ఈపీఎఫ్‌కు, పీపీఎఫ్‌కు తేడా ఏమిటి? | what is difference of EPF & PPF? | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌కు, పీపీఎఫ్‌కు తేడా ఏమిటి?

Published Mon, Jan 11 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

ఈపీఎఫ్‌కు, పీపీఎఫ్‌కు తేడా ఏమిటి?

ఈపీఎఫ్‌కు, పీపీఎఫ్‌కు తేడా ఏమిటి?

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు లభిస్తాయని తెలుసు. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌లు కాకుండా పన్ను రాయితీలు లభించే ఇతర రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా?                 - అనురాధ, హైదరాబాద్
 
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్షన్నర వరకూ పన్ను రాయితీ పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీ పొందే అవకాశం మరే ఇతర ఈక్విటీ ఫండ్స్‌కు లేదు. అయితే ఈక్విటీ ఫండ్స్‌కు వేరే పన్ను ప్రయోజనాలున్నాయి. ఈక్విటీ  ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఏడాది కాలం తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను వికయిస్తే, ఎలాంటి దీర్ఘకాల మూలధన  లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక వేళ ఏడాదిలోపే ఆ యూనిట్లను వికయిస్తే, వచ్చిన లాభాలపై 15 % చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఇవి రెండూ ఒకటేనా? ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి ?                
- రాజేష్, విజయవాడ

 
ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్).. రిటైర్మెంట్ అవసరాల కోసం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు. రెండూ వేర్వేరు. వేతనం పొందే ఉద్యోగులకు ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగి ప్రతి నెలా తన వేతనంలో 12 శాతం వరకూ ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ కూడా కొంత మొత్తం ఈపీఎఫ్‌లో జమ చేస్తుంది. పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక స్కీమ్.

స్వయం ఉపాధి పొందేవారు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే శ్రామికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడం లక్ష్యంగా పీపీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్కీమ్‌లూ కచ్చితమైన రాబడులనందిస్తాయి. కేంద్ర పభుత్వం ఎప్పటికప్పుడు వడ్డీరేట్లను సవరిస్తూ ఉంటుంది.
 
నేను ఎస్‌బీఐ శుభ్ నివేశ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాను. వార్షిక ప్రీమియం రూ. లక్ష. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత నాకు ఎంత వస్తుంది?                 - అశ్రీయ, వైజాగ్
 
ఎస్‌బీఐ శుభ్ నివేశ్ అనేది ఎండోమెంట్ ప్లాన్. యాడ్ ఆన్ బెనిఫిట్‌గా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ప్రాథమికంగా బీమా పాలసీ. బోనస్‌లు కూడా వస్తాయి. ఒక మదుపు సాధనంగా ఈ పాలసీ తీసుకున్నారని భావిస్తున్నాం. ఎండోమెంట్ ప్లాన్‌లు బీమా, మదుపు కలగలపిన ప్లాన్‌లు. ఇవి గ్యారంటీడ్ రిటర్న్‌లను ఇవ్వలేవు. పైగా వ్యయాలు, చార్జీల విషయంలో ఎలాంటి పారదర్శకత ఉండదు.

ఈ పాలసీ టర్మ్ 15 ఏళ్లు ముగిసిన తర్వాత మీకు ఎంత మొత్తం నిర్దిష్టంగా వస్తుందో చెప్పలేం. ఈ ప్లాన్‌లు తగిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు, అలాగే చెప్పుకోదగిన రాబడులనూ ఇవ్వలేవు. జీవిత బీమా పాలసీ కోసం సాధారణ టర్మ్ బీమా పాలసీని తీసుకోండి. ఇక మీ వివిధ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
 
నా వయస్సు 24 సంవత్సరాలు. ఐటీరంగంలో పనిచేస్తున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాను. పన్ను ఆదా మార్గాలు తెలపండి. ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకోమంటారా? లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో, లేక పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి.
                   - శశికాంత్, బెంగళూరు

 
మీ ఆదాయం ఎంత, మీరు ఎంత ఆదా చేయగలరు...తదితర వివరాలతో కూడిన మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫైల్ గురించిన వివరాలేమీ మీరు వెల్లడించలేదు. అందుకని సాధారణ అంశాలపై వివరణ ఇస్తున్నాం. ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ అనేది సేవింగ్స్/ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన బీమా ప్లాన్. ఇవి భారీ ఇన్సూరెన్స్ కవర్‌ను ఇవ్వలేవు. అలాగే మంచి రాబడులనూ ఇవ్వలేవు. అందుకే వీటికి దూరంగా ఉండమని సూచిస్తాం. బీమా అవసరాలకు పూర్తిగా టర్మ్ బీమా పాలసీలే తీసుకోండి.

మీపై ఆర్థికంగా ఆధారపడిన వాళ్లు ఉంటే, తగిన లైఫ్ కవర్ ఉండే బీమా పాలసీ తీసుకోండి. ఆన్‌లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని రిస్క్‌ను అధికంగా భరించగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే అవి తగినవి. దీర్ఘకాలం పాటు వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చు.

వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే మీరు కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయగలిగేటట్లయితేనే వీటిల్లో ఇన్వెస్ట్‌చేయాలి. ఇక పీపీఎఫ్ అనేది కేంద్రప్రభుత్వం తోడ్పాటుతో నడిచే ప్లాన్. దీని కాలపరిమితి 15 ఏళ్లు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఇదొక మదుపు సాధనం. మీరు భరించగలిగే రిస్క్, ఎంత కాలం ఎంత మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయగలరు. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోండి.
- ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement