గృహ రుణం మంచిదే... | Household debt is a good one ... | Sakshi
Sakshi News home page

గృహ రుణం మంచిదే...

Published Mon, Jan 4 2016 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

గృహ రుణం మంచిదే...

గృహ రుణం మంచిదే...

నా వయస్సు 30 సంవత్సరాలు. ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. నా జీతం రూ.70,000. ఏడాదికి 5 శాతం చొప్పున వేతన పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నాను. ఇటీవలనే .28 లక్షలకు  గృహ రుణం తీసుకున్నాను. నెలకు రూ.29,000 చొప్పున ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఈ గృహ రుణ కాలపరిమితి 30 సంవత్సరాలు. నాకు 60 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి ఈ రుణం తీరుతుంది.  నా భార్య గృహిణి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు, మా నాన్నగారు నా దగ్గరే ఉంటారు. వీరంతా నాపై ఆధారపడి ఉన్నవాళ్లు. పన్ను ఆదా  చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మదుపు చేయాలనుకుంటున్నాను.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే 14 శాతం, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 8.5 శాతం చొప్పున రాబడులు వస్తాయని మిత్రులు చెబుతున్నారు. గృహ రుణం ముందుగానే తీర్చివేసి, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలా? గృహ రుణం చెల్లిస్తూనే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? పీపీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సూచనలివ్వండి?
 - జీవన్ కుమార్, విశాఖపట్టణం

 
గృహ రుణానికి సంబంధించి నెలవారీ సమాన వాయిదాలు(ఈఎంఐ)లు చెల్లించడంలో మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే, ఈ గృహ రుణం అసలులో  కొంత మొత్తాన్ని తీర్చేయండి. మీరు సౌకర్యవంతంగా ఈఎంఐ చెల్లించగలిగిన స్థాయిలో గృహ రుణం అసలులో కొంత మొత్తాన్ని తీర్చేయండి. ఒకవేళ గృహరుణ ఈఎంఐలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే, ముందస్తు చెల్లింపులు విషయం మరచిపోండి. పన్ను ఆదా చేసే లేదా ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో మదుపు చేయడం ప్రారంభించండి. గృహ రుణం మంచి రుణం అని చెప్పవచ్చు.

ఈ రుణం వల్ల ఒక ఆస్తి మన సొంతమవుతుంది. అంతేకాకుండా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పర్సనల్ లోన్ తదితర ఇతర అన్‌సెక్యూర్డ్ రుణాలతో పోల్చితే వడ్డీరేట్లు తక్కువగానే ఉంటాయి. అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చే క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ మంచి రుణాలు కావు. ఒకవేళ ఇలాంటివి ఉంటే, అన్నింటికంటే ముందుగానే ఈ రుణాలను తీర్చేయాలి.  

వీటిమీద 20-30 శాతం వరకూ వడ్డీ కడుతూ, 7-15 శాతం వడ్డీ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం సరైనది కాదు. మీ గృహ రుణం మొత్తం తీరిన తర్వాత ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన విధానం కాదు. చిన్న మొత్తాలతోనైనా, చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల చక్రవడ్డీ కారణంగా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా, త్వరగా సాధించగలుగుతారు. పన్ను ఆదా మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ను పరిశీలించవచ్చు.  

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఇవే. ఈఎల్‌ఎస్‌ఎస్  లేదా ఇతర ఈక్విటీ సాధనాల్లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసేలా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
 
నేను రూ.8 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలను. ఒక సంవత్సరం  తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున నాకు డబ్బులు అవసరమవుతాయి. వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. తగిన సూచనలివ్వండి.
 - సమున్నత, విశాఖపట్టణం


మీరు వాస్తవదూరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏడాదికి 25 శాతం రాబడి వస్తేనే మీకు సంవత్సరం  తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున పొందగలరు. ఈ తరహా రాబడులను ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థా ఆఫర్ చేయడం లేదు.
 
నా వయస్సు 63 సంవత్సరాలు. గతంలో బ్యాంకులో వేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి రూ.6 లక్షలు ఇటీవలనే నా చేతికొచ్చాయి. వీటిని బ్యాంకులో మళ్లీ రీఇన్వెస్ట్ చేయాలనుకోవడం లేదు. వీటిపై వచ్చే రాబడులు పన్నులు పోను చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ రూ.6 లక్షలను మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. కొంత రిస్క్ భరించగలను. ఏడాదికి 9 నుంచి 10 శాతం రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. ఇప్పటికే కొన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను.                      
- హఫీజ్, హైదరాబాద్

 
ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను రికమెండ్ చేయలేము. పన్నులు పోను తగిన రాబడులు రావాలంటే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను అంశాల పరంగా వీటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. అందుకని ఏడాది దాటిన తర్వాత వీటిని విక్రయిస్తే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల కాలానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్ కోసం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను, మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్(ఎంఐపీ)లను పరిశీలించవచ్చు.
 
గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకున్న డీమ్యాట్ అకౌంట్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
 - నర్మద, గుంటూరు


మీ ట్రేడింగ్ అకౌంట్ మీ డీమ్యాట్ అకౌంట్‌లో అనుసంధానమై ఉంటే, మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు. అయితే పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతాం. ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోల్చితే బంగారం భిన్నమైనది. బాండ్లలలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్‌లు, బోనస్‌లు, ధర పెరగడం.. ఇలాంటి ప్రయోజనాలుంటాయి. కానీ బంగారం విలువ మాత్రం డిమాండ్, సరఫరా అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2008లో  అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులున్నప్పటినుంచి పుత్తడి పెట్టుబడులు మంచి రాబడులనిచ్చాయి. గత ఐదేళ్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లు చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను ఇవ్వలేదు. గత ఐదేళ్లలో ఇవి 3 శాతం కంటే తక్కువ రాబడులనే ఇచ్చాయి. ఏడాది నుంచి -మూడేళ్ల కాలానికి కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు నష్టాలను కూడా ఇచ్చాయి.  ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై పునరాలోచన చేయండి.

- ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement