న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టు 23న ఈ మైలురాయిని అధిగమించినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు.
రెండేళ్ల 10 నెలల కాలంలో ఏయూఎం రూ. 5 లక్షల కోట్ల నుంచి రెట్టింపైనట్లు వివరించారు. ఎన్‌పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 6.62 కోట్ల పైచిలుకు చేరినట్లు మహంతి చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రకటించిన ఎన్‌పీఎస్‌ను 2009 నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశ పౌరులు దీన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. మరోవైపు, 2015 జూన్ 1న ఏపీవైని కేంద్రం ఆవిష్కరించింది.
60 ఏళ్లు దాటిన చందాదారులు తాము కోరుకున్నంత నిధిని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌పై కసరత్తు తుది దశలో ఉందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని మహంతి వివరించారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్ చందాదారులు 60 ఏళ్లు దాటితే 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగతా 40 శాతం మొత్తం తప్పనిసరిగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment