మ్యూచువల్ ఫండ్స్ కన్నా పీఎంఎస్‌లు బెటరా?
ప్రస్తుతం నా వయస్సు 35 సంవత్సరాలు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో, మరికొంత అదనపు ఇన్వెస్ట్‌మెంట్స్‌తో టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్(గ్రోత్ ఆప్షన్)లో ఇప్పటివరకూ రూ.8 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. అయితే 10 నుంచి 10 ఏళ్ల కాలానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్ ఆకర్షణీయ రాబడులనిస్తుందని నా మిత్రుడొకడు చెప్పాడు. అందుకని టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరించుకొని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? తగిన సలహా ఇవ్వండి
- రాజారామ్, విజయవాడ
సంప్రదాయక ఇన్వెస్టర్లకు టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనమని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటిసారిగా స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్ మంచి ఎంపిక. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీకి కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఒడిదుడుకులు, నష్ట భయం తక్కువగా ఉంటాయి. మీరు మారాలనుకుంటున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్‌కు తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. రిస్క్ కూడా ఎక్కువే. 2008లో ఈ ఫండ్ 55 శాతం క్షీణించింది. ఈ స్థాయి నష్టభయాన్ని తట్టుకోగలను అనుకుంటే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్‌కు నిరభ్యంతరంగా మారిపోండి. ఈ తరహా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ మధ్య కాలానికి తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతాయి. అయితే దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి. ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున 2010 జూలై నుంచి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో అయితే రూ.12,22,192గానూ, టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో అయితే రూ.10,53,354గానూ ఉండేది.
నేను వివిధ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు పంపే అకౌంట్ స్టేట్‌మెంట్‌లు జాయింట్ పేర్లతో ఉన్నాయి. ఈ జాయింట్ పేర్లలో ఒక దానిని(మొదటి లేదా సెకండ్ హోల్డర్) తొలగించాలనుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా మారిపోయాయి. వీటిని నా మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఎలా అప్‌డేట్ చేయించాలి?
- రాధిక. నిజామాబాద్
యూనిట్ హోల్డర్ల పేర్లు తొలగించడానికి, మార్పు చేయడానికి వీలు లేదు. ఇన్వెస్టర్ మరణించినప్పుడు మాత్రమే సదరు వ్యక్తి పేరును తొలగించడం కుదురుతుంది. ఒక వేళ మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు డీమ్యాట్ మోడ్‌లో ఉంటే, వేరే డీమ్యాట్ అకౌంట్‌కు ఈ యూనిట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చాలనుకుంటే, మార్చాలనుకుంటున్న వివరాలను, సంబంధిత రుజువులతో ఒక రిక్వెస్ట్ లెటర్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థలకు పంపించండి. మీరు పంపిన వివరాలు, సంబంధిత రుజువుల ప్రకారం మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో అప్‌డేట్ చేస్తారు. భవిష్యత్తులో మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, ఈ మేరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మీ బ్యాంకు ఖాతాలోకి సొమ్ములొస్తాయి.
నేనొక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. నా రిటైర్మెంట్ సమయంలో నేను పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. అదిప్పుడు మెచ్యూరయింది. వీటితో కలిపి నా దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రూ.15 లక్షలున్నాయి. కనీసం ఏడాది వరకూ నాకు ఈ డబ్బులతో అవసరం ఉండదు. నాకు 10-12% రాబడి వస్తే చాలు. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లిక్విడిటీ కూడా ఉండాలి. తగిన సూచనలివ్వండి.
- సాయిసురేశ్, నెల్లూరు
మీ డబ్బును మంథ్లీ ఇన్‌కం ప్లాన్(ఎంఐపీ) వంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ ఫండ్స్ ఎక్కువ మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీల్లోనూ. 10-25% వరకూ ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను ఇవి ఇస్తాయి. వీటిల్లో మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఇవి పేరుకు తగ్గట్లుగా రెగ్యులర్ ఆదాయం ఇస్తాయని పొరబడకండి. మీ పెన్షన్ ఆదాయానికి అనుబంధంగా మాత్రమే ఈ రాబడులు ఉపయోగపడతాయి. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, ఎంఐపీ, బ్యాంక్ డిపాజిట్లు మాత్రమే గ్యారంటీడ్ రెగ్యులర్ రాబడులనిస్తాయి. కానీ ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను మాత్రం ఇవ్వలేవు.
మ్యూచువల్ ఫండ్స్ కన్నా పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ మేనేజ్‌మెంట్(పీఎంఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని విన్నాను. గత ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కన్నా పీఎంఎస్‌లోనే ఎక్కువ రాబడులు వచ్చాయి. పీఎంఎస్ పనితీరును మనం ఎలా అంచనా వేయవచ్చు?
- సుదీప్ జైన్, సికింద్రాబాద్
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్(పీఎంఎస్)లో స్టాక్స్, డెట్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్ని కలగలిపి ఉంటాయి. పీఎంఎస్ పనితీరును వెల్లడించే వివరాలేవీ అందుబాటులో లేవు. పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కనీసం రూ.25 లక్షలు కావాలి. ఒక్కో వ్యక్తి వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను బట్టి పీఎంఎస్ సర్వీసులుంటాయి. అందుకని ఒక్క పీఎంఎస్ స్కీమ్‌తో మరొక పీఎంఎస్ స్కీమ్‌ను పోల్చడానికి వీలు లేదు. పీఎంఎస్‌తో పోల్చితే మ్యూచువల్ స్కీమ్‌లు పారదర్శకంగా ఉంటాయి. వీటి పనితీరు, ట్రాక్ రికార్డ్ అందుబాటులో ఉంటాయి. అయితే మీరు విన్నట్లుగా మ్యూచువల్ ఫండ్స్ కంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్‌లు మంచి రాబడులనే ఇస్తాయి.
ధీరేంద్ర కుమర్