
మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ఒక రిటైల్ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాలన్స్‌డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాలని మిత్రుడొకరు అంటున్నారు. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మరికొందరు అంటున్నారు. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత ఈక్విటీ ఫండ్‌లోనూ, మరికొంత బ్యాలన్స్‌డ్ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అలా కాకుండా మొత్తం ఈక్విటీ ఫండ్‌లోనో, బ్యాలన్స్‌డ్ ఫండ్‌లోనో ఇన్వెస్ట్ చేయమంటారా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను సూచించండి. –రవీందర్, విజయవాడ
స్టాక్ మార్కెట్ చక్రీయమైనది. మార్కెట్ పెరుగుదల, పతనం సహజమైన అంశాలు. ఇటీవల కాలంలో ఈక్విటీ ఫండ్స్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా పెరిగిందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల పైచదువులు.. తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం దీర్ఘకాలం పాటు (కనీసం ఐదేళ్లకు మించి) ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాలన్స్‌డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాలని మీ మిత్రుడు చెప్పిన మాట నిజమే.
దీనికి పలు కారణాలున్నాయి. బ్యాలన్స్‌డ్ ఫండ్స్ స్థిరాదాయ సాధనాల్లో 25 % వరకూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా సదరు ఫండ్‌కు మరింత స్థిరత్వం వస్తుంది. ఒక ఏడాది దాటిన బ్యాలన్స్‌డ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి పన్ను భారం ఉండదు. బ్యాలన్స్‌డ్ ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఈ ఫండ్‌ను ప్రతి రోజూ రీబ్యాలన్స్ చేస్తారు. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా ఇలా రీబ్యాలన్స్ చేయడం వల్ల బ్యాలన్స్‌డ్ ఫండ్ పనితీరు ఎప్పటికప్పుడు మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ప్రాంక్లిన్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా, ఎస్‌బీఐల బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) ఫండ్ మేనేజర్‌గా ఎస్‌బీఐను ఎంచుకుందామనుకుంటున్నాను. ఎన్‌పీఎస్ ప్లాన్‌ల విషయమై నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా కేటాయించాలి ? –తులసి, విశాఖపట్టణం
ఎన్‌పీఎస్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వివిధ సంస్థల పనితీరుల్లో పెద్దగా తేడాలు లేవు. ఎస్‌బీఐ పనితీరు సమంజసమైన స్థాయిలోనే ఉంది. మీరు మీ ఎన్‌పీఎస్ ఖాతా ఫండ్ మేనేజర్‌గా ఎస్‌బీఐను ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ప్రధానంగా మూడు ప్లాన్‌లు ఉన్నాయి. ఈక్విటీ(ఈ), ప్రభుత్వ బాండ్లు(జి), కార్పొరేట్ బాండ్లు(సి). ఎన్‌పీఎస్ ఈ(ఈక్విటీ) ప్లాన్‌లో గరిష్టంగా 50 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు 15–20 ఏళ్ల పాటు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 50 శాతం వరకూ ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక ప్రభుత్వ బాండ్లలో 25 శాతం, కార్పొరేట్ బాండ్లలో 25 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు.
మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేక విడివిడిగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేయడం మంచిదా ?
–సిరాజ్, హైదరాబాద్
ఈక్విటీ, డెట్ మార్కెట్లు చక్రీయంగా ఉంటాయి. ఈ మార్కెట్లలో పెరుగుదల, తరుగుదల సహజమైన విషయాలు. అందుకని కొన్నిసార్లు లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి పనితీరు చూపించవచ్చు. ఒక్కోసారి మిడ్ క్యాప్ ఫండ్స్ మంచి లాభాలు సాధించవచ్చు. మరొక్కసారి స్మాల్ క్యాప్ ఫండ్స్ మనం ఊహించని రాబడులనివ్వవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడు మాత్రం స్మాల్ క్యాప్స్ కూడా తీవ్రంగా పతనమవుతాయి. మిడ్ క్యాప్ ఫండ్స్‌పై కూడా తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. లార్జ్ క్యాప్స్ మాత్రం ఒకింత తట్టుకోగలుగుతాయి. ఒక వేళ మీరు మల్టీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే,..ఈ మల్టీక్యాప్ ఫండ్ స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది కనుక, తగిన స్థాయిలో డైవర్సిఫికేషన్ ఉంటుంది.
మూడేళ్ల క్రితం మీరు కొంత, కొంత మొత్తాలను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌ల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు వాటి రాబడులను పరిశీలిస్తే, స్మాల్, మిడ్ క్యాప్‌ల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ రెండు రెట్లు పెరిగి ఉండేవి. ఇక లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగేవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి మీరు మొగ్గు చూపేవారు. అయితే 2008 నాటి పతనంలో మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ 70–80% వరకూ పతనమయ్యాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రం 40–45% రేంజ్‌లోనే నష్టపోయాయి. ఫండ్ మేనేజర్ మంచి సమర్థత గలవాడైతే, మల్టీ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు కనుక మంచి ఫండ్ మేనేజర్‌ను ఎంచుకోగలిగితే మీరు మల్టీ క్యాప్ ఫండ్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
మిడ్/స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మార్కెట్‌ను ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు రీబ్యాలన్స్ చేయాల్సి ఉంటుంది. రిస్క్‌ను భరించగలిగితే స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ పనితీరు తీవ్రంగా ప్రభావితమవుతుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలామంది సాధారణ ఇన్వెస్టర్లు డైవర్సిఫికేషన్ నిమిత్తం మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి.
– ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్