డెరైక్ట్ ప్లాన్ ప్రయోజనాలేంటి? | what is the use of direct plan | Sakshi
Sakshi News home page

డెరైక్ట్ ప్లాన్ ప్రయోజనాలేంటి?

Published Mon, Jun 15 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

డెరైక్ట్ ప్లాన్ ప్రయోజనాలేంటి?

డెరైక్ట్ ప్లాన్ ప్రయోజనాలేంటి?

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి డెరైక్ట్ ఆప్షన్ అంటే ఏమిటి ? దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఇలా డెరైక్ట్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్లకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
- వందన, హైదరాబాద్


మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి రెండు విధానాలున్నాయి. ఒకటి డెరైక్ట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం. రెండోది రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం.  ఏదైనా మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీరు నేరుగా సదరు మ్యూచువల ఫండ్‌తోనే లావాదేవీలు చేసినట్లు లెక్క. ఇక రెగ్యులర్ ప్లాన్‌లో అయితే డిస్ట్రిబ్యూటర్/అడ్వైజర్/ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే సదరు డిస్ట్రిబ్యూటర్/అడ్వైజర్/ఏజెంట్‌లకు కొంత కమీషన్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది. ఇలాంటి కమీషన్‌లు మీకు వచ్చే రాబడులపై ప్రభావం చూపుతాయి.  డెరైక్ట్ ప్లాన్‌లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి కమీషన్లు ఉండవు. కాబట్టి మీకు రాబడులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. 2012, సెప్టెంబర్‌లో సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి చాలా సంస్కరణలను తెచ్చింది. వాటిల్లో డెరైక్ట్ ప్లాన్‌లు ఒకటి. ఇప్పుడు ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ డెరైక్ట్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్‌కు ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది.

ఎన్‌ఏవీలు కూడా డెరైక్ట్ ప్లాన్‌కు, రెగ్యులర్ ప్లాన్‌కు తేడాగా ఉంటాయి. డెరైక్ట్ ప్లాన్ అయినా, రెగ్యులర్ ప్లాన్ అయినా సదరు స్కీమ్ పోర్ట్‌ఫోలియో ఒకే విధంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యం, నిధుల కేటాయింపు, మదుపు వ్యూహం, ఎగ్జిట్ లోడ్, నష్టభయ అంశాలు, ఇతర అంశాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. అయితే  సరైన ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోవాలంటే కొంచెం కష్టపడక తప్పదు. డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లకు సంబంధించి ఒక ఉదాహరణను చూస్తే,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో 2.07గా ఉండగా, డెరైక్ట్ ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.2గా ఉంది. ఎలాంటి కమీషన్ల బెడద ఉండదు కాబట్టి డెరైక్ట ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో 42 శాతం తక్కువగా ఉంది. ఇక రాబడుల విషయానికొస్తే, రెగ్యులర్ ప్లాన్ 18 శాతం, డెరైక్ట్ ప్లాన్ 19 శాతం చొప్పున రిటర్న్‌లను ఇచ్చాయి. స్వల్పకాలానికి పెద్దగా తేడా లేకపోయినా, దీర్ఘకాలంలో మాత్రం రాబడుల్లో భారీగా వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు.

చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థల ఈక్విటీ ఫండ్స్ ఎక్స్‌పెన్స్ రేషియో 2 నుంచి 3 శాతంగా ఉంటోంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రకటించే రాబడుల్లో ఈ ఎక్స్‌పెన్స్ రేషియోను మినహాయిస్తారా? ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ 22 శాతం రాబడులు వస్తాయని పేర్కొంటే, ఎక్స్‌పెన్స్ రేషియోను మినహాయించి మిగిలింది చెల్లిస్తారా? లేకుంటే మొత్తం 22 శాతం రాబడులను పూర్తిగా చెల్లిస్తారా? ఎన్‌ఏవీలో దీనిని కలిపేసే చెబుతారా?                  
- రాజ్, గుంటూరు

అన్ని చార్జీలు, వ్యయాలను మినహాయించిన తర్వాతనే ఎన్‌ఏవీని నిర్ణయిస్తారు. ఏదైనా ఒక ఫండ్ రాబడులు 22 శాతం వస్తాయని మ్యూచువల్ ఫండ్ సంస్థ పేర్కొంటే అంతే మొత్తం రాబడులు మీకు వస్తాయి.

నేను రెండు బీమా పాలసీలు తీసుకున్నాను. ఒకటి ఎల్‌ఐసీ న్యూ బీమా గోల్డ్ టి179(2010లో తీసుకున్నా, 16 ఏళ్ల పాలసీ, ప్రీమియం రూ.30,000 ఏడాదికి. ఇది మనీ బ్యాక్ పాలసీ) రెండోది  ఐసీఐసీఐ ప్రు లైఫ్ వెల్త్ బిల్డర్(2011లో తీసుకున్నా, 10 ఏళ్ల పాలసీ, 30 వేల ప్రీమియం ఏడాదికి). ఇక గత ఏడాది నవంబర్ నుంచి యాక్సిస్, ఐసీఐసీఐ ఈఎల్‌ఎస్‌ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్స్‌లో నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఈ రెండు బీమా పాలసీల్లో ఒకదానిని సరెండర్ చేసి, ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచాలని ఆలోచిస్తున్నాను. దేనిని సరెండర్ చేయమంటారు? సరెండర్ చేసిన పక్షంలో ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
- సతీష్, కరీంనగర్


బీమాను, మదుపును కలగలిపి ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. మీరు తీసుకున్న రెండు బీమా పాలసీలు అలాంటివే. ఎల్‌ఐసీ న్యూ బీమా గోల్డ్ మనీ బ్యాక్ పాలసీ కాగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ వెల్త్ బిల్డర్ యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచడానికి రెండింట్లో ఏదో ఒకదానిని సరెండర్ చేయాలనేది మీ యోచన. ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేస్తే మంచిది. కారణాలు రెండే, ఈ పాలసీకి సంబంధించిన వ్యయాలను సరైన రీతిలో ఎల్‌ఐసీ వెల్లడించడం లేదు. రెండోది పాలసీ కాలవ్యవధి(16 సంవత్సరాలు) ఎక్కువగా ఉంది. ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు బీమా రక్షణ ఉండదు. అందుకని మీరు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. పాలసీ వ్యవధి ఇంకా ఐదేళ్లు పూర్తి కాలేదు. కాబట్టి  ఈ పాలసీని సరెండర్ చేయగా వచ్చిన మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను విధిస్తారు.

ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement