట్టాల్సిందేనన్న పట్టుదల మీకు ఉంటే సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. పుత్తడి రాబడులతో పాటు కొంత వడ్డీ కూడా మీరు పొందవచ్చు. వివిధ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పుత్తడిని కాదు.
అత్యవసర నిధి పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – వెంకట్, విశాఖ పట్టణం
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోగలిగే వీలుండేలా అత్యవసర నిధి పెట్టుబడులు ఉండాలి. ఈ తరహా అత్యవసర నిధి పెట్టుబడులపై వీలైనంత ఎక్కువగా రాబడి పొందాలనే ఆలోచన సరైనదే. సాధారణంగా అత్యవసర నిధులను చాలా మంది సేవింగ్స్ ఖాతాలో ఉంచేస్తారు. దీనిపై వచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అంతకంటే అధికంగానే రాబడులు పొందవచ్చు.
అదృష్టవశాత్తూ మూడేళ్ల పాటు ఈ అత్యవసర నిధి సొమ్ములను వాడే అవసరం మీకు రాకుంటే, మూడేళ్ల పాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌లో కొనసాగిస్తే, మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.50,000 దాకా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, రిడీమ్ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్‌మ్యూచువల్ ఫండ్ వంటి కొన్ని సంస్థలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మీరు అరగంట నుంచి గంట వ్యవధిలోనే లిక్విడ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేసుకోవచ్చు.
- ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment