జీవన్ ఆనంద్‌కు సరెండర్ వాల్యూ ఎంత ? | Tata AMC aims to break into big league | Sakshi
Sakshi News home page

జీవన్ ఆనంద్‌కు సరెండర్ వాల్యూ ఎంత ?

Published Mon, Dec 7 2015 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

జీవన్ ఆనంద్‌కు సరెండర్ వాల్యూ ఎంత ?

జీవన్ ఆనంద్‌కు సరెండర్ వాల్యూ ఎంత ?

టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్‌కు సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ) ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలపండి.
 - రసూల్ బీ, హైదరాబాద్

 
టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్‌కు సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 4 నుంచి ప్రారంభమైంది. 18వరకూ గడువు ఉంది. సాధారణంగా ఎన్‌ఎఫ్‌ఓలకు దూరంగా ఉండమని మేము ఇన్వెస్టర్లకు సూచిస్తూ ఉంటాము. ఎన్‌ఎఫ్‌ఓల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడమే సముచితంగా ఉంటుంది.

టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్.. పేరుకు తగ్గట్లుగా ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పూర్తిగా ఒకే రంగానికి పరిమితమైన సెక్టోరియల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇలాంటి రంగాల వారీ ఫండ్స్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనేది కీలకమైన విషయం. ఒక సాధారణ ఇన్వెస్టర్‌కి ఇలాంటి సెక్టోరియల్ ఫండ్స్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు వైదొలగాలో నిర్ణయించుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. మరోవైపు  ఒక్కో కాలంలో ఒక్కో రంగం పనితీరు బాగా ఉంటుంది.కొంత కాలానికి మరో రంగం జోరు పెరగవచ్చు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఎన్‌ఎఫ్‌ఓలో, అదీన్నూ ఒకే రంగానికి పరిమితమైన సెక్టోరియల్ ఫండ్స్‌కు దూరంగా ఉండడమే మంచిది.
 
నేను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు దాటాయి. ఇప్పుడు వీటిని రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 - ఆనంద్, విజయవాడ

 
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఈఎల్‌ఎస్‌ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించుకోవచ్చు. ఇలా పొందిన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు.
 
మూడేళ్ల క్రితం జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు. సమ్ అష్యూర్డ్ రూ. 3 లక్షలు.  ప్రీమియం ఏడాదికి రూ.23,451 చొప్పున  మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాను. ఇది ఇన్వెస్ట్‌మెంట్‌కు, అలాగే బీమాకు సరైన పాలసీ కాదని మిత్రులంటున్నారు. సరెండర్ చేయమంటారా? సరెండర్ వాల్యూ ఎంత వస్తుంది?
  - జాన్, గుంటూరు

 
ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ అనేది బీమా, పెట్టుబడులు కలగలిపిన ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో  వ్యయాలు ఎక్కువగా, రాబడులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక రాబడులను పరిగణనలోకి తీసుకున్నా, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను ఈ తరహా పాలసీలు  ఇవ్వలేవు. ఇక మీరు చాలా తక్కువ లైఫ్ కవర్ తీసుకున్నారు. మీకు ఏమైనా అయితే మీ కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే స్థాయిలో ఈ లైఫ్ కవర్ లేదు.

మీరు ఇప్పుడు మీ పాలసీని సరెండర్ చేస్తే, మీరు కట్టిన అన్ని ప్రీమియమ్‌ల్లో నుంచి మొదటి ప్రీమియమ్‌ను మినహాయించి, దాంట్లో 30 శాతాన్ని గ్యారంటీడ్ సరెండర్ వాల్యూగా కంపెనీ చెల్లిస్తుంది. మీ విషయంలో ఇది రూ.14,070గా ఉంటుంది. అయితే కంపెనీ ప్రత్యేకమైన సరెండర్ వేల్యూని ఇవ్వవచ్చు. ఇలాంటి స్కీమ్‌లు ఇన్వెస్ట్‌మెంట్‌కు సరైనవి కావు. ఈ పాలసీని సరెండర్ చేసి, జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. బీమా, పెట్టుబడులు కలగలిపిన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి.
 
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసినప్పుడు, అవి మెచ్యూర్ అయి చేతికందినప్పుడు గానీ ఏమైనా పన్నులు చెల్లించాల్సివుంటుందా?
 - ఈశ్వరి, తిరుపతి

 
సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్ అనేది ఆడపిల్లల కోసం ఉద్దేశించిన చిన్న మొత్తాల డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన సొమ్ములపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుత ఏడాది దీనిపై వడ్డీ రేటు 9.2 శాతం. వడ్డీరేటును ఎంతనేది ప్రతీ ఏడాది ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement