ఈక్విటీ ఫండ్‌లే ఎందుకు...? | Equity funds hold ... Why? | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్‌లే ఎందుకు...?

Published Mon, Mar 28 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

ఈక్విటీ ఫండ్‌లే ఎందుకు...?

ఈక్విటీ ఫండ్‌లే ఎందుకు...?

నేను  గతంలో ప్రారంభించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్) ఖాతా గడువు తీరింది.  దీనిని పొడిగించుకోవచ్చా?  ఈ ఖాతా గడువు తీరినందును తాజాగా మరో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవవచ్చా?- ప్రవీణ్, విజయవాడ


సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)  ఖాతా కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ ఖాతాను మూసేయవచ్చు. లేదా మరో మూడేళ్ల పాటు కొనసాగించవచ్చు. పాస్‌బుక్‌ను, దరఖాస్తు ఈ ను సమర్పించి ఈ ఖాతా నుంచి సొమ్ములన్నింటినీ తీసేసుకొని ఈ ఖాతాను మూసేయవచ్చు. ఈ ఖాతా గడువు పూర్తయిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు బి ను సమర్పించి ఈ ఖాతాను మరో మూడేళ్లపాటు కొనసాగించుకోవచ్చు. ఈ పొడిగింపు మీరు దరఖాస్తు చేసినప్పటి నుంచి కాకుండా, మీ ఖాతా గడువు పూర్తయిన తేదీ నుంచి వర్తిస్తుంది. ఈ ఖాతా గడువు పూర్తయిన తర్వాత ఖాతాను మూసేయకపోయినా, పొడిగింపు కోసం దరఖాస్తు చేయకపోయినా, ఈ ఖాతాను మూసేసినట్లుగానే పరిగణిస్తారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై ఎంత అయితే వడ్డీ వస్తుందో అంతే వడ్డీ గడువు  తీరిన ఖాతాకు వస్తుంది. మీరు ప్రారంభించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాకు ఎనిమిదేళ్లు పూర్తయిన తర్వాత మరో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రారంభించవచ్చు


నా వయస్సు 31 సంవత్సరాలు. నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయమని తెగ చెబుతుంటారు కదా ! పైగా ఈ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. ఒక ఏడాదికి మించిన కాలానికి వేరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి, మరో వైపు సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. కదా ! మరలాంటప్పుడు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? -  హిమబిందు, హైదరాబాద్


మరే ఇతర మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా  ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందలేరు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో  ఇన్వెస్ట్ చేస్తేనే మీరు సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పన్ను ఆదా అయ్యే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. సెక్షన్ 80 సీ కింద తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్ ఒకటి. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని తరచూ సలహాలిస్తుంటాము.

నా వయస్సు 52 సంవత్సరాలు. ఒక  ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. గత ఎనిమిదేళ్లుగా పలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎఫ్‌టీ బిల్డ్ ఇండియా, ఎఫ్‌టీ ప్రైమా, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ, యూటీఐ ఆపర్చునిటీస్, రిలయన్స్ విజన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం విలువ ఇప్పుడు రూ.16 లక్షలకు పెరిగింది. నాకు ఎలాంటి పెన్షన్ రాదు. నేను మరో ఎనిమిదేళ్లలో రిటైరవుతున్నాను. నేను రిటైరైన తర్వాత నాకు నెలకు రూ.40,000 పెన్షన్ అవసరం. ఈ మొత్తం పొందడానికి నేను ఏ పెన్షన్ ఫండ్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఎన్‌పీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ పర్సనల్ పెన్షన్ ఫండ్.. వీటిని షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సాయి సుధీర్, విశాఖపట్టణం

 

మీరు రిటైరైన తర్వాత 20 ఏళ్ల కాలానికి నెలకు 40వేల చొప్పున పెన్షన్ కావాలంటే మీకు రూ.96 లక్షల కార్పస్ అవసరం. మనుష్యుల సగటు జీవిత కాలం 80 ఏళ్లు, దవ్యోల్బణం 8 శాతంగా తీసుకొని ఈ లెక్కలు వేశాము. నెలకు రూ.25,500 చొప్పున ఎనిమిదేళ్లపాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రస్తుతం మీ దగ్గరున్న రూ.16 లక్షల మొత్తంపై 12 శాతం రాబడి వస్తుందని లెక్కిస్తే మీరు ఆశించినట్లుగా నెలకు రూ.40,000 చొప్పున పెన్షన్ పొందగలరు. మీ రిటైర్మెంట్ నిధి కోసం మీకు టైలర్ మేడ్ పెన్షన్ ప్లాన్ ఏదీ అవసరం లేదని భావిస్తున్నాం. పన్ను మినహాయింపులు కావాలని కోరుకుంటే తప్ప. ఏదైనా రెండు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన నియంత్రణ ఉంటుంది. సాధారణంగా జీవిత బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈ ప్లాన్‌లు బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలిపి ఉంటాయి. ఇవి ఖరీదైనవే కాకుండా, తగిన బీమాను, రాబడులను అందించలేవు. కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ  రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో మూడు విభిన్నమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లున్నాయి. అయితే దీర్ఘకాలిక పనితీరు చరిత్ర లేని ఫండ్స్‌లో  ఇన్వెస్ట్ చేయడం అంత తెలివైన పనికాదు. పన్ను రాయితీలు ఇచ్చే ప్రభుత్వ పెన్షన్ పథకం కావాలనుకుంటే, నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)ను పరిశీలించవచ్చు. అయితే ఎన్‌పీఎస్‌కు రెండు పరిమితులున్నాయి. ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఈక్విటీ కేటాయింపులు 50 శాతం కంటే మించకూడదు. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వంద శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ మంచి రాబడులస్తాయి. రెండోది.., రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్ కార్పస్‌లో మీరు 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ 40 శాతంపైననే మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి.

 

 ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement