
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం నాకిదే మొదటిసారి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో నాకు సలహా ఇవ్వండి. నేను ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్‌ను సూచించండి.? – మణికంఠ, మంగళగిరి
ఎవరైనా 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఉత్తమమైన విధానం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. అయితే అద్భుతమైన రాబడులు ఆశించకూడదు. సమంజసమైన రాబడులను మాత్రమే కోరుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడితో పాటు, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు..మొదటగా మూడేళ్ల పాటు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
ఈ మూడేళ్లలో ఈ ఫండ్ మంచి పనితీరు కనబరచకపోయినా నిరాశపడవద్దు. ఈ మూడేళ్ల కాలంలో ఈ ఫండ్ మార్కెట్ ఆటుపోట్లకు తగ్గట్లుగా రాబడులనిస్తుంది. మార్కెట్ బాగా ఉంటే, 20–30 శాతం మేర రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించదగ్గ కొన్ని బ్యాలన్స్‌డ్ ఫండ్స్–హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్‌డ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలన్స్‌డ్95, టాటా బ్యాలన్స్‌డ్. వీటిల్లో నుంచి ఒకటి లేదు రెండు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి.
వాటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఇక సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేసేమొత్తాన్ని ఏడాది తర్వాత పెంచండి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని పెంచండి. ఇలా మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీరు ఎవరి సలహా అవసరం లేకుండానే మంచి ఫండ్స్‌ను ఎంచుకోగలుగుతారు.
నేను ఇప్పటికే కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మంచి రాబడులే వస్తున్నాయి. ఏదైనా ఓవర్సీస్ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మిత్రులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా ? తగిన సలహా ఇవ్వండి. – నవీన్, బెంగళూరు
డైవర్సిఫికేషన్ విషయంలో అంతర్జాతీయ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఒక ముఖ్యమైన అంశం. భారత స్టాక్ మార్కెట్ బాగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఇంటర్నేషనల్ ఫండ్స్‌ను పట్టించుకోరు. పైగా మన ఫండ్స్ కావు అన్న భావన కూడా ఇంటర్నేషనల్ ఫండ్స్‌పై ఒకింత అయిష్టత ఉంటుంది. అయితే డైవర్సిఫికేషన్ కోసమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
కాబట్టి. ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు మరింత పొందవచ్చు. ఇంటర్నేషనల్ ఫండ్స్ విషయానికొస్తే, ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్‌ఈక్విటీ ఫండ్, నాస్‌డాక్ 100 ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్‌ఈక్విటీ ఫండ్... తన నిధుల్లో 30 శాతం వరకూ అమెరికా కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తోంది.
గూగుల్ కంపెనీని నిర్వహించే ఆల్ఫాబెట్, ఇంకా కొన్ని మంచి ఇతర కంపెనీలు ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఇక నాస్‌డాక్ 100 ఫండ్‌లో దాదాపు 60 శాతం అమెరికా కంపెనీలే ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ ఫండ్స్‌ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోల్లో ఉండే షేర్లు...వాటివాటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల షేర్లు అయి ఉండాలి.
వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) విధానంలో నెలకు రూ.500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మరో 10–20 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు గాను అదనంగా మరో రెండు, మూడు సిప్‌లను ప్రారంభిద్దామనుకుంటున్నాను.ఇంత దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడానికి బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చా ? పన్ను ప్రయోజనాలు నాకు ప్రాధాన్యత కాదు. – రవి, హైదరాబాద్
దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు సాధారణంగా ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో ఫండ్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ, రాబడులు అంతంతమాత్రంగానే ఉంటాయి. అందుకని మంచి ఫండ్స్ కొన్నింటిని ఎంచుకొని, వాటిల్లోనే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలి. అయితే కనీసం ఏడాది లేదా రెండేళ్లకొకసారి అయినా సరే, మీ పోర్ట్‌ఫోలియోను తప్పనిసరిగా సమీక్షించాలి.
మార్కెట్‌తో సంబంధమున్న ఏ ఫండ్‌నన్నా ఇలా సమీక్షీంచడం తప్పనిసరి. మీరు 10–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అందుకని మీరు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేసే వాళ్లు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
మీలాగా కొంత అనుభవం ఉన్నవాళ్లు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను కాక వేరే ఫండ్స్ గురించి ఆలోచించాలి. మీరు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌నూ పరిశీలించవచ్చు.అయితే ఈ ఫండ్స్ కొంచెం ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలుంటాయి. మార్కెట్ పతనమవుతున్నప్పుడు కూడా సిప్‌లను కొనసాగించాలి. అందుకని మీరు రెండు లేదా మూడు మల్టీక్యాప్ ఫండ్స్‌లోనూ, ఒకటి లేదా రెండు స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లోనూ సిప్‌లు ప్రారంభించండి. మీ పోర్ట్‌ఫోలియోను కనీసం ఏడాది లేదా రెండేళ్లకొకసారైనా సమీక్షించడం మరచిపోకండి.
- ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment