
గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సొమ్ములు ఇప్పుడు చేతికి వస్తున్నాయి. వీటిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? ఈ ఫండ్‌లో ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయమంటారా? లేక సిప్ విధానాన్ని అనుసరించమంటారా ?
– కుముదిని, విశాఖపట్టణం
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అయితే, నిరభ్యంతరంగా బ్యాలన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై స్వల్పకాలంలో ఎలాంటి రాబడులు ఆశించకూడదు. అలాగే ఒక క్రమబద్ధమైన ఆదాయం రావాలని కూడా కోరుకోకూడదు. బ్యాలన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఒకటి లేదా రెండేళ్లలో మీ పెట్టుబడిలో ఒకింత నష్టం వచ్చినా కంగారుపడకండి. దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి బ్యాలన్స్‌డ్ ఫండ్స్ కాకుండా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఈక్విటీ ఇన్‌కమ్ ఫండ్, మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్(ఎమ్‌ఐపీ)లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. మీ దగ్గరున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ మొత్తాన్ని కనీసం ఆరు లేదా పన్నెండు భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని నెల వారీగా ఇన్వెస్ట్ చేయండి.
నా వయస్సు 32 సంవత్సరాలు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్‌స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు, పన్ను ప్రయోజనాలు పొందవచ్చని మిత్రులు చెబుతున్నారు. అయితే ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుంది. కాబట్టి ఈక్విటీలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభించే హైబ్రిడ్ ఫండ్స్ కానీ,
బ్యాలన్స్‌డ్ ఫండ్స్ కానీ ఉన్నాయా ? ఈ తరహాలో వుండే పెన్షన్ ఫండ్స్ వుంటే...వాటి వివరాలు వెల్లడించండి.
– వినోద్, హైదరాబాద్
మీరు పేర్కొన్న వివరాల ప్రకారం రెండు పెన్షన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఫ్రాంక్లిన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. మరొకటి యూటీఐ అందిస్తోంది. ఈ రెండు పెన్షన్‌ప్లాన్‌లు..ఈక్విటీలో 40 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తిగా ఈక్విటీతో ముడిపడని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కావాలంటే, మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)ను కూడా పరిశీలించవచ్చు. ఈక్విటీలో ఎన్‌పీఎస్ గరిష్టంగా 50 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు రిటైరయ్యేదాకా లాక్–ఇన్ అయిపోతాయి. ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 40 శాతం కార్పస్‌ను యాన్యూటీ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు యువకులు. స్టాక్ మార్కెట్ అంటే భయపడాల్సిన, దూరంగా ఉండాల్సిన వయస్సు కాదు మీది. స్వల్పకాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగానే ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ల విషయానికొస్తే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్–ఇన్ పీరియడ్ మూడేళ్లు మాత్రమే. ప్రణాళికబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తే, మూడేళ్ల కాలంలో మీరు నష్టపోయే పరిస్థితి కానీ, నిరాశపడే రాబడులు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రిస్క్(నష్టభయం) తగ్గించుకోవాలంటే సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒడిదుడుకులు, నష్టభయం రెండూ వేర్వేరు. స్వల్పకాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఒడిదుడుకులు నష్టభయంగా మారతాయి. మీలాంటి యువకులు కొంత రిస్క్‌ను భరించైనా సరే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం.
నేను రెండేళ్ల క్రితం ఎల్‌ఐసీ జీవన్ తరంగ్ పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.35,000 చొప్పున ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఇది చాలా ఎక్కువగా ఉందని నా భావన. ఈ పాలసీని సరెండర్ చేయమంటారా ? కొనసాగించమంటారా? – అనిల్, విజయవాడ
జీవన్ తరంగ్ అనేది హోల్ లైఫ్ ప్లాన్. బీమా మొత్తానికి 5.5 శాతం రేటు చొప్పున వార్షిక సర్వైవల్ బెనిఫిట్‌ను ఈ పాలసీ అందిస్తుంది. బీమా పాలసీ ముగిసిన తర్వాత బోనస్‌లను ఇతరత్రా మొత్తాలను చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఈ మొత్తాలను పాలసీ ముగియక ముందే అందజేస్తారు. పాలసీకి సంబంధించిన వ్యయాలను చార్జీలను ఈ పాలసీ వెల్లడించడం లేదు. ప్రీమియమ్ అధికంగా ఉండటం, వ్యయాలు, చార్జీల విషయాల్లో పారదర్శకత లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ పాలసీని సరెండర్ చేయడమే మంచిది. మీరు పాలసీ తీసుకొని మూడేళ్లు కాలేదు కాబట్టి, ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు తిరిగి ఏమీ రాదు. ఆర్థిక విషయాల్లో ఎప్పుడూ సరళంగా ఉండాలి. జీవిత బీమా కోసం పూర్తి టర్మ్ పాలసీలు తీసుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మీకు మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment