మూడు టర్మ్ ప్లాన్‌లు అవసరమేనా? | Necessary for the three-term plans | Sakshi
Sakshi News home page

మూడు టర్మ్ ప్లాన్‌లు అవసరమేనా?

Published Mon, Sep 21 2015 3:58 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

మూడు టర్మ్ ప్లాన్‌లు అవసరమేనా? - Sakshi

మూడు టర్మ్ ప్లాన్‌లు అవసరమేనా?

నేనొక సీనియర్ సిటిజన్‌ను. ఒక జాతీయ బ్యాంక్‌లో వేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి చేతికొచ్చాయి. వీటిని కనీసం మూడేళ్ల పాటు ఏదైనా డెట్‌ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు  ప్రతి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా ఆదాయం అవసరం. డివిడెండ్ పేమెంట్ ఆప్షన్, లేదా గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి.
- సదాశివరావు, విశాఖపట్టణం

 
ఆదాయపు పన్నుకు సంబంధించి మీరు 10 శాతం లేదా 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే, గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా ఇన్వెస్ట్ చేసి ప్రతీ మూడు నెలలకొకసారి నిర్ణీత మొత్తాన్ని రిడీమ్ చేసుకోవాలి.  డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లపై 28.84 శాతం చొప్పున డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.  అలా కాకుండా గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలలకొకసారి కొంత మొత్తాన్ని రిడీమ్ చేసుకుంటారు. కాబట్టి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూలధన లాభాలపై పన్ను మీరు 10 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే 10.3 శాతం, 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే 20.6 శాతం చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అందుకని పన్నులను పరిగణనలోకి తీసుకుంటే, మీరు గ్రోత్ ఆప్షన్‌లోనే ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒక వేళ మీరు 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటే డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీకు 28.84 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మూలధన లాభాల పన్ను 30.9 శాతంగా చెల్లించాల్సి వస్తుంది.
 
ఒకే రంగంపై దృష్టిసారించే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఫార్మా, లేదా ఎఫ్‌ఎంసీజీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలిస్తున్నాను. ఎస్‌బీఐ ఫార్మా, ఐసీఐసీఐ ఎఫ్‌ఎంసీజీ ఫండ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? మీ అభిప్రాయం ఏమిటి?
- నర్మద, వరంగల్

 
రంగాల వారీ ఫండ్స్ వివిధ మార్కెట్ పరిస్థితుల్లో వివిధ రకాలైన పనితీరును కనబరుస్తాయి. సంబంధిత రంగంపై అవగాహన అధికంగా  ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రంగాల వారీ( సెక్టోరియల్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఫార్మా కేటగిరీ ఫండ్ 24 శాతం చొప్పున, ఎఫ్‌ఎంసీజీ కేటగిరీ ఫండ్ 9 శాతం చొప్పున రాబడులనిచ్చాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎస్‌బీఐ ఫార్మా ఫండ్ అత్యధిక రాబడులనిచ్చింది. ఇదే కాలానికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఫ్‌ఎంసీజీ ఫండ్ ఎస్‌బీఐ ఫార్మా ఫండ్ కంటే తక్కువ రాబడులనే ఇచ్చింది.
 
నా వయస్సు 34 సంవత్సరాలు. సింగిల్ పర్సన్‌ను. ఇప్పటికే రెండు టర్మ్ ప్లాన్‌లు తీసుకున్నాను. 2007లో తీసుకున్న టర్మ్ ప్లాన్ 52 ఏళ్లవరకూ, 2011లో తీసుకున్న మరొక టర్మ్ ప్లాన్ 70 ఏళ్ల వరకూ కవర్ చేస్తాయి. మరో టర్మ్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. మూడు టర్మ్ ప్లాన్‌లు తీసుకోవడం సరైనదేనా? 2007లో తీసుకున్న టర్మ్ ప్లాన్‌కు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. దీని బీమా కవరేజ్ కూడా తక్కువగా ఉంది. అదీ 52 సంవత్సరాల వరకే, అందుకే దీనిని సరెండర్ చేసి, పెద్ద మొత్తానికి మరో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మంచి నిర్ణయమేనా?         
- హరిరాజ్, హైదరాబాద్

 
డైవర్సిఫికేషన్ ఉద్దేశం ప్రకారమైతే రెండు టర్మ్ ప్లాన్‌లు సరిపోతాయి. మూడో టర్మ్ ప్లాన్ అవసరం లేదు. ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్న 2007 నాటి టర్మ్ ప్లాన్‌ను సరెండర్ చేసి, అధిక కవరేజ్ ఉండే మరో టర్మ్ ప్లాన్ తీసుకోవడం సరైన నిర్ణయమే. తక్కువ ప్రీమియానికే ఎక్కువ బీమా ఇచ్చే సంస్థల టర్మ్ ప్లాన్‌లు తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఉన్న సంస్థ టర్మ్ ప్లాన్‌లనే ఎంచుకోండి. మీ జీవిత బీమా పాలసీ మీరు రిటైరయ్యేంత వరకూ లేదా మీ ఆర్థిక బాధ్యతలు మరొకరు చేపట్టేంత వరకూ ఉండాలి. మీపై ఆధారపడిన వాళ్ల ఆర్థిక అవసరాలను తీర్చేలా మీ బీమా కవర్ ఉండాలి. ఇన్‌క్రీజింగ్ టర్మ్ కవర్ సదుపాయం ఉన్న టర్మ్ ప్లాన్‌లను కూడా పరిశీలించవచ్చు. ఈ తరహా ప్లానుల్లో నిర్దేశిత కాలాల్లో బీమా కవర్ కొంత శాతం చొప్పున పెరిగే సౌలభ్యం ఉంటుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి.
 
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement