అమ్మ కోసం ఎలాంటి పాలసీ తీసుకోవాలి?
డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేద్దామనుకుంటున్నాను. ఇలా చేస్తే డెరైక్ట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుందా? లేకుంటే రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుందా? డీ మ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
- సాగర్, వరంగల్
మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో మదుపు చేయవచ్చు. కానీ డెరైక్ట్ ప్లాన్‌ల్లో కాదు. మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలేమీ ఇవ్వలేదు. బ్యాంక్ లేదా బ్రోకింగ్ సంస్థ వంటి ఇంటర్మీడియరీ అందించే డీ మ్యాట్ అకౌంట్ ద్వారా మీరు లావాదేవీలు నిర్వహిస్తున్నారని భావిస్తున్నాను. ఇలాంటి ఇంటర్మీడియరీ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ, ఆ డీమ్యాట్ సంస్థకు కొంత కమీషన్ చెల్లిస్తుంది. వినియోగదారులు నేరుగా మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించి డెరైక్ట్ ప్లాన్‌ల్లో మదుపు చేయవచ్చు. ఇన్వెస్టర్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు/ఏజెంట్లు లేకుండా ఇన్వెస్ట్ చేయడం కోసం ఉద్దేశించినవే.. డెరైక్ట్ ప్లాన్‌లు.
మా అమ్మ వయస్సు 58 సంవత్సరాలు. ఆమె కోసం ఇంతవరకూ ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. ఆమె కోసం ఏమైనా ప్లాన్‌లు సూచిస్తారా ? ఆమెను ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో చేర్చమంటారా ? లేక ఆమె కోసమే ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ తీసుకోమంటారా ? తగిన సలహా ఇవ్వండి.
- సునయన, విశాఖపట్టణం
పెద్దవాళ్లను/సీనియర్ సిటిజన్‌లను ఫ్యామిటీ ఫ్లోటర్ ప్లాన్‌లో చేర్చడం సరైనది కాదు. ఇలా చేస్తే మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు అనవసరంగా పెరిగిపోతాయి. సీనియర్ సిటిజన్‌లు ఈ వైద్య బీమా రక్షణను అధికంగా వినియోగించుకుంటారు. కుటుంబంలోని ఇతరులకు తక్కువ బీమా రక్షణ అందుతుంది. అందుకని మీ అమ్మగారి కోసం మీరు ప్రత్యేకంగా వేరే ప్లాన్‌ను తీసుకోవడమే ఉత్తమం. జీవిత కాల రెన్యూవల్ ఉండే ప్లాన్‌ను తీసుకోవచ్చు. మీ అమ్మగారి ఆరోగ్య బీమా పాలసీ కోసం-ఐసీఐసీఐ లాంబార్డ్ కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్-ఐ హెల్త్ ప్లాన్, బజాజ్ అలయంజ్ సిల్వర్ హెల్త్, అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. పాలసీలు తీసుకునేటప్పుడు మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ తదితర అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించండి. 58 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కోసం ఆన్‌లైన్‌లో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోకూడదు. మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితులను మీ ప్రశ్నలో ప్రస్తావించలేదు. అందుకని ప్రీమియమ్‌ల గురించి ఏమీ చెప్పలేకపోతున్నాం. పాలసీకు ముందే చేసే హెల్త్ చెకప్, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇతర అంశాలపై ప్రీమియమ్‌లు ఆధారపడి ఉంటాయి.
ఆర్బిట్రేజ్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్‌లో మదుపు చేద్దామనుకుంటున్నాను. ఈ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే నేను ఎంత మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది?
- ప్రసేన్ కుమార్, హైదరాబాద్
పన్ను అంశాల పరంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందించే డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్ డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఎలాంటి పన్నులు చెల్లించవు. ఈ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఫండ్స్ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.5,000 స్వల్పకాలిక లాభాలు పొందాను. ఈ లాభాలపై నేను ఎంత పన్ను చెల్లించాలి ? ఇలా పొందిన లాభాలను వేరే ఏ ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపులు పొందగలనా? నేను ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్), బీమా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నేను పన్ను మినహాయింపులు పొందాను. ఈ స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపునుపొందడానికి ఏమైనా మార్గాలున్నాయా ?
- క్రాంతి, బెంగళూరు
మీ ఈక్విటీ పెట్టుబడులను కొనుగోలు చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను మినహాయిం పులు పొందడానికి మీకు వేరే ఎలాంటి మార్గం లేదు. ఈ ఈక్విటీ పెట్టుబడులపై వచ్చిన లాభాలను వేరే ఏ ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు పన్ను మినహాయింపులు పొందలేరు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్