నెట్‌వర్త్ నిబంధనపై ఆందోళన వద్దు.. | Do not worry on the net worth covenant. | Sakshi
Sakshi News home page

నెట్‌వర్త్ నిబంధనపై ఆందోళన వద్దు..

Published Mon, Jun 9 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

నెట్‌వర్త్ నిబంధనపై ఆందోళన వద్దు..

నెట్‌వర్త్ నిబంధనపై ఆందోళన వద్దు..

నేను ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇటీవల సెబి మ్యూచువల్ ఫండ్లకు రూ.50 కోట్ల నెట్‌వర్త్ పరిమితిని విధించింది. ఈ నేపథ్యంలో చిన్న ఇన్వెస్టర్లపై ఏమైనా ప్రభావం పడుతుందా ? నా సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ?         - మరియన్న, నెల్లూరు
 
క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించండి. గత ఐదేళ్ల కాలంలో కేవలం 2013లో మాత్రమే ఈ ఫండ్ మంచి పనితీరును కనబరచలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.25 శాతంగా ఉంది. ఇతర ఈక్విటీ ఫండ్స్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.25 నుంచి 1.5 శాతంగా ఉంది. ఈ ఫండ్ పనితీరు బాగా ఉండడం, ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్లకు మంచి రాబడులు వస్తున్నాయి.
 
ఫండమెంటల్స్ పరంగా చూసినా, ఈ కేటగిరి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయదగ్గ ఫండ్ ఇది. ఇక క్వాంటమ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రస్తుత నెట్‌వర్త్ రూ.25.74 కోట్లుగా ఉంది. నెట్‌వర్త్ అవసరాలను సెబి రూ.50 కోట్లకు పెంచింది. నెట్‌వర్త్ తక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నిర్దేశించిన రూ.50 కోట్ల నెట్‌వర్త్ పరిమితిని అందుకోవడానికి మూడేళ్ల సమయాన్నిచ్చింది. మీ క్వాంటమ్ ఫండ్ సెబి నెట్‌వర్త్ నిబంధనను అందుకోవడానికి మరో మూడేళ్ల సమయముంది. కాబట్టి ఆందోళన చెందకుండా సదరు మ్యూచువల్ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయొచ్చు.
 
 నేను యూటీఐ ఆపర్చునిటీస్, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తు ఉన్నాను. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ నాకు మంచి రాబడులనిస్తాయా? - నందిని, తిరుపతి
 
 మీరు చాలా మంచి ఫండ్స్‌నే ఎంచుకున్నారు. ఇవన్నీ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. వివిధ రకాల మార్కెట్ క్యాపిటలైజేషన్లు, వివిధ రంగాల కంపెనీల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. గత 5-6 ఏళ్లలో మార్కెట్లు అనిశ్చితిగా ఉన్నప్పటికీ, ఈ ఫండ్స్ మంచి పనితీరునే కనబరిచాయి. ప్రస్తుతం మార్కెట్లు మంచి రైజింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో  ఫండ్స్ మంచి రాబడులనే అందించగలవు. ఎలాంటి శషభిషలు లేకుండా ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.
 
 నేను ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ  టాప్ 200 ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను.  ఏదైనా ఒక షార్ట్‌టెర్మ్ డెట్ ఫండ్‌లో ఒకేసారి రూ.రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అంతేకాకుండా  మరో  మిడ్-క్యాప్ ఫండ్‌లో కూడా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి.                         - జుబేదా బేగం, హైదరాబాద్
 
మిడ్-క్యాప్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకోవడం మంచి ఆలోచన. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి మిడ్-క్యాప్ ఫండ్స్- బీఎన్‌పీ పారిబస్ మిడ్ క్యాప్, రెలిగేర్ ఇన్వెస్కో మిడ్ ఎన్ స్మాల్‌క్యాప్ ఫండ్. వీటిల్లో ఏదైనా ఒక ఫండ్‌ను ఎంచుకోండి. అంతేకాకుండా ఇదే ఫండ్ ఫ్యామిలీ నుంచి ఏదైనా షార్ట్-టెర్మ్ డెట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.  
 
నేను కొన్ని ఫండ్స్ డెరైక్ట్ గ్రోత్ స్కీముల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 15-20 శాతం రాబడులను ఆర్జించగలిగాను. వచ్చిన లాభాలను ఇదే మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లిద్దామనుకుంటున్నాను.  నా ఆలోచనా విధానం కరెక్టేనా?         -అనంతరామ్, వరంగల్
 
మార్కెట్ల ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకుండా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడమే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ముఖ్య ఉద్దేశం.  మీరు ఇన్వెస్ట్ చేస్తున్న సొమ్ములు 2 లేదా 3 ఏళ్లలో మీకు అవసరమైన పక్షంలో  వచ్చిన లాభాలను డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవచ్చు. అలా కాకుండా  మీరు ఇన్వెస్ట్ చేస్తున్న సొమ్ములు మీకు పదేళ్లలోపు అవసరం లేదనుకోండి.. ఈ స్కీమ్‌ల్లోనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్లు ఎప్పుడూ అనిశ్చితిగా ఉంటాయి. ఎప్పుడు ఎంత వరకూ పడతాయో, ఎంత వరకూ పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతా సానుకూలంగా ఉంటే మార్కెట్లు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించగలవు. అందుకని మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి తగినంత సమయముంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగించండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement