పెద్ద వయసులో ఎన్‌పీఎస్‌ ఓకేనా? | NPS is okay in old age? | Sakshi
Sakshi News home page

పెద్ద వయసులో ఎన్‌పీఎస్‌ ఓకేనా?

Published Mon, Apr 2 2018 1:09 AM | Last Updated on Mon, Apr 2 2018 1:09 AM

NPS is okay in old age? - Sakshi

మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పాక్షికంగా విత్‌డ్రాయల్స్‌ జరిపితే, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ–లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌) వర్తిస్తుందా ? ఏ విధంగా లెక్కిస్తారు ?  – రాజేశ్వరి, విశాఖపట్టణం  
మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పాక్షికంగా విత్‌డ్రాయల్స్‌ జరిపినా దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) వర్తిస్తుంది. ఫస్ట్‌–ఇన్‌–ఫస్ట్‌–అవుట్‌(ఎఫ్‌ఐఎఫ్‌ఓ) ప్రిన్సిపుల్‌ ప్రకారం ఎల్‌టీసీజీ వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం.

మొదటగా మీరు కొనుగోలు చేసిన యూనిట్లను మొదటగా విక్రయించాలి. మీరు కొనుగోలు చేసినప్పటి తేదీ నుంచి విక్రయించినప్పటి తేదీని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. రెండింటి మధ్య తేడా ఏడాదిని మించితే ఈ విక్రయాలపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ తేడా 365 రోజుల లోపే ఉంటే ఈ యూనిట్ల విక్రయాలపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా లెక్కిస్తారు.  

ఎల్‌టీసీజీ విధింపు కారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే ఇప్పుడు యులిప్‌లు ఆకర్షణీయమని మిత్రులంటున్నారు. వారి అభిప్రాయం సరైనదేనా ?                   – శేఖర్, విజయవాడ
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరి యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ)లపై ఎల్‌టీసీజీ ప్రభావం ఉండదు. ఈ ఒక్క కారణంతో యులిప్‌లు ఇన్వెస్ట్‌ చేయడానికి ఆకర్షణీయ సాధనాలని చెప్పలేము. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పారదర్శకతకు పెద్ద పీట వేస్తాయి. వీటికి లిక్విడిటీ అధికం. వీటికి వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి.

ఒక ఫండ్‌ మంచి పనితీరు కనబరచలేకపోతే, మరో ఫండ్‌లోకి మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. యులిప్‌ల విషయా నికొస్తే, వీటి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. సరెండర్‌ చార్జీలు, ఇతర వ్యయాలు అధికంగా ఉంటాయి. యులిప్‌ల కాస్ట్‌ క్లెయిమ్‌ తక్కువగా ఉంటుంది. కానీ, యులిప్‌లు పారదర్శకంగా ఉండవని పలువురు ఇన్వెస్టర్లు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మరోవైపు బీమాను, ఇన్వెస్ట్‌మెంట్‌ను కలగలపి మదుపు చేస్తే, ఈ రెండు అంశాల్లోనూ తగిన రాబడులను మీరు పొందలేరు.

మీ బీమా అవసరాలను యులిప్‌లు పూర్తిగా తీర్చలేవు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా తగిన స్థాయిలో రాబడులనూ ఇవ్వలేవు.  కొన్ని యులిప్‌లు మంచి రాబడులు ఇచ్చిన దృష్టాంతాలు ఉన్నాయి. అయితే బీమా అవసరాల దృష్ట్యా చూస్తే, యులిప్‌లు సరైన సాధనాలు కావని చెప్పవచ్చు. అందుకని ఎప్పుడూ, ఇన్వెస్ట్‌మెంట్‌ను, బీమాను కలగలపకండి. బీమా అవసరాల కోసం టర్మ్‌ బీమా పాలసీలను తీసుకోండి. వీటిల్లో బీమా కవరేజ్‌ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌ తక్కువగానూ ఉంటుంది.  

నా వయస్సు 63 ఏళ్లు. ఇంకా పనిచేస్తున్నాను. అదనంగా పన్ను ప్రయో జనాలు పొందొచ్చనే ఉద్దేశంతోనే  నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌   (ఎన్‌పీఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.  – వెంకట్, హైదరాబాద్‌  
ఈ వయస్సులో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. 65 సంవత్సరాల వరకూ ఎన్‌పీఎస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే మీరు ఇప్పుడు చేరితే మరో రెండేళ్లలోనే మీరు ఇన్వెస్ట్‌ చేసిన, ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాలపై సమకూరిన రాబడుల్లో 40 శాతం మేరకు యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌ చేసిన రెండేళ్ల కాలానికే మీరు ఇన్వెస్ట్‌ చేసే దాంట్లో 40 శాతం యాన్యుటీ రూపంలో ఆగిపోతుంది.  దీనికి బదులుగా.. మీరు ఇంకా పనిచేస్తూ ఉన్నారు.

కాబట్టి ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఎన్‌పీఎస్‌ కంటే ఎక్కువ రాబడులు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ మొత్తం లాభాలు రూ.లక్షను మించినప్పుడు మాత్రమే ఈ 10 శాతం పన్ను భారం ఉంటుంది. ఏదైనా మంచి మల్టీ–క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. అంతేకాని, 62 ఏళ్ల వయస్సులో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు.  

ఐసీఐసీఐ ఇలీట్‌ వెల్త్‌ స్కీమ్‌ టూలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. బీమా అవసరాలు, పన్ను ప్రయోజనాలు కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాధాన్యతగా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) కంటే మెరుగైన రాబడులను ఇస్తుందని, మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే నష్ట భయం తక్కువని మిత్రుడొకరు చెబుతున్నారు. ఈ స్కీమ్‌కు లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఐదేళ్లు, 20 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.  పెట్టుబడికి ఈ స్కీమ్‌ను పరిశీలించవచ్చా ?   – ఆనంద్, నెల్లూరు  
ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాధాన్యతా అంశమైతే, ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయడమనేది సరైన నిర్ణయం కాదు. ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ ఇలీట్‌ వెల్త్‌ టూ అనేది ఇన్సూరెన్స్‌ కమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీ. ఈ స్కీమ్‌లో చార్జీలు అధికం. ఇక బీమా కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. దీనిలో బీమా కవరేజ్‌ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి.

ఇక ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం మంచి రేటింగ్‌ఉన్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోండి.  ఒకటి, లేదా రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో కనీసం ఐదు నుంచి ఎనిమిదేళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. సొంత ఇల్లు కట్టుకోవడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈ విధానాన్ని అనుసరిస్తే, మంచి ప్రయోజనాలు పొందవచ్చు.


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement