స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో అన్నీ చిన్న షేర్లే ఉండవా? | Expert openion on Small cap funds | Sakshi
Sakshi News home page

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో అన్నీ చిన్న షేర్లే ఉండవా?

Published Mon, Aug 13 2018 1:56 AM | Last Updated on Mon, Aug 13 2018 1:56 AM

Expert openion on Small cap funds - Sakshi

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో వంద శాతం స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఉండవని, కొన్ని లిక్విడ్‌ షేర్లను కూడా ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేస్తారని విన్నాను. అది నిజమేనా ? ఎందుకలా చేస్తారు. ఫండ్‌ మేనేజర్లు తమ ఫండ్స్‌కు సంబంధించి లిక్విడిటీని ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మేనేజ్‌ చేస్తారు?    – శ్రీకాంత్, విజయవాడ  
లిక్విడిటీ నిర్వహణకు వివిధ రకాలైన పద్ధతులను ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనది లిక్విడ్‌(అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా ఉండే) స్టాక్స్‌పై ఆధారపడటం. ఉదాహరణకు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయనుకుందాం. ఈ ఫండ్‌ తన నిధుల్లో వంద శాతాన్నీ స్మాల్‌ క్యాప్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయదు. మొత్తం నిధుల్లో 65 శాతం వరకే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మిగిలిన నిధులను ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇలాంటి ఇతర సాధనాల్లో లిక్విడ్‌ స్టాక్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. ఫండ్స్‌కు ఉండే మరో వెసులుబాటు... 5–10% నిధులను నగదు రూపంలో ఉంచుకోవడం.

ఈ నగదును స్వల్పకాలిక రుణ, ఓవర్‌నైట్‌ కాల్‌–మనీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇక నగదు రూపంలో కూడా ఎంతో కొంత రాబడిని ఫండ్‌ మేనేజర్లు సాధిస్తారు. సాధారణంగా ఫండ్స్‌ లిక్విడిటీ మొత్తం ఆయా ఫండ్స్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌పైననే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఓపెన్‌–ఎండెడ్‌ ఫండ్స్‌ల్లో ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. కొద్ది మంది మాత్రమే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకునే పెట్టుబడుల కంటే కూడా ఇన్వెస్ట్‌ చేసే నిధులే అధికంగా ఉంటాయి.  ఇలా కాకుండా వచ్చే పెట్టుబడుల కంటే వెనక్కి తీసుకునే పెట్టుబడులే అధికంగా ఉంటే అప్పుడు ఫండ్‌ మేనేజర్లు ఆందోళన చెందుతారు. ఇలాంటి సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ అసలు ఉండవని చెప్పలేము.

ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు ఫండ్‌ మేనేజర్లు నగదును కానీ, స్వల్ప కాలిక రుణ సాధనాలపై కానీ, లిక్విడ్‌ స్టాక్స్‌పై కానీ ఆధారపడతారు. ఇలాంటి ఏర్పాటు లేకపోతే, ఫండ్‌ మేనేజర్లు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అయినకాడికి తెగనమ్మాల్సి వస్తుంది. మార్కెట్‌ రోజూ పతనమవుతున్నప్పుడు, ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై ఫండ్స్‌ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. అప్పుడు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అమ్మక తప్పదు. దీంతో మార్కెట్‌ మరింతగా పతనమవుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి లిక్విడ్‌ స్టాక్స్‌లోనూ, స్వల్పకాలిక రుణ సాధనాల్లోనూ ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌ చేస్తారు.  

ఏడాది క్రితం నేను ఒక క్లోజ్‌డ్‌–ఎండ్‌–మ్యూచువల్‌ ఫండ్‌లో రూ.3 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేశాను. అయితే నా సోదరి చదువు కోసం నాకు ఇప్పుడు అత్యవసరంగా కొంత సొమ్ములు అవసరమయ్యాయి. ఈ క్లోజ్‌డ్‌–ఎండ్‌ ఫండ్‌ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా వెనక్కి తీసుకోవాలి?     – విష్ణువర్థన్, విశాఖపట్టణం  
ఒక క్లోజ్‌డ్‌–ఎండ్‌ ఫండ్‌లో ఆ ఫండ్‌ మెచ్యూరిటీ పూర్తయ్యే వరకూ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వీలు లేదు. అయితే అవి స్టాక్‌ మార్కెట్లో లిస్టై, షేర్ల మాదిరి ట్రేడవుతాయి. కాబట్టి మీ ఫండ్‌ యూనిట్లను విక్రయించుకోవచ్చు. అయితే ఇలాంటి క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్‌ యూనిట్ల ట్రేడింగ్‌ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేసే కొనుగోలు దారులు దొరకడం కష్టసాధ్యమైన పనే.

ఒక వేళ కొనుగోలుదారులు ఉన్నా, ఫండ్‌ ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ) కన్నా తక్కువ ధరకే అవి ట్రేడవుతుంటాయి. అందుకని తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తుంది. అందుకని మీకు నష్టాలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకని క్లోజ్‌డ్‌–ఎండ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడమనే విషయాన్ని మరచిపోండి. ఇప్పుడు పలు బ్యాంక్‌లు తక్కువ వడ్డీరేట్లకే విద్యారుణాలు ఇస్తున్నాయి. వాటిని ప్రయత్నించండి.  

షేర్లను తక్కువ ధరలో కొని ఎక్కువ ధరకు అమ్మడం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ విధానమంటున్నారు. అసలు షేర్‌ కనిష్ట ధరకు చేరిందని, గరిష్ట స్థాయికి చేరిందనీ ఎలా అంచనా వేయవచ్చు?     – మాధురి, హైదరాబాద్‌
షేర్లను తక్కువ ధరలో కొని, అధిక ధరలకు అమ్మడం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ విధానమే. కానీ ఒక షేర్‌ కనిష్ట, అలాగే గరిష్ట ధరలను మీరే కాదు, కొమ్ములు తిరిగిన ఫండ్‌ మేనేజర్లూ అంచనా వేయలేరు. పడిపోతున్న షేర్‌ కనిష్ట ధరను అంచనా వేయడమంటే... పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ప్రయత్నించడం. అలా ప్రయత్నించినప్పుడు,  మీరు సురక్షితంగా ఆ కత్తిని క్యాచ్‌ చేయవచ్చు. లేదా కత్తిని పట్టుకునే ప్రయత్నంలో మీకు స్వల్ప గాయాలు కావచ్చు లేదా భారీ గాయాలే కావచ్చు. ఒక షేర్‌ కనిష్ట ధరను  అంచనా వేయడం కూడా ఇలాంటిదే. ఒక్కోసారి మీ అంచనా కరెక్ట్‌ కావచ్చు. లేదా మీ అంచనాలకు మించి మరింత పడిపోవచ్చు. చాలా సార్లు ఇది చాలా ఫండ్‌ మేనేజర్ల విషయంలో రుజువైంది.

అయితే పీఈ, పీబీ నిష్పత్తులను పరిగణనలోకి తీసుకొని అప్పటి షేర్‌ మార్కెట్‌ ధర ఆకర్షణీయంగా ఉంటే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు మించి మరింతగా పతనమైతే, ఆ షేర్‌పై మీకు నమ్మకం ఉంటే మరింతగా కొనుగోలు చేయవచ్చు. ఇక షేర్‌ గరిష్ట ధరలనూ అంచనా వేయడం కష్టమే. ఉదాహరణకు ఒక షేర్‌ను రూ.100కు కొనుగోలు చేశారనుకుందాం. అది రూ.150, రూ.200, రూ.250 ఇలా పెరుగుతూ పోయిందనుకుందాం. ఎంత వరకూ పోతుందో మనం అంచనా వేయలేం. కానీ చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు రూ.వందకు కొనుగోలు చేసిన షేర్‌ రూ.150కు చేరగానే అమ్మేస్తారు. అది మరింతగా పెరుగుతూ ఉన్నప్పుడు తక్కువ ధరకు అమ్మేశామే అని బాధపడుతూ ఉంటారు.


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement