
స్కీము మారితే ఎగ్జిట్ లోడ్ చెల్లించాలా?
నేనొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశాను.
నేనొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇదే స్కీమ్ గ్రోత్ ఆప్షన్ స్కీమ్‌కు మారాలనుకుంటున్నాను. ఏమైనా ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుందా? అలాగే ఏదైనా ఈక్విటీ ఫండ్ గ్రోత్ ఆప్షన్ నుంచి డివిడెండ్ ఆప్షన్‌కు మారినా కూడా ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు ఎగ్జిట్ లోడ్ టైమ్ ఫ్రేమ్‌లోగా ఈ మార్పులు జరిగినా కూడా ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సిందేనా ?
- సీతారామ్, వైజాగ్
ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మారినా, లేక గ్రోత్ ఆప్షన్ నుంచి డివిడెండ్ ఆప్షన్‌కు మారినా... దీన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరించి, కొత్త స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా భావిస్తారు. అప్పుడు ఎగ్జిట్ లోడ్ తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ టైమ్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ ఈ ఎగ్జిట్ లోడ్ తప్పదు.
నేనొక డెట్ ఫండ్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాను. ఆదాయపు పన్ను భారం పోను డెట్ ఫండ్స్ రాబడులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువగానే వస్తాయా? డెట్ ఫండ్స్‌కు ఏమైనా లాకిన్ పీరియడ్ ఉంటుందా?
- మహేందర్, నిజామాబాద్
ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని పరిగణనలోకి తీసుకొని డెట్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి. కొన్ని రోజులు, వారాలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని నెలల కోసమైతే, ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఏడాది లేదా రెండేళ్ల కాలానికి షార్ట్-టెర్మ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 3-5 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా కాలాన్ని బట్టి వివిధ రకాల ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
అలా కాకుండా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయని చెప్పవచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలాగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్దేశిత రాబడులను ఇవ్వవు. డెట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పనితీరు ఆధారంగా రాబడులు వస్తాయి. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ) కాకుండా, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. అయితే ముందుగానే ఉపసంహరించుకుంటే, అధిక పన్నులు చెల్లించాల్సి రావచ్చు.
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో వీటిపై 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉం టంది. మూడేళ్లలోపే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించకుంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూల ధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఈ ఇన్వెస్ట్‌మెం ట్స్‌పై వచ్చిన రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు.
నేను ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నాను. వచ్చే ఏడాది జూలైలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.17 లక్షల వరకూ, పెన్షన్ నెలకు రూ.15,999 చొప్పున వస్తాయి. నా కొడుకు విద్యావసరాల నిమిత్తం 2012లో మ్యాక్స్ లైఫ్ లైఫ్ గెయిన్ ప్లస్ స్కీమ్‌లో చేరాను. 25 ఐదేళ్ల కాలపరిమితి (2037) వరకూ ఉన్న ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం రూ.50,000. మొత్తం ఆరు వార్షిక ప్రీమియమ్‌లకు గాను ఇప్పటిదాకా నాలుగు ప్రీమియమ్‌లు చెల్లించాను. 2016 మార్చిలో ఒకటి, 2017 మార్చిలో మరొకటి చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ఇటీవల నేను వాకబు చేస్తే నా ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ ప్రస్తుతానికి రూ.75,000గా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు నేను ఏమి చేయాలి?
- రామకృష్ణ, హైదరాబాద్
మీరు తీసుకున్నది బీమా కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌లు తగిన బీమా కవర్‌ను ఇవ్వలేవు, అలాగే సరైన రాబడులు కూడా రావు. మ్యాక్స్ లైఫ్ లైఫ్ గెయిన్ ప్లస్ అనేది ఒక ఎండోమెంట్ ప్లాన్. పరిమిత కాలం పాటు ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ప్లాన్‌లు చార్జీల వివరాలను వెల్లడించవు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికల గురించి ఇన్వెస్టర్లకు పారదర్శకమైన వివరాలేవీ ఉండవు. ఈ పాలసీని మీరు కనుక ఇప్పుడు సరెండర్ చేస్తే మీకు భారీ నష్టాలు వస్తాయి.
మొత్తం చెల్లించిన ప్రీమియమ్‌ల్లో తొలి ప్రీమియమ్‌ను తీసివేయగా వచ్చే విలువలో 30% మాత్రమే సరెండర్ విలువగా మీకు లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడం వల్ల ఒక అధ్వాన ఇన్వెస్ట్‌మెంట్ నుంచి బైటపడగలుగుతారు. అయితే ఈ ప్లాన్‌ను సరెండర్ చేసేముందు, తగిన జీవిత బీమా కవర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒక వేళ లేని పక్షంలో టర్మ్ జీవిత బీమా కవర్‌ను తీసుకోండి. మీ బిడ్డ విద్యావసరాలు వంటి భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల కోసం బీమా కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి.