బైక్‌ కోసం... ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? | What fund better for the bike investment | Sakshi
Sakshi News home page

బైక్‌ కోసం... ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ?

Published Mon, Oct 29 2018 2:18 AM | Last Updated on Mon, Oct 29 2018 2:18 AM

What fund better for the bike investment - Sakshi

నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌నా లేక మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? 25 ఏళ్ల కాలంలో మల్టీ క్యాఫ్‌ ఫండ్‌ కంటే స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అధిక రాబడులనిస్తుందా ? ఏ ఫండ్‌ను ఎంచుకోమంటారు ?  
–ఉమాదేవి, విశాఖ పట్టణం  
భారత్‌లాంటి దేశాల్లో 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ అధిక రాబడులనిస్తుంది. స్మాల్‌ క్యాప్‌ కంటే మిడ్‌ క్యాప్‌ ఫండ్‌లో తక్కువ రాబడులు వస్తాయి. మిడ్‌ క్యాప్‌ కంటే మల్టీ క్యాప్‌లో ఇంకా తక్కువగా రాబడులు వస్తాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌.. స్మాల్‌ క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్‌ చేస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ మల్టీ క్యాప్‌ మరింత విస్తరిస్తాయి. అవి పెరుగుతున్న కొద్దీ స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం.. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌కు కొంచెం సమస్యాత్మకంగానే పరిణమిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ మారుతున్న తీరు, పరిణామం చెందుతున్న రీతిని బట్టి చూస్తే.. స్మాల్‌ క్యాప్‌ కంపెనీలే మంచి వృద్ధిని సాధిస్తాయి.

భవిష్యత్తులో పెద్ద కంపెనీగా మారే చిన్న కంపెనీని ఇప్పుడే మనం గుర్తించగలిగి, ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే,  మంచి రాబడులు పొందవచ్చు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచిది అనిపిస్తుంది. అయితే స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం చాలా రిస్క్‌తో కూడిన పని. ఒక్కోసారి భారీ నష్టాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

అయితే 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ కంటే మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ అధిక రాబడులను, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ కంటే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ మరింత అధిక రాబడులను ఇస్తాయి. అధిక రిస్క్‌ భరించలేని పక్షంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రెండు సమాన భాగాలు చేసి, ఒక భాగాన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో, మిగిలిన దానిని మరో రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని మల్టీ క్యాప్‌ ఫండ్‌లోనూ, మరో భాగాన్ని మిడ్‌క్యాప్‌ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయండి.  

నా వయస్సు 22 సంవత్సరాలు. క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనే  ఉద్యోగం వచ్చేసింది. మూడేళ్లలో ఒక బైక్‌ను, పదిహేనేళ్లలో ఒక ఇంటిని కొనుక్కోవాలనుకుంటున్నాను.  ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, నా లక్ష్యాలు నెరవేరతాయి?  నెలకు రూ.3,000 వరకూ ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.3,000 సరిపోతాయా ?
–భార్గవ, హైదరాబాద్‌  
నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలన్నది మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బైక్, ఇంటి ధరలను బట్టి ఉంటుంది. నెలకు రూ.3,000 ఇన్వెస్ట్‌ చేయడం సరిపోవచ్చు. లేదా సరిపోకపోవచ్చు. అయితే 22 ఏళ్ల వయస్సులోనే కొన్ని ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, నెలకు ఎంతో కొంత మొత్తం పొదుపు చేయాలనుకోవడం చాలా మంచి విషయం. కొన్ని ఆర్థిక లక్ష్యాలకు నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది. కొన్నింటికి ఉండదు. ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువుల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకోండి. కచ్చితంగా వాళ్లు ఉన్నత విద్యాభ్యాస అవసరాలకు ఆ సొమ్ములు అంది తీరాలి. ఇక మీ రెండు ఆర్థిక లక్ష్యాలకు కాలపరిమితి కొంచెం అటూ, ఇటూ అయినా పర్లేదు. అంటే మీరు మూడేళ్లలో బైక్‌ కొనాలనుకుంటున్నారు.

మీరు అనుకున్న మొత్తం రెండున్నరేళ్లకే సమకూరితే సంతోషమే కదా! లేదా మూడేన్నరేళ్లు పట్టినా ఓకే కదా! పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. అలా కాకుండా మీ లక్ష్యాలకు కాలపరిమతిని ఒక ఆరు నెలలు అటూ, ఇటూ అయినా పర్లేదు. ఇక ఈ లక్ష్యం (మూడేళ్లలో బైక్‌ కొనుగోలు)కోసం ఏదైనా మంచి బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌(అగ్రెసివ్‌ హైబ్రిడ్‌)లో ఇన్వెస్ట్‌ చేయండి. దీని వల్ల ఇన్వెస్ట్‌ చేసే అలవాటు మీకు అలవడుతుంది. మార్కెట్‌ ఒడిదుడుకులకు గురైనా ఆ ప్రభావం ఈ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌పై పెద్దగా ఉండదు. ఈ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మీకు కావలసిన మొత్తం రాగానే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని మీకు కావలసిన బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

బైక్‌ కొనుగోలు చేయడానికి ఎప్పుడూ అప్పు చేయకండి. ఉదాహరణకు మీరు రూ.60,000–70,000 రేంజ్‌లో ఉండే బైక్‌ కొనాలనుకున్నారనుకుందాం. నెలకు రూ.3,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ పోయారనుకోండి. ఒకటిన్నర లేదా రెండేళ్లలోనే మీరు బైక్‌ కొనుక్కోగలరు. ఇదే ప్రణాళికను ఇంటి కొనుగోలు లక్ష్యం కోసం 15 ఏళ్లపాటు కొనసాగించండి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటికి కావలసిన మొత్తంలో కనీసం సగమైనా సమకూరవచ్చు. మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకొని ఇంటిని కొనుగోలు చేయండి. అత్యవసరాలు, ఇంటి కొనుగోలు కోసం అప్పు చేయవచ్చు. కానీ వినియోగ వస్తువుల కోసం కాదనేది నా అభిప్రాయం.   

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) లాక్‌ ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లు కదా ! ఈ మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం మంచిదా ? లేకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌  చేస్తే మంచిదా ?
–రాకేష్, ఈమెయిల్‌  
మంచి రాబడులు పొందడానికి, పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మంచి మదుపు సాధనాలు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఎలా మంచి ఫలితాలనిస్తుందో, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా అలాంటి మంచి ఫలితాలనే ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న పెద్ద మొత్తాన్ని కనీసం 12 సమాన భాగాలుగా చేసి, నెలకు ఒక్కో భాగాన్ని సిప్‌ విధానంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. దీనివల్ల మీరు మార్కెట్‌ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందగలుగుతారు.  


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement