12–15% రాబడినిచ్చే ఫండ్స్‌ ఉన్నాయా? | Are 12-15% Revenue Funds? | Sakshi
Sakshi News home page

12–15% రాబడినిచ్చే ఫండ్స్‌ ఉన్నాయా?

Published Mon, Oct 23 2017 2:16 AM | Last Updated on Mon, Oct 23 2017 2:16 AM

Are 12-15% Revenue Funds?

నేను ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.8,000 వరకూ ఇన్వెస్ట్‌ చేయగలను. నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కచ్చితంగా ఏడాదికి 12–15 శాతం మేరకు రాబడిని ఇచ్చే ఫండ్స్‌ పథకాలు ఏమైనా ఉన్నాయా ? ఉంటే అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అలాంటి ఫండ్స్‌ను కొన్ని సూచించండి.    –మధుసూధన్, విజయవాడ  

దీర్ఘకాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి రాబడులనే ఇస్తాయి. 3, 5 లేదా పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే చాలా ఫండ్స్‌ మీరు చెప్పిన 12–15 శాతం రాబడులను ఇచ్చాయి. కొన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే అంతకంటే ఎక్కువగా రాబడులనిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే కొన్ని డెట్‌–ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్స్‌ కూడా 12 శాతం వరకూ రాబడులనిచ్చాయి. అయితే భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి రాబడులు వస్తాయని కచ్చితంగా చెప్పలేము.

ఏడాదికి కచ్చితంగా 12–15 శాతం రాబడులనిచ్చే ఫండ్స్‌ ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పలేము. ఈక్విటీ ఫండ్స్‌ రాబడులు అసాధారణంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ ఫండ్స్‌ 30–35 శాతం రేంజ్‌లో, మరోసారి 9 శాతంలోపే, ఇంకోసారి ప్రతికూల రాబడులను కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని రాబడులు ఇంత స్థాయిలోనే కచ్చితంగా ఉంటాయని చెప్పలేము. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులు పొందే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

ఇక మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఎస్‌బీఐ స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్, మిరా అసెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్, ఎల్‌ అండ్‌ టీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్, కోటక్‌  50, డీఎస్‌పీ బ్లాక్‌ రాక్‌ ఆపర్చునిటీస్, కెనరా రెబొకొ ఎమర్జింగ్‌ఈక్విటీ ఫండ్, బీఎన్‌పీ పారిబా డివిడెండ్‌ ఈల్డ్, యాక్సిస్‌ ఈక్విటీ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌.

నేను గత కొంత కాలంగా క్వాంటమ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్, కోటక్‌ అసెట్‌ అలొకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ తరహా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌(ఎఫ్‌ఓఎఫ్‌)కు సంబంధించి పన్ను విధానాలు ఎలా ఉంటాయి ?     –రమాదేవి, విశాఖపట్టణం  

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు వర్తించే పన్ను నియమాలే ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి. ఈ తరహా ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మూడు, అంతకు మించిన సంవత్సరాలకు కొనసాగితే.. వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

ఈ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు మూడేళ్లలోపే వెనక్కి తీసుకుంటే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి, మీకు వర్తించే అదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

గిల్ట్‌ ఫండ్స్‌ విలువ ఏఏ సందర్భాల్లో తగ్గుతుంది ?   –పర్వేజ్, హైదరాబాద్‌

గిల్ట్‌ ఫండ్స్‌.. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెడతాయి. ఏ రకమైన బాండ్లకైనా రెండు రకాల రిస్క్‌లు ఉంటాయి. మొదటిది. వడ్డీ రేట్లు పెరగడం, లేదా తగ్గడం, రెండోది. సకాలంలో వడ్డీని కాని, అసలును కాని చెల్లించడంలో విఫలం కావడం. అయితే ప్రభుత్వ బాండ్లకు రెండో రిస్క్‌ ఉండదు. ప్రభుత్వం బాండ్ల విషయంలో డీఫాల్ట్‌ అయ్యే అవకాశాలు దాదాపు లేవు. ఇక వడ్డీరేట్లు పెరిగితే, ఇతర ఫండ్స్‌ కన్నా గిల్ట్‌ ఫండ్స్‌ మరింతగా పడతాయి. దీర్ఘకాలం మెచ్యురిటీ ఉన్న బాండ్లలో గిల్ట్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. కాబట్టి వడ్డీరేట్ల ఒడిదుడుకులకు ఇవి బాగా ప్రభావితమవుతాయి.  

నేను రిలయన్స్‌ ట్రెజరీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఏటీఎమ్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తూ, స్వల్ప వ్యవధుల్లోనే వాటిని రిడీమ్‌ చేసుకుంటూ వస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకు లాభాలు వస్తున్నాయి. అయితే లాభాలపై పన్నులు ఎలా ఉంటాయి. ఫ్లాట్‌గా ఒకే రేటున పన్నులు చెల్లించాలా ? ప్రస్తుతం నేను ట్యాక్స్‌ బ్రాకెట్‌లో లేను.   –ప్రభాకర్, బెంగళూరు  

రిలయన్స్‌ ట్రెజరీ ఫండ్‌లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలు మీ ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాలి. ఉదాహరణకు మీరు రూ.100 ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మీ ఇన్వెస్ట్‌మెంట్‌  విలువ రూ.125 అయిందనుకోండి. మీకు రూ.25 లాభం వచ్చినట్లు లెక్క. ఇలా వచ్చిన లాభాలన్నింటిపై కూడా మీరు పన్నులు చెల్లించాలి.

మీరు ఇన్వెస్ట్‌చేసిన కాలం నుంచి చూస్తే, మూడేళ్లలోపే మీరు మీ మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించారనుకోండి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్ను చెల్లించాలి. అయితే ఈ లాభాలన్నింటీని, మీ మొత్తం ఆదాయంతో కలిపినా గానీ, మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోతే, ఈ లాభాలన్నింటిపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ఆదాయానికి, ఈ లాభాలను కలిపితే మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తేనే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.   


– ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement