రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...? | Risk-free investment ...? | Sakshi
Sakshi News home page

రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?

Published Mon, May 30 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?

రిస్క్‌లేని పెట్టుబడి సాధనమేది...?

మా అమ్మగారు సీనియర్ సిటిజన్. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. 10-15 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు.  పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఆల్ట్రా షార్ట్‌టర్మ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి.
 - రాధాకృష్ణ, నెల్లూరు

 
పన్ను ప్రయోజనాలతో పాటు సురక్షితమైన రాబడులు కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గమని చెప్పవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. అయితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దీనిపై వచ్చే రాబడులు ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడుల కన్నా కొంచెమే అధికంగా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సొమ్ములను వెనక్కితీసుకోవాలి అనుకుంటే  డెట్ ఫండ్స్ ఉత్తమం.

ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ అమ్మగారి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల త ర్వాత ఈ డెట్ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలిపి 20 శాతంగా ఉంటుంది.

ఈక్విటీ మార్కెట్లో లాగానే డెట్ మార్కెట్లో కూడా వివిధ బాండ్ల ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకని డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడులు, ఏడాది ఏడాదికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీరేట్లు కూడా ప్రతి మూడు నెలలకొకసారి మారుతూ ఉన్నాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనం. ప్రభుత్వ దన్నుతో ఇది నడుస్తుండడమే దీనికి కారణం.
 
నేను భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవాలనుకుంటున్నాను. ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్‌కు దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. అయితే నాకు కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో కూడా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. భారత పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం తీసుకోవడం వల్ల ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏమైనా ప్రభావం ఉంటుందా?     - మార్గరెట్, హైదరాబాద్
 
ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), నాన్ రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై)తో దాదాపు సమానం. ఆర్థిక, విద్య తదితర రంగాల్లో ఈ  హోదాలు ఉన్నవారికి ఒకే విధమైన హక్కులు లభిస్తాయి. ఒక్క వ్యవసాయ, ప్లాంటేషన్ ఆస్తుల కొనుగోళ్లలో మాత్రమే తేడా ఉంటుంది. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు, అయితే మీ పౌరసత్వంలో మార్పులు, చేర్పులు గురించి మీ బ్యాంక్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు సమాచారమందించడం తప్పనిసరనే విషయాన్ని మాత్రం మరచిపోకండి.
 
నా వయస్సు 34 సంవత్సరాలు. నా కోసం ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్, నా నాలుగేళ్ల కూతురి కోసం జీవన్ అంకుర్ పాలసీలను తీసుకున్నాను. రెండింటి మెచ్యురిటీ కాలం 20 ఏళ్లు. ఈ రెండింటి వార్షిక ప్రీమియమ్ రూ.59,000. ఇప్పటికి మూడేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను.  దీర్ఘకాల రాబడులకు ఇవి సరైనవి కావని మిత్రులంటున్నారు. ఈ పాలసీల నుంచి బయటపడే మార్గం చెప్పండి.                  - సందేశ్, వైజాగ్
 
ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌కు సంబంధించి గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ--మీరు చెల్లించిన మొత్తం ప్రీమియమ్‌లలో ఒక ప్రత్యేకమైన శాతంగా ఉంటుంది. అదనపు ప్రీమియమ్, రైడర్లకు చెల్లించిన ప్రీమియమ్‌లకు మినహాయింపు ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీ కాల వ్యవధి, మీరు ఈ పాలసీని ఎప్పుడు సరెండర్ చేస్తారు అన్న విషయాలపై ఈ పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్‌ఐసీ జీవన్ అంకుర్ అనేది లాభాలతో కూడిన సంప్రదాయ ప్లాన్.  ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ తండ్రి/తల్లిపై ఉంటుంది.

ఈ ప్లాన్‌లో కూతురు నామినీగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లైతేనే/ లేదా మూడు పూర్తి ప్రీమియమ్‌లు చెల్లిస్తేనే  మీరు ఈ పాలసీని సరెండర్ చేయగల అవకాశముంటుంది. దీనికి సరెండర్ వేల్యూ- మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతం(మొదటి ఏడాది ప్రీమియమ్, ఆప్షనల్ రైడర్, అదనపు ప్రీమియమ్‌లను మినహాయించి)గా ఉంటుంది.  మీకు నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీలను సరెండర్ చేయడమే సముచితమని భావిస్తున్నాం.  ఇలాంటి బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ప్లాన్‌లు స్వల్ప మొత్తానికే బీమా కవర్‌ను ఇస్తాయి. అంతంత రాబడులు మాత్రమే వస్తాయి.

 ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్‌ను  ఎంచుకోవడం సరైనది కాదు. ఇలా చేస్తే బీమా కవర్, రాబడుల్లో రాజీ పడాల్సి ఉంటుంది. జీవిత బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. తక్కువ ప్రీమియమ్‌లు, అధిక రాబడులు వీటి ప్రత్యేకత. ఇక పాప చదువు, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
 
నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) రెగ్యులర్ ప్లాన్‌లో రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్ ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్‌కు మారాలనుకుంటున్నాను. అలా మారే వీలుందా? అవసరమైతే ఏమైనా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందా ?              - అబ్దుల్లా, వరంగల్
 
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు తప్పనిసరిగా మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగానే మారడానికి వీలు లేదు. జరిమానా చెల్లించి మారే వీలు ఏమీ లేదు.
- ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement