కొత్త సిప్ మొదలుపెట్టండి..
ఇటీవల నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది. దీంతో నా ఆదాయం పెరిగింది. ఆదాయం పెరగడంతో నా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మొత్తాన్ని కొంచెం పెంచితే బావుంటుందని నా శ్రీమతి సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుత సిప్‌లో మార్పులు, చేర్పులు కుదరవని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటున్నాయి. సిప్ మొత్తాన్ని ఎలా పెంచుకోవాలి?
- అర్జున్, విజయవాడ
ఆదాయం పెరిగినందున సిప్ మొత్తాన్ని పెంచుకోమని మీ శ్రీమతి సరైన సలహానే ఇచ్చారు. అయితే చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ మొత్తంలో మార్పులు, చేర్పులు చేయడాన్ని ప్రోత్సహించవు. దీనిని అధిగమించడానికి రెండు మార్గాలున్నాయి. ఎంత మొత్తం పెంచుకోవాలనుకుంటున్నారో అంత మొత్తానికి కొత్త సిప్‌ను మొదలుపెట్టండి. లేదా ప్రస్తుతమున్న సిప్‌ను క్యాన్సిల్ చేసుకొని, పెరిగిన మొత్తంతో కొత్త సిప్‌ను ప్రారంభించండి. ఏ మార్గాన్ని అనుసరించినా ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్‌లోనే సిప్‌ను కొనసాగిస్తే మంచిది.
నా వయస్సు 32 సంవత్సరాలు. ఇటీవలే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. పన్నుల పరంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్), రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌కు మధ్య ఉన్న తేడాలేంటి? నేను ప్రస్తుతం నెలకు రూ.5,000 చొప్పున సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే వీటిల్లో ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ ఏమీ లేవు. సెక్షన్ 80 సీ కింద రూ. లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందుతున్నాను. సెక్షన్ 80సీ కింద రూ. లక్షన్నర వరకూ ఉన్న పన్ను మినహాయింపులను పొందడానికి ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
- రాజశేఖర్, హైదరాబాద్
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌ను ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ. లక్షన్నర పన్ను మినహాయింపు ఆదాయం పొందే మార్గాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒకటి. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీ పన్ను ప్రయోజనాలు పొందలేరు. మీరు ఇప్పుడు సెక్షన్ 80 సీ కింద రూ. లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందుతున్నారు.
ఈ సెక్షన్ కింద రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు ఈ పన్ను మినహాయింపును పూర్తి స్థాయిలో పొందడం లేదు కాబట్టి ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపుకు అర్హమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో అత్యంత అధిక రాబడులనిచ్చేవిగా ఈఎల్‌ఎస్‌ఎస్‌లను పేర్కొనవచ్చు.
నా వయస్సు 40 సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.5,000 చొప్పున ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యాక్సిమైజర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సూచించారు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా?
- మహ్మద్ జానీ. నిజామాబాద్.
మీ మిత్రుడు సూచించింది బీమా ప్రొడక్ట్. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎప్పుడూ బీమా సాధానాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్ ఉన్న ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌లు ఇటు బీమా అవసరాలను, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను అందుకోలేవు. బీమా అవసరాల కోసం ఎప్పుడూ టర్మ్ ప్లాన్‌లనే ఎంచుకోవాలి. ఇవి అత్యంత చౌకైనవి. బీమాకు అత్యంత మెరుగైనవి కూడా.
ఇక ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీకు స్టాక్‌మార్కెట్‌తో బొత్తిగా పరిచయం లేకపోతే మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.సాధారణ ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి ఎంపిక. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో మిశ్రమంగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్నప్పుడు మీకు రక్షణ లభిస్తుంది.
నేను చెల్లించాల్సిన గృహ రుణ మొత్తం రూ. 13,50,000గా ఉంది. మరో 16 ఏళ్లపాటు నెలవారీ సమాన వాయిదా (ఈఎంఐ)లు చెల్లించాల్సి ఉంది. ఇటీవల నాకు రూ.3,00,000 వరకూ సొమ్ములొచ్చాయి. ఈ డబ్బులతో గృహ రుణంలో కొంత మొత్తం చెల్లించమంటారా ? లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదైతే ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి?
- వైదేహి, తిరుపతి
నెలవారీ సమాన వాయిదాలు(ఈఎంఐలు) చెల్లించడంలో ఆర్థికపరంగా మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే ఆ డబ్బులను గృహరుణం తీర్చడానికి ఉపయోగించండి. ఈఎంఐలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. గృహ రుణం మంచి రుణమని చెప్పవచ్చు. గృహ రుణం కారణంగా మనకు ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది. పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అద్దె డబ్బులు మిగులుతాయి. తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనాలూ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, ఏదైనా మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకొని, దాంట్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
మా అమ్మగారు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.35 లక్షల వరకూ వచ్చాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఇన్వెస్ట్ చేస్తానని ఆమె అంటోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పాను. పెట్టుబడి సురక్షితంగా ఉంటూ, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులిచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. రెండు నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలని మా అమ్మగారు భావిస్తున్నారు.
- వెంకట్, గుంటూరు
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను పొం దలేం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు కావాలనుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే రెండు, మూడేళ్ల కాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధా నం కాదు. ఒక వేళ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసినప్పటికీ, పన్ను ప్రయోజనాలు పొందలేరు.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైనవి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం మంచి రాబడులను ఇస్తాయి. అయితే మార్కెట్ పనితీరును బట్టే వీటి రాబడులు ఉంటా యి. మీ అమ్మగారు అధిక పన్ను బ్రాకెట్‌లో ఉండి ఉంటే, మూడేళ్ల పాటు ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డెట్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మూడేళ్లలోపే డబ్బులు కావాలనుకుంటే షార్ట్-టర్మ్ డెట్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్