జీవన్ సరళ్ సరెండర్ చేయాలా? | should surrender Jeevan Saral ? | Sakshi
Sakshi News home page

జీవన్ సరళ్ సరెండర్ చేయాలా?

Published Mon, Nov 3 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

should surrender Jeevan Saral ?

నా కొడుకు  వయస్సు 24 సంవత్సరాలు. ఇటీవలనే ఉద్యోగంలో చేరాడు. అతనికి సంబంధించిన పీపీఎఫ్, టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను. తన పొదుపు సొమ్ములను మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్మాల్-క్యాప్ ఫండ్‌లను ఎంపిక చేశాను. మూడో ఫండ్‌గా ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీని పరిశీలిస్తున్నాను. కానీ ఈ ఫండ్ రేటింగ్ ఇటీవల పడిపోయింది. మీరేమంటారు?  - మహ్మద్ ఇజాజ్, హైదరాబాద్
 ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ... మంచి రాబడులనిస్తున్న ఫండ్ అనే చెప్పవచ్చు.  మీ అబ్బాయి  కెరీర్ పొదుపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ప్రారంభం కావడం సంతోషించదగ్గ విషయం. మీ అబ్బాయి కోసం మీరు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ బావుంది. అయితే ఒక పెద్ద మార్పు సూచిస్తాను. మీ అబ్బాయి వయస్సు చిన్నది. పీపీఎఫ్ అకౌంట్లో 20-30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం కంటే, ఒక మంచి ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో క్రమం తప్పకుండా 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే పీపీఎఫ్‌లో కన్నా అధిక రాబడులు పొందవచ్చు. మరొక మార్పు ఏమిటంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ మొదలు పెట్టే వాళ్లు, మొదటగా ట్యాక్స్-సేవింగ్స్ ఫండ్‌తో ప్రారంభించాలి. ఇది మీ అబ్బాయి అనుసరిస్తే తన ఆదాయంపై పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం అతడికి లభిస్తుంది. అందుకని పీపీఎఫ్ అకౌంట్‌లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ, కొద్ది మొత్తాన్ని కొన్ని ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

 మూడేళ్ల క్రితం ఎల్‌ఐసీ జీవన్ సరళ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను. ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియమ్‌గా చెల్లించాను. ఈ ప్లాన్ ప్రస్తుత సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. ఇన్సూరెన్స్‌కు ఇది సరైనదేనా?  దీనిని కొనసాగించమంటారా ? లేదా మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? కల్పన, తిరుపతి
 ఎల్‌ఐసీ జీవన్ సరళ్ అనేది ఎండోమెంట్ పాలసీ. అన్ని ఎండోమెంట్ పాలసీల్లాగే ఇది కూడా వ్యయాల విషయమై పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి ప్లాన్‌లతో ఉండే ప్రధానమైన సమస్యే ఇది. ఈ పాలసీ పదవ సంవత్సరం తర్వాత నుంచి లాయల్టీ ఆడిషన్స్ లభిస్తాయి. మీరు ఇప్పటివరకూ రూ.54,000 ప్రీమియంగా చెల్లించారు. ఈ ప్లాన్ సరెండర్ వేల్యూ రూ.30,000గా ఉంది. మీ నష్టాలను కనిష్టం చేసుకోవాలంటే మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే ఉత్తమం. ఈ పాలసీ నుంచి వైదొలగి మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఈ ప్లాన్ నుంచి వైదొలిగితే మీకు బీమా రక్షణ ఉండదు. అందుకని ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, వనరులు ఆధారంగా, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి తగిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయండి.

 నా వయస్సు 60 సంవత్సరాలు. త్వరలో నా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) అకౌంట్ మెచ్యూర్ కాబోతోంది. 40% మొత్తాన్ని ఎల్‌ఐసీ నుంచి పెన్షన్ కోసం(జీవన్ ఆక్షయ్ సిక్స్‌త్) ఎంచుకున్నాను. 60% మొత్తం నా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయ్యేలా ఎంపిక చేసుకున్నాను. ఈ 60% మొత్తంపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందా? ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభిస్తాయా?- మురళీ  వైజాగ్

 నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) మెచ్యూర్ అయితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎన్‌పీఎస్ మొత్తంలో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యూటీ కొనుగోలు కోసం వెచ్చించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై మీ ఆదాయపు పన్ను స్లాబుననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తించవు. అంతేకాకుండా మాన్యుటీ ప్లాన్ ద్వారా నెలవారీ మీరు పొందే మొత్తాలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement