Equity Linked Savings Schemes
-
ఈఎల్ఎస్ఎస్ను అలవాటుగా మార్చుకోండి
ఒకవైపు పన్ను భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు సంపదను పెంచుకునేలా పెట్టుబడులను ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్) ఆ కోవకి చెందినవే. ఇలాంటి సాధనంలో ఇన్వెస్ట్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ► కష్టమైనదైనా స్థిరంగా, తరచుగా ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అలవాటు ఏర్పడుతుంది. ఒకసారి అలవాటుగా మారిన తర్వాత ఆ పని చేయడం కూడా సులువవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలోనూ కొన్ని మంచి అలవాట్లు మనల్ని ఎంతగానో ఆదుకుంటాయి. సాధారణంగా మనకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలను నిత్యం ఎదురయ్యే అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఈ క్రమంలో పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కన్నా ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడమనేది మనకు సులువైన అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే పొదుపు, పెట్టుబడి చేసి తర్వాతెప్పుడో ప్రతిఫలాన్ని అందుకోవడం కన్నా ఇప్పటికిప్పుడు ఖర్చు చేయడం వల్ల తక్షణం కలిగే సంతృప్తి ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ధోరణికి అలవాటు పడిపోయి తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసి, పన్ను భారం భయపెడుతుంటే అప్పుడు ఆ భారాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెదకడం మొదలుపెడుతుంటాం. ఆ ఒత్తిడిలో ఇటు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రాబడులను ఇవ్వగలిగే పెట్టుబడి సాధనాలను క్షుణ్నంగా తెలుసుకునే అవకాశాలు కోల్పోతుంటాం. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ► వేతనజీవులైన ట్యాక్స్‌పేయర్ల విషయంలో వారి కంపెనీలు పీఎఫ్ రూపంలో ప్రతి నెలా ఎంతో కొంత ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తుంటాయి. పన్ను ఆదా చేసుకునేందుకు సింహభాగం వాటా ఈ రూపంలోనే వెడుతుంటుంది. పన్ను ఆదాకు సంబంధించి సెక్షన్ 80సి కింద ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సహా అనేక చాయిస్‌లు ఉన్నాయి. దీనితో ఏది ఎంచుకోవాలనేదానిపై కాస్త సందిగ్ధం ఏర్పడవచ్చు. ► సెక్షన్ 80సి కింద పన్ను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈఎల్ఎస్ఎస్ అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. దీనితో రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. పన్నులను ఆదా చేసుకోవడం ఒకటైతే, సంపద సృష్టికి ఉపయోగపడటం రెండోది. మెరుగైన రాబడులు.. మిగతా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు మరింత మెరుగైన రాబడులు ఇస్తాయని రుజువైంది. నిఫ్టి 500 టీఆర్ఐ గత పదేళ్లలో 13.32 శాతం మేర వార్షిక రాబడులు ఇచ్చింది. మిగతా ట్యాక్స్ సేవింగ్ సాధనాలతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. కాబట్టి ఈక్విటీలపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ఈ సాధనాన్ని పరిశీలించవచ్చు. సిప్ ప్రయోజనాలు.. మీకు ప్రతి నెలా ఎలాగైతే వేతనం వస్తుందో, పీఎఫ్ కటింగ్ జరుగుతుందో అదే విధంగా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానాన్ని ఎంచుకోవచ్చు. మన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేసేటప్పుడు ఆ ప్రక్రియను ఆటోమేటిక్ చేయడం వల్ల ఇన్వెస్ట్ చేయడం సులభతరం అవుతుంది. ఆదాయం ఆర్జించడం, ఖర్చు చేయడం, పొదుపు, విందులు.. విహారయాత్రల తరహాలోనే ట్యాక్స్ సేవింగ్‌ను కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఫలితంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం ఆఖరు నిమిషంలో హడావిడిగా పరుగులు తీయనక్కర్లేదు. ► సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీలు ఒకోసారి పెరుగుతాయి ఒకోసారి తగ్గుతాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకే రేటు దగ్గర కొనుగోలు చేసినట్లవుతుంది. అలా కాకుండా సిప్ విధానంలో కాస్త కాస్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. అంటే కొనుగోలు రేటు సగటున తగ్గుతుంది. తత్ఫలితంగా తదుపరి మరింత రాబడులను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ► ఈఎల్ఎస్ఎస్లో అవసరమైనప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడిని పెంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముందుగా మీ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మొత్తంతో మొదలుపెట్టండి. క్రమంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పెట్టుబడులు ఒకవేళ సెక్షన్ 80సి కింద గల రూ. 1.5 లక్షల పరిమితి కన్నా తక్కువగానే ఉంటే కాస్త పెంచుకోండి. ► ఇలా క్రమం తప్పకుండా సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇటు సంపద సృష్టికి అదనంగా అటు పన్నుల ఆదాను చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్ 25%, స్మాల్ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు
శివరామ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వరకు చెల్లిస్తున్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారింది. శ్రీరామమూర్తి ఏడాది క్రితం ఎన్‌పీఎస్‌లో చేరాడు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనంలో భాగంగా ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీనికి అదనంగా ఇన్వెస్ట్ చేయాలని ఉంది. కానీ, పన్ను మినహాయింపు ఉంటుందా? అన్నది సందేహం. పన్ను ఆదా సాధనాల విషయంలో వేతన జీవులకు పక్కా ప్రణాళిక ఉండాలి. శివరామ్ పన్ను ఆదా కోసం ఎండోమెంట్ పాలసీ తీసుకుని పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కవరేజీ తక్కువ, రాబడులు కూడా స్వల్పమే. పైగా ప్రీమియం ఎక్కువ. దీనివల్ల ఇతర పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతింటుంది. ఏటా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పన్ను పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది చివరి మూడు నెలల్లోనే పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటారు. ఆ తరహా వారికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా సాధనాలు, వాటి∙ప్రయోజనాలు వివరించేదే ఈ కథనం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పన్ను ఆదా విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయ పన్ను ఆదా కోసం దీన్ని మెరుగైన సాధనంగానే చూడొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను రూ.లక్ష మించినప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018లో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండగా... ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసే వారు వీటి గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అయితే, మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే అంతా ఒకేసారి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా జనవరి నుంచి మార్చి వరకు మూడు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్ట్రోగ్రఫీ సీఈవో శ్వేతా జైన్ సూచించారు. ఫండ్స్ పేరు 3 ఏళ్ల రాబడులు మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ 19.06 ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్ 12.67 ఆదిత్య బిర్లా ట్యాక్స్ రిలీఫ్96 12.48 ప్రిన్సిపల్ ట్యాక్స్ సేవింగ్ 12.59 యాక్సిల్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 12.38 డీఎస్పీ ట్యాక్స్‌సేవర్ 12.13 ఎన్పీఎస్ జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో గత ఐదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 10.84 శాతంగా ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ పీఎఫ్ఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో ఎన్పీఎస్ ఆకర్షణీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్ల సమయంలో ఉపసంహరించుకునే 60 శాతంలో 20 శాతం పైన పన్ను చెల్లించాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించడం పెద్ద ముందడుగుగా క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్గుప్తా పేర్కొన్నారు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా పీఎఫ్ఆర్డీఏ కల్పించింది. వీటిల్లో ఫండ్స్ పనితీరును గమనిస్తే... ఈక్విటీలో 50 శాతం ఇన్వెస్ట్ చేసే విభాగం ఫండ్ మేనేజర్ ఏడాది రాబడి మూడేళ్లు రాబడి ఐదేళ్లు రాబడి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ 3.37 9.56 11.31 ఎస్బీఐ పెన్షన్ ఫండ్ 4.12 9.98 11.45 యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ 3.19 9.85 11.41 కోటక్ పెన్షన్ ఫండ్ 1.37 9.58 11.22 హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఫండ్ 3.71 10.22 – పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లు కూడా సెక్షన్ 80సీ కింద పెట్టుబడి ప్రయోజనం అందించేవే. అయితే, ఎన్పీఎస్, యులిప్‌లతో పోలిస్తే ఇవి అంత ఆకర్షణీయం కావు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా రూ.50,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంది. పని చేస్తున్న కంపెనీ ఉద్యోగి పెన్షన్ కోటా కింద జమ చేస్తే అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. కానీ బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లకు ఈ ప్రయోజనాలు లేవు. కొత్త యులిప్ పాలసీల్లో చార్జీలు చాలా వరకు దిగొచ్చాయి. బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో మాత్రం చార్జీలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. యులిప్‌ల మాదిరే బీమా పెన్షన్ ప్లాన్లలోనూ చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ జాతీయ పొదుపు పత్రా ల్లో పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ఉంది. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8%. ఈక్విటీల గురించి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేని వారు, పెట్టుబడి పెట్టి నిశ్చితంగా ఉండాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైనది. దీనిలో వచ్చే వడ్డీ ఆదాయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు వీలుంటుంది. ఉదాహరణకు 2019 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశారనుకుంటే, 2020 జనవరి నాటికి రూ.4,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో దీనిపై మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికీ ఇది అనువైనదే. బ్యాంకుల్లో వీటిని పొందొచ్చు. బ్యాంకు ఎఫ్డీలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ 7.5–8.25% మధ్య ఉంది. సెక్షన్ 80 సీ పన్ను ఆదా కోసమయితే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు తిరిగి ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకోవడానికి ఉండదు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వారు ఆన్లైన్లోనే కొన్ని క్లిక్‌లతో ఈ డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ వడ్డీ రేటు ఐడీఎఫ్సీ బ్యాంకు 8.25 ఏయూస్మాల్ ఫైనాన్స్ 8.00 లక్ష్మీ విలాస్ బ్యాంకు 7.75 డీసీబీ బ్యాంకు 7.75 ఆర్బీఎల్ బ్యాంకు 7.60 బీమా పాలసీలు ఆర్జించే వ్యక్తికి మరణ ప్రమాదం ఎదురైతే, అతడు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే తమపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి. కానీ, అది టర్మ్ ప్లాన్ రూపంలో ఉంటే మంచిది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు ఓ వ్యక్తి కుటుంబానికి సరిపడా బీమా రక్షణ అందించలేవు. ఎందుకంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 30 ఏళ్ల వ్యక్తికి వార్షికంగా కనీసం రూ.40–50 లక్షల కవరేజీ అవసరం. ఎండోమెంట్ పాలసీ అయితే ఇంత కవరేజీ కోసం రూ.ఏడాదికి రూ.4–5 లక్షల ప్రీమియం చెల్లించాలి. కానీ రూ.5,000లోపు ప్రీమియంతోనే 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.50 లక్షల టర్మ్ పాలసీని పొందొచ్చు. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియానికి కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...(పీపీఎఫ్) 2019 జనవరి–మార్చి నెలకు వడ్డీ 8 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ... పీపీఎఫ్ సాధనం ఇప్పటికీ మంచి సాధనంగా ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. రాబడి పూర్తిగా పన్ను రహితం. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనం అవుతుంది. ఎందుకంటే ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిసిందే. అయితే, ఇప్పటికే ప్రావిడెండ్ ఫండ్‌కు కొంత కేటాయించే వారు పన్ను ఆదా కోసం మరింతగా అదే బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వివేకం అనిపించుకోదు. దీనికి బదులు ఇక్కడి ప్రత్యామ్నాయ సాధనాల్లో మీకు అనువైనది ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడులు, రాబడులకు హామీదారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఏ పోస్టాఫీసు శాఖ లేదా బ్యాంకు శాఖలో అయినా పీపీఎఫ్ ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్ సదుపాయం కలిగిన బ్యాంకులో ఎంచుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.7 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం మరింత ఆకర్షణీయత సంతరించుకుంది. దీంతో 60 ఏళ్లు దాటిన వారికి వార్షికంగా రూ.3.5 లక్షలకు పన్ను లేనట్టు అవుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5.5 లక్షలకు పన్ను ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోకీ అధిక వడ్డీ రేటు ఉన్నది ఈ పథకంలోనే. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరని వారు 58 ఏళ్లకే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన కుమార్తెల పేరిట పొదుపు చేసుకుని పన్ను ఆదా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం. వడ్డీ రేటును ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌తో ముడిపెట్టినందున ప్రతీ క్వార్టర్‌కు మారుతుంటుంది. పీపీఎఫ్ పథకంలో కంటే అధిక వడ్డీ రేటు ఇందులో లభిస్తోంది. పీపీఎఫ్‌లో మాదిరే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.250 పెట్టుబడితో పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకుల్లో దీన్ని ఆరంభించొచ్చు. తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెల పేరిటే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కుమార్తెల పేరిట రెండు ఖాతాలు ప్రారంభించిన వారు రెండింటిలోనూ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడే పథకం. యులిప్‌లు యూనిట్ లింక్డ్ బీమా పథకాలను ‘యులిప్’లుగా పిలుస్తారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో లాభాలు గడించే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యులిప్‌లు బీమాతో కూడిన పెట్టుబడి పథకాలు కావడంతో వీటికి మినహాయింపు ఉంది. యులిప్‌ల్లో కేవలం ఈక్విటీలే కాకుండా డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. యులిప్ పాలసీల్లో ఈక్విటీ నుంచి డెట్ ఫండ్స్‌కు మారినా పన్ను వర్తించదు. ఫండ్స్‌లో మాదిరిగా కాకుండా, యులిప్ పాలసీల్లో డెట్ అయినా ఈక్విటీ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆర్జించే మొత్తంపైనా పన్ను ఉండదు. కాగా ఐదేళ్ల పాటు లాకిన్. గడువు లోపు ముందుగానే తప్పుకుంటే సరెండ్ చార్జీల వంటివి ఉంటాయి. యులిప్ల్లోనే చైల్డ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లల పేరిట తీసుకుంటే, పాలసీ గడువు లోపు సంరక్షణ చూసే తల్లి లేదా తండ్రి అకాల మరణం చెందితే, పిల్లల పేరిట పెట్టుబడి ఆగకుండా కొనసాగుతుంది. -
పన్నుకు మందు... ఈఎల్ఎస్ఎస్
ఇది మార్చి నెల. అంటే పన్ను కోతలకు ఆఖరి నెల. ఈ నెల్లో గనక ఇన్వెస్ట్మెంట్ల రుజువు పత్రాలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ఇవ్వకపోతే నెలాఖర్లో చేతికి కాస్తయినా జీతం రావటం కష్టం. అయితే పన్ను ఆదా చేయటానికున్న చక్కటి మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఉంటాయి. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేయడానికి వీలు కల్పించే ఈఎల్ఎస్ఎస్ల లాకిన్ వ్యవధి మూడేళ్లు. ఒకరకంగా మిగతా పథకాలతో పోలిస్తే తక్కువే. వీటిని ఒకసారి చూద్దాం... ♦ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడులు ♦ మూడేళ్ల లాకిన్‌తో దీర్ఘకాల రాబడులకు అవకాశం ♦ రాబడులపై క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండదు ♦ మంచి ఫండ్‌ను ఎంచుకోవటం; సిప్ చేయటం అవసరం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి తగిన లాభాలు పొందాలనుకునేవారికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడమే చక్కని మార్గమని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే స్వల్ప కాలమైతే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటాయి. వాటిని తప్పించుకోవాలంటే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులే కాబట్టి మెరుగైన ఆదాయాన్ని ఆశించవచ్చు. పెపైచ్చు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. వీలుంటే ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే సిప్ పద్ధతిలో దఫదఫాలుగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. వీటిలో ఉండే ప్రయోజనాలేంటంటే... * పన్ను మినహాయింపు * మూడేళ్ల లాకిన్ ఉంటుంది కనక పన్ను లేని ఆదాయం * రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం * పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్ల వంటి సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ ఎక్కువ. ఆర్థిక లక్ష్యాలకు మంచిదే... ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమనేది చక్కని మార్గం. ఎందుకంటే మార్కెట్ లోతుపాతులు తెలుసుకోవటానికి, పరిణామాల్ని అంచనా వేయటానికి మరీ ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఎంచుకున్న ఫండ్ ఎంత పెద్దది? ఎన్నాళ్ల నుంచి పనిచేస్తోంది? ఫండ్ ఖర్చులుగా ఎంత శాతాన్ని వెచ్చిస్తున్నారు? దాని పనితీరు ఎలా ఉంది? వంటి అంశాల్ని మాత్రం అధ్యయనం చేస్తే చాలు. ఎందుకంటే కాస్త పెద్ద పోర్టుఫోలియో ఉండి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫండ్ సంస్థలైతే మార్కెట్ పరిస్థితులు బాగులేనపుడు కూడా స్థిరంగా ఉండే అవకాశముంటుంది. అలాగే ఖర్చుల శాతం ఎక్కువైతే అది మీ రాబడిపై ప్రభావం చూపిస్తుంది. ఖర్చుల్లో కనీసం 0.5 శాతం తక్కువ ఉన్నా... దీర్ఘకాలంలో అది రాబడులపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. సంస్థను, ఫండ్‌ను ఎంచుకున్నాక... ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయటమా? లేక సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటమా? అన్నది. ఒకరకంగా సిప్ విధానమే ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ పడినా, పెరిగినా కూడా దానిద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పడే పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్లు, పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ యూనిట్లు వస్తాయి. సరాసరిన మంచి రాబడులుంటాయి. లాకిన్ వ్యవధిపై జాగ్రత్త! ఈఎల్ఎస్ఎస్లో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ వెనక్కి తీసుకోవటానికి మాత్రం లాకిన్ వ్యవధి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది మూడేళ్లు. ఒకవేళ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు... ఈ నెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మూడేళ్ల తరవాత వెనక్కి తీసుకోవచ్చు. వచ్చేనెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి... అప్పటి నుంచి మూడేళ్ల గడువు వర్తిస్తుంది. మూడేళ్ల తరవాత తీసుకునే మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు కనక ‘గ్రోత్’ ఫండ్‌ను ఎంచుకోవటమే మంచిది. ఎందుకంటే డివిడెండ్ చెల్లించే ఫండ్‌ను ఎంచుకుంటే డివిడెండ్‌పై పన్నును సంస్థ చెల్లిస్తుంది. దీనివల్ల మన లాభాలు తగ్గుతాయి. ఒకవేళ డివిడెండ్‌ను రీ-ఇన్వెస్ట్ చేస్తే... అలా ఇన్వెస్ట్ చేసే ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వ ర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవటం ఉండదు కనక... ఈ ఫండ్ల మేనేజర్లు దీర్ఘకాలంలో చక్కని రాబడులొచ్చే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మిగిలిన ఫండ్ల కన్నా ఇవి మంచి రాబడులే ఇస్తాయి. మొత్తంగా చూస్తే ఈఎల్ఎస్ఎస్లో సిప్ పద్ధతిలో నెలవారీ పెట్టుబడి పెట్టడమే మంచిదనేది నా సలహా. పెపైచ్చు ఇలా నెలవారీ ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ఆటోమేట్ చేసుకుంటే ఆలస్యం కాకుండా ఉంటుంది. పెపైచ్చు ఇలా దఫదఫాలుగా ఇన్వెస్ట్ చేయటం వల్ల బడ్జెట్‌పై కూడా పెద్దగా ప్రభావం పడదు. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ -
ఈపీఎఫ్‌కు, పీపీఎఫ్‌కు తేడా ఏమిటి?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు లభిస్తాయని తెలుసు. అయితే ఈఎల్ఎస్ఎస్లు కాకుండా పన్ను రాయితీలు లభించే ఇతర రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? - అనురాధ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్షన్నర వరకూ పన్ను రాయితీ పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీ పొందే అవకాశం మరే ఇతర ఈక్విటీ ఫండ్స్‌కు లేదు. అయితే ఈక్విటీ ఫండ్స్‌కు వేరే పన్ను ప్రయోజనాలున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఏడాది కాలం తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను వికయిస్తే, ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక వేళ ఏడాదిలోపే ఆ యూనిట్లను వికయిస్తే, వచ్చిన లాభాలపై 15 % చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఇవి రెండూ ఒకటేనా? ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి ? - రాజేష్, విజయవాడ ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్).. రిటైర్మెంట్ అవసరాల కోసం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. రెండూ వేర్వేరు. వేతనం పొందే ఉద్యోగులకు ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుంది. ఉద్యోగి ప్రతి నెలా తన వేతనంలో 12 శాతం వరకూ ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ కూడా కొంత మొత్తం ఈపీఎఫ్‌లో జమ చేస్తుంది. పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక స్కీమ్. స్వయం ఉపాధి పొందేవారు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే శ్రామికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడం లక్ష్యంగా పీపీఎఫ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్కీమ్‌లూ కచ్చితమైన రాబడులనందిస్తాయి. కేంద్ర పభుత్వం ఎప్పటికప్పుడు వడ్డీరేట్లను సవరిస్తూ ఉంటుంది. నేను ఎస్బీఐ శుభ్ నివేశ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాను. వార్షిక ప్రీమియం రూ. లక్ష. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత నాకు ఎంత వస్తుంది? - అశ్రీయ, వైజాగ్ ఎస్బీఐ శుభ్ నివేశ్ అనేది ఎండోమెంట్ ప్లాన్. యాడ్ ఆన్ బెనిఫిట్‌గా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ప్రాథమికంగా బీమా పాలసీ. బోనస్‌లు కూడా వస్తాయి. ఒక మదుపు సాధనంగా ఈ పాలసీ తీసుకున్నారని భావిస్తున్నాం. ఎండోమెంట్ ప్లాన్లు బీమా, మదుపు కలగలపిన ప్లాన్లు. ఇవి గ్యారంటీడ్ రిటర్న్‌లను ఇవ్వలేవు. పైగా వ్యయాలు, చార్జీల విషయంలో ఎలాంటి పారదర్శకత ఉండదు. ఈ పాలసీ టర్మ్ 15 ఏళ్లు ముగిసిన తర్వాత మీకు ఎంత మొత్తం నిర్దిష్టంగా వస్తుందో చెప్పలేం. ఈ ప్లాన్లు తగిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు, అలాగే చెప్పుకోదగిన రాబడులనూ ఇవ్వలేవు. జీవిత బీమా పాలసీ కోసం సాధారణ టర్మ్ బీమా పాలసీని తీసుకోండి. ఇక మీ వివిధ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 24 సంవత్సరాలు. ఐటీరంగంలో పనిచేస్తున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. పన్ను ఆదా మార్గాలు తెలపండి. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకోమంటారా? లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో, లేక పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - శశికాంత్, బెంగళూరు మీ ఆదాయం ఎంత, మీరు ఎంత ఆదా చేయగలరు...తదితర వివరాలతో కూడిన మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ గురించిన వివరాలేమీ మీరు వెల్లడించలేదు. అందుకని సాధారణ అంశాలపై వివరణ ఇస్తున్నాం. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ అనేది సేవింగ్స్/ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన బీమా ప్లాన్. ఇవి భారీ ఇన్సూరెన్స్ కవర్‌ను ఇవ్వలేవు. అలాగే మంచి రాబడులనూ ఇవ్వలేవు. అందుకే వీటికి దూరంగా ఉండమని సూచిస్తాం. బీమా అవసరాలకు పూర్తిగా టర్మ్ బీమా పాలసీలే తీసుకోండి. మీపై ఆర్థికంగా ఆధారపడిన వాళ్లు ఉంటే, తగిన లైఫ్ కవర్ ఉండే బీమా పాలసీ తీసుకోండి. ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని రిస్క్‌ను అధికంగా భరించగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే అవి తగినవి. దీర్ఘకాలం పాటు వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందొచ్చు. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే మీరు కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయగలిగేటట్లయితేనే వీటిల్లో ఇన్వెస్ట్చేయాలి. ఇక పీపీఎఫ్ అనేది కేంద్రప్రభుత్వం తోడ్పాటుతో నడిచే ప్లాన్. దీని కాలపరిమితి 15 ఏళ్లు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఇదొక మదుపు సాధనం. మీరు భరించగలిగే రిస్క్, ఎంత కాలం ఎంత మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయగలరు. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్