డివిడెండ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తిస్తుందా ? | Uniformity in fund taxation: Close, but not there yet | Sakshi
Sakshi News home page

డివిడెండ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తిస్తుందా ?

Published Mon, Mar 14 2016 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

డివిడెండ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తిస్తుందా ?

డివిడెండ్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తిస్తుందా ?

తాజా బడ్జెట్‌లో రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించారు కదా ! ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లకు కూడా వర్తిస్తుందా ? కొన్ని మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై డీడీటీని ఎలా లెక్కిస్తారు?
 - హిమాంశు, హైదరాబాద్

 
బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదించిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించదు. కంపెనీలు ఇచ్చిన డివిడెండ్లపై మాతమే ఈ ట్యాక్స్‌ను లెక్కిస్తారు. ఏడాది కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ ఆదాయం పొందినట్లయితే ఆ వ్యక్తి 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వ్యక్తులకు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్), సంస్థలకు వర్తిస్తుంది.
 
నా కూతురి చదువు కోసం నెలకు రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎస్‌బీఐ ఈవెల్త్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందని నా మిత్రుడొకరు సలహా ఇచ్చారు. నా కూతురి భవిష్యత్ విద్యావసరాల కోసం ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా ? ఈ ప్లాన్‌కు బదులుగా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం సరైనదా ? ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు 10(10డి ) పన్ను ప్రయోజనాలు లభిస్తాయా ?
 - అనూష, విశాఖపట్టణం

 
ఎస్‌బీఐ లైఫ్-ఈవెల్త్.. ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్ ఉన్న బీమా ప్లాన్ ఇది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ కలగలసిన ప్లాన్‌లను ఎప్పుడూ ఎంచుకోకూడదు. ఈ తరహా ప్లాన్‌లు చాలా తక్కువ బీమా కవర్‌ను అందిస్తాయి. ఐదేళ్ల లాకిన్ పీరియడ్, లిక్విడిటీ తక్కువగా ఉండడం... ఇవన్నీ కూడా యూలిప్‌లకు ప్రతికూలాంశాలు. కూతురి విద్య వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే సరైన ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం. మీరు దీర్ఘకాలం పాటు ఈక్విటీ  మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి పన్ను అంశాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

ఏడాది తర్వాత విక్రయించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఈ ఫండ్స్ పరిశీలించవచ్చు. ... ఎస్‌బీఐ బ్లూ చిప్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ మల్టీప్లయర్ ఫండ్, టాటా బ్యాలెన్స్‌డ్-రెగ్యులర్ ఫండ్, యూటీఐ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్, ఐడీబీఐ ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్.
 
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ఎన్‌పీఎస్ అకౌంట్ మాకు తప్పనిసరి. నా వేతన ఖాతాతో అనుసంధానమై ఉన్న ఎన్‌పీఎస్ అకౌంట్‌లో ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవడానికి లేదు. అందుకని మరో ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వీలు ఉందా?                            
- భార్గవ్, కరీంనగర్

 
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఖాతా తెరవడానికి వీలు లేదు. అంతేకాకుండా ఎన్‌పీఎస్‌లో ఈక్విటీకి కేటాయింపులు 50 శాతానికి మించి పెంచడానికి లేదు. ఈక్విటీ కేటాయింపులు పెంచాలంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి మార్గం. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి ప్రకారం పన్ను తగ్గింపులు కావాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీ ప్రకారం ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్ను తగ్గింపులు రూ.1.5 లక్షల వరకూ పొందవచ్చు. ఒకవేళ ఇప్పటికే సెక్షన్ 80 సీ పరిమితిని మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మించిపోతే, ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ స్కీమ్స్‌ను గానీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను గానీ పరిశీలించవచ్చు.
 
నేను ఐసీఐసీఐ లైఫ్‌స్టేజ్ పెన్షన్ ప్లాన్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. మూడు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయాలనుకుంటున్నాను. సరెండర్ విలువ ఎంత వస్తుంది?                                             
- సుశీల్, నెల్లూరు

 
ఐసీఐసీఐ లైఫ్‌స్టేజ్ పెన్షన్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్.  బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలసిన పాలసీ ఇది. మూడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లిస్తే, ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. అన్ని చార్జీలు పోను మీరు సరెండర్ చేసేటప్పుడు ఈ ఫండ్ విలువలో 96 శాతం సరెండర్ విలువగా మీకు లభిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఎప్పుడూ ఇలా ఇన్వెస్ట్‌మెంట్, బీమా కలగలసిన పాలసీలు తీసుకోవద్దు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలుగుతారు. జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement