మార్కెట్ పడుతోంది.. ఇప్పుడేం చేయాలి? | Investments Dhirendra Kumar | Sakshi
Sakshi News home page

మార్కెట్ పడుతోంది.. ఇప్పుడేం చేయాలి?

Published Mon, May 4 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

మార్కెట్ పడుతోంది.. ఇప్పుడేం చేయాలి?

మార్కెట్ పడుతోంది.. ఇప్పుడేం చేయాలి?

ఇటీవల స్టాక్ మార్కెట్ పతనమవుతోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలని కొందరంటున్నారు. ఎంత వరకూ పడుతుందో చెప్పలేం కాబట్టి, వేచి చూడమని మరికొందరంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రిటైల్ ఇన్వెస్టర్‌గా మేం ఏమి చేయాలి?
- కాత్యాయని, తిరుపతి, వంశీకృష్ణ, ఈ మెయిల్

 
మీరు క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు మీకు 5-10 ఏళ్లపాటు అవసరం లేదనుకున్నప్పుడు.. స్టాక్ మార్కెట్ పతనమవుతున్న ఈ సందర్భం ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మంచి అవకాశమని చెప్పవచ్చు. మీకు చౌక ధరలో మంచి షేర్లు లభిస్తాయి. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ పతన బాటలోనూ, మనకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్ ఉచ్ఛస్థాయిలోనూ ఉండాలనుకోవడం సగటు ఇన్వెస్టర్ కోరిక, దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు ఈక్విటీల్లో తప్పక ఇన్వెస్ట్ చేయాల్సిందే. అయితే మార్కెట్ ఎంత వరకూ పతనమవుతుందనేది ఎవరూ ఊహించలేరు.

ఇక మార్కెట్ పతనబాటలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక రిటైల్ ఇన్వెస్టర్‌గా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు యావరేజ్ చేయండి. మార్కెట్లు ఎప్పుడూ మీ నియంత్రణలో ఉండవు. మీ నియంత్రణలో ఉండేవి రెండే విషయాలు... మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు? ఎంత క్రమ శిక్షణతో ఇన్వెస్ట్ చేస్తారనే రెండు విషయాలే మీ నియంత్రణలో ఉంటాయి.  మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యం (ఇల్లు/కారు కొనడం, పిల్లల చదువులు.. తదితర లక్ష్యాలు) కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి.. అవసరమైనప్పుడు  మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్యాష్ చేసుకోండి.
 
నేను ఐసీఐసీఐ, డీఎస్‌పీ సంస్థలకు సంబంధించి ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో ఇన్వెస్ట్ చేశాను. అవి ఈ నెలలోనే మెచ్యూర్ అవుతున్నాయి. వీటికి సంబంధించి పన్ను నిబంధనల్లో మార్పులు చేర్పులు జరిగాయని విన్నాం. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఎఫ్‌ఎంపీల్లో కొనసాగించమంటారా? వీటిని రిడీమ్ చేసుకొని వేరే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోమంటారా?                      - మహేశ్, కరీంనగర్
 
ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లను పొడిగించుకునే అవకాశం ఇన్వెస్టర్లకు లేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పాత ఎఫ్‌ఎంపీలను పొడిగించాలని ఆఫర్ చేస్తేనే మీరు వీటిని కొనసాగించగలుగుతారు. ఒక వేళ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ ఎఫ్‌ఎంపీలను కొనసాగించాలని ఆఫర్ చేస్తే.., మీకు తక్షణం ఈ సొమ్ములు అవసరం లేనిపక్షంలో  మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఎఫ్‌ఎంపీల్లోనే కొనసాగించండి. ఇక వీటికి సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఎఫ్‌ఎంపీల నుంచి మూడేళ్లలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తారో, ఈ స్లాబ్‌కు సంబంధించి పన్ను రేటు మీకు వర్తిస్తుంది.
 
ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌డీఎఫ్‌సీలకు సంబంధించిన మంత్లీ ఇన్‌కం ప్లాన్(ఎంఐపీ) సంబంధించిన డివిడెండ్‌లపై ఏమైనా పన్నులు చెల్లించాలా?                   - క్రాంతి, గుంటూరు
 
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మంత్లీ ఇన్‌కం ప్లాన్(ఎంఐపీ)ల డివిడెండ్‌లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) (ఇది ప్రస్తుతం 28.33 శాతంగా ఉంది) చెల్లించి మీకు డివిడెండ్‌లను అందజేస్తాయి. మీకు వచ్చే రాబడుల నుంచే ఈ డీడీటీని సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి.
 
గత మూడేళ్లుగా ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్‌కు మారమంటారా? లేదా ఈ ఫండ్‌లోనే కొనసాగమంటారా?    - కిరణ్, విజయవాడ
 
ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ నుంచి మీరు వైదొలగాల్సిన అవసరం లేదు. ఏడాది కాలానికి ఇది మంచి పనితీరునే కనబరిచింది. ఈ ఫండ్ ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డ్ కూడా ఈ కేటగిరీ ఇతర ఫండ్‌ల కంటే కూడా చాలా మెరుగ్గా ఉంది. మేం ఈ ఫండ్‌కు 4 స్టార్ రేటింగ్ ఇచ్చాం. ఒక ఏడాది పనితీరు బాగాలేదన్న కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగడం సరికాదు. స్వల్పకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తరహా ఫండ్‌ల పనితీరుపై నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement