ఏపీవై, ఎన్‌పీఎస్.. రెండింట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? | APY, NPS .. investment to be both? | Sakshi
Sakshi News home page

ఏపీవై, ఎన్‌పీఎస్.. రెండింట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

Published Mon, May 16 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

ఏపీవై, ఎన్‌పీఎస్.. రెండింట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

ఏపీవై, ఎన్‌పీఎస్.. రెండింట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు, మా అత్తగారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుందనే తీసుకున్నాను. అయితే ఒక పాలసీ కింద త ల్లిదండ్రులకు గానీ లేదా అత్తమామలకు, ఎవరికైనా ఒక జంటకే బీమా వర్తిస్తుందని మిత్రులంటున్నారు. ఇది నిజమేనా?
 - విజయ్, వరంగల్

 
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ - మీకు, మీ భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, అత్తామామలకు కూడా వర్తిస్తుంది. అయితే అందరూ భారత్‌లోనే నివసించాలనే షరతు ఉంది. బీమాపాలసీ విషయమై ఇతరుల అభిప్రాయాలతో ఆందోళన చెందే కంటే మీరు నేరుగా మీరు పాలసీ తీసుకున్న సంస్థనే సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకుంటే బావుంటుంది.
 
నా వయస్సు 33 సంవత్సరాలు. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా కుటుంబం మొత్తానికి నేను రూ. 5 లక్షల  వైద్య బీమా-ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంటిన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ), గది అద్దె తదితర అంశాలపై ఎలాంటి పరిమితులు లేని ఒక మంచి వైద్య బీమా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను సూచించండి.
 - నటరాజ్, హైదరాబాద్

 
వైద్య బీమా పాలసీ తీసుకునే ముందు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకే బీమా మొత్తానికి వివిధ బీమా కంపెనీల ప్రీమియమ్‌ల్లో వ్యత్యాసాలు భారీగానే ఉంటాయి. చౌక ప్రీమియమ్ ఉన్న బీమా పాలసీలకే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వవద్దు. బీమా కంపెనీల వివిధ పాలసీల ఫీచర్లను క్షుణ్నంగా పరిశీలించండి. ఈ ఫీచర్లను పోల్చి ఒక నిర్ణయం తీసుకోండి. కొంత మొత్తం అదనంగా చెల్లించడం వల్ల అధిక ప్రయోజనాలు పొందే అవకాశాలుంటాయని గుర్తించండి. ఒకవేళ ఇప్పటికే మీకేమైనా రుగ్మతలుంటే వాటికి కూడా బీమా ఎన్ని సంవత్సరాల తర్వాత వర్తిస్తుందో తెలుసుకోండి.

ఆ ఫీచర్ (వెయిటింగ్ పీరియడ్) ఒక్కో కంపెనీకి ఒకోలా ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీలకే ప్రాధాన్యత ఇవ్వండి. చాలా కంపెనీలు నగదు రహిత, రీయింబర్స్‌మెంట్ ఆప్షన్లతో వైద్య బీమా పాలసీలందిస్తున్నాయి.నగదు రహిత బీమా పాలసీ తీసుకుంటేనే మంచిది. ఇలా చేస్తే ఆసుపత్రిలో చేరినప్పుడు మీరు ఎలాంటి డబ్బులు ఖర్చు చేయనక్కర లేదు. రీయింబర్స్‌మెంట్ ఫీచర్ పాలసీ తీసుకుంటే రకరకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఇది కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్నది. మీ నగరంలో నగదు రహిత సౌకర్యం ఉన్న హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ను కూడా చెక్ చేసుకోవాలి. ఇక ఐసీయూ, గది అద్దెలపై ఎలాంటి పరిమితులు లేని కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సూచిస్తున్నాం. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని సరైన పాలసీని ఎంచుకోండి. స్టార్ హెల్త్-స్టార్ కాంప్రహెన్సివ్, అపోలో మ్యూనిక్-ఈజీ హెల్త్ ఎక్స్‌క్లూజివ్, రెలిగేర్ హెల్త్- కేర్. ఈ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియమ్‌లు ఏడాదికి రూ.13,000-17,000 రేంజ్‌లో ఉంటాయి.
 
నేను అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నాను. నేను అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. రిటైరైన తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందడానికి గాను ఏపివైలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ స్కీమ్ కింద ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందవచ్చా?  అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా ఒక వ్యక్తి రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
 - రాజేష్, రాజమండ్రి

 
అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) అనేది ఎన్‌పీఎస్‌లో ఒక భాగం. అసంఘటిత రంగంలోని వారి కోసం ఉద్దేశించిన పథకం ఇది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు 1,000/2,000/3,000/4,000/5,000 చొప్పున పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ కింద మీరు పొందగలిగే గరిష్ట పెన్షన్ రూ.5,000 మాత్రమే.

ఇక ఏపీవై, ఎన్‌పీఎస్‌ల కింద ఒకే వ్యక్తి రెండు ఖాతాలు నిర్వహించడానికి లేదు. బీమా తీసుకునే వ్యక్తి వయస్సు, కోరుకునే పెన్షన్‌ను బట్టి అటల్ పెన్షన్ యోజనలో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై పరిమితి ఉంటుంది. ఏపీవైలో ఆ పరిమితిని మించి అధికంగా మీరు ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఈ పరిమితిని మించి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఏపీవై ఖాతా నిర్వహిస్తున్న బ్యాంక్‌ను సంప్రదించి మీకు లభించే ఆప్షన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement