తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్? | Dhirendra Kumar, CEO, Value Research interview | Sakshi
Sakshi News home page

తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్?

Published Mon, Sep 9 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్?

తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్?

 గత ఏడాది రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ లాకిన్ పీరియడ్ మూడేళ్లు. ప్రస్తుతం ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. పన్ను ఆదా కోసం ఈ ఫండ్‌లో పెట్టుబడులు కొనసాగించమంటారా? లేక మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టమంటారా? 
 - శ్రీనివాసరావు, నెల్లూరు
 ఈ ఏడాది ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు క్షీణత 12 శాతంగా ఉండగా, ఈ ఫండ్ 21.45 శాతం క్షీణించింది. ఈ ఫండ్ -మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా (మొత్తం పోర్ట్‌ఫోలియోలో 84 శాతం) ఇన్వెస్ట్ చేయడం ఇంత అధ్వాన పనితీరుకు కారణం. ఈ ఏడాది సెన్సెక్స్ 5 శాతం క్షీణించగా, బీఎస్‌ఈ మిడ్ క్యాప్, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్‌లు 25 శాతం నుంచి 30 శాతం వరకూ క్షీణించాయి. అందుకే ఈ ఫండ్ రేటింగ్‌ను ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు తగ్గించాం. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువ పెట్టుబడులు వద్దనుకుంటే లార్జ్ క్యాప్ షేర్లలో అధికంగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవి స్థిరమైన రాబడులనిస్తున్నాయి. 
 
 నా వయస్సు 26 సంవత్సరాలు. నేను ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇదే నా మొదటి మదుపు.  కనిష్ట రిస్క్, గరిష్ట ప్రయోజనాలు లభించే ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను సూచించండి?
 - కాత్యాయిని, విశాఖ పట్టణం
 మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితేనే ఈ స్థాయి రాబడులు వస్తాయి. స్టాక్  మార్కెట్ల రోజువారీ కదలికలకు అనుగుణంగా ఈ ఫండ్స్ కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. మీరు తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నందున, రిస్క్ తక్కువగా ఉండాలనుకుంటున్నందున హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 65 శాతం వాటాను ఈక్విటీల్లో, మిగిలిన వాటాను డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెడతాయి. స్టాక్ మార్కెట్లు పెరిగినప్పుడు ఈ ఈక్విటీ వాటా అధిక వృద్ధిని అందిస్తుంది. స్టాక్‌మార్కెట్లు కుదేలైనప్పుడు డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కుషన్‌గా పనిచేస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లు కదం తొక్కుతున్నప్పుడు మామూలు ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే  ఈ హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్  కొంచెం డల్‌గా అనిపిస్తాయి. అయితే పెట్టుబడి వృద్ధి, రాబడి, భద్రత వంటి అంశాల పరంగా చూసినప్పుడు ఇవి ఉత్తమమైనవని చెప్పవచ్చు. అందుకని రెండు ఉత్తమమైన బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిప్ ద్వారా మదుపు చేయండి. 
 
 నేను ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఈ సొమ్ములు నాకు నా కొడుకు విద్యావసరాల నిమిత్తం 2015 జూన్‌కల్లా అవసరం. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాగా సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను?
 - శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్
 బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా పెట్టుబడులకు భద్రతను, వృద్ధిని ఇస్తామని ఏ మ్యూచువల్ ఫండ్ గ్యారంటీనివ్వదు. సాధారణంగా అయితే ఇలాంటి ప్రశ్నలకు డైనమిక్ బాండ్ ఫండ్స్ లేదా షార్ట్‌టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. కానీ గత కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్ నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నందున ఈ ఫండ్స్ ఎన్‌ఏవీ రుణాత్మకంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాల నిమిత్తం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణిస్తారు. ఎఫ్‌ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. న్యూఫండ్‌ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ) ద్వారానే వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. నిర్దేశిత గడువు తర్వాతనే వీటిని రిడీమ్ చేసుకోవాలి. వీటి రాబడులను ముందే అంచనా వేయవచ్చు.
 
  స్వల్పకాలిక రాబడులు కావాలనుకునే ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెడతారు. ఎఫ్‌ఎంపీలు తమ మెచ్యూరిటీ కాల వ్యవధి ఉండే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పది నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్‌ఎంపీలు అదే కాలవ్యవధి ఇన్‌స్ట్రుమెంట్స్‌లో, మూడు నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్‌ఎంపీలు అదే కాలవ్యవధి ఉండే ఇన్‌స్ట్రు మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లలో తేడాలు ఉన్నప్పటికీ, ఇవి ఇచ్చే రాబడులను ముందే అంచనా వేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫండ్స్ 9.75 శాతం నుంచి 10 శాతం రాబడులనిస్తున్నాయి. ఎఫ్‌ఎంపీల్లో లాంగ్ టర్మ్ గెయిన్స్ కనుక మీరు పొందితే ఇండెక్సేషన్ ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. అందుకే ఇవి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కూడా పన్ను పరంగా ప్రయోజనకరమైనవని చెప్పవచ్చు. మీకు సొమ్ములు కావలసిన కాలవ్యవధి ఉండే ఎఫ్‌ఎంపీని ఎంచుకొని, దాంట్లో పెట్టుబడులు పెట్టండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement