
నా ఇద్దరి పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం గత కొంత కాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. నేను లక్ష్యంగా నిర్దేశించుకున్న మొత్తానికి..ఈ ఇన్వెస్ట్‌మెంట్స్, వీటిపై రాబడులు చేరాయి. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసేసుకోమంటారా ? –జగన్, హైదరాబాద్
ఒక ఆర్థిక లక్ష్యం కోసం చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఆ లక్ష్యాన్ని చేరితే, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసేసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం మీరు కొంత కాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉన్నారు. నిర్దేశిత కాలంలో కొంత రాబడితో ఆశించిన మొత్తాన్ని ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ సాధించాయి. దీంతో మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యం నెరవేరింది. ఇలాంటప్పుడు చివరి నిమిషం దాకా వేచి చూడాల్సిన పనిలేదు.
మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు, మీకు ఈ డబ్బులు మరో మూడేళ్ల దాకా అవసరం లేదు అనుకుంటే ఈ మొత్తంలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మించిన సంతృప్తి కంటే ఎక్కువ ఏదీ కాదు. మీ పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మీరు మీ కష్టార్జితంలోంచి పొదుపు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక లక్ష్యం సాధన మీకు ఎంతగానో తృప్తినిచ్చి ఉంటుంది. అందుకని నిరభ్యంతరంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. కానీ ఈ డబ్బులను మీ పిల్లల ఉన్నత విద్యావసరాల కోసమే వినియోగించండి. ఇతరత్రా చిల్లర, మల్లర ఖర్చులకు వాడేసి తర్వాత సర్దుబాటు చేద్దాంలే అనుకోకండి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని చెప్తున్నారు కదా! ఫండ్స్‌లో కాకుండా నేరుగా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేయవచ్చు కదా? –లత, విశాఖపట్టణం
నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లందరి దగ్గర నుంచి పొదుపుల రూపంలో డబ్బులను సమీకరించి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి. ఏ షేర్‌లో ఇన్వెస్ట్ చేయాలి లేదా ఏ బాండ్‌ను ఎంచుకోవాలి అనే నిర్ణయాన్ని మన బదులు ఫండ్ మేనేజర్లు ఆలోచిస్తారు. ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం కొంచెం కష్టసాధ్యమైన పనే.
మనం ఏ కంపెనీ షేర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నాం? ఆ రంగం స్థితిగతులు ఎలా ఉన్నాయి? కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ? కంపెనీ ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది ? కంపెనీకి ఎదురువుతున్న సవాళ్లేంటి ? తదితర చాలా విషయాలను కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇలాంటి విషయాలన్నింటినీ ఆమూలాగ్రం పరిశీలించడానికి, పరిశోధించడానిక ఒక పూర్తి స్థాయి రీసెర్చ్ టీమే ఉంటుంది. అంతే కాకుండా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తులు ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయమై మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తులనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫండ్ మేనేజర్లుగా తీసుకుంటాయి.
నేరుగా ఈక్విటీల్లో కంటే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఇన్వెస్టర్ల పరంగా చూస్తే మంచి నిర్ణయం. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సులభం, నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి తక్కువ సమయం, తక్కువ ప్రయత్నాలు సరిపోతాయి. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి తక్కువ అనుభవమున్నా, లేదా అసలు అనుభవం లేకున్నా అవగాహన లేకపోయినా సరే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులు పొందవచ్చు. ఇక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి అత్యంత కీలకమైన అంశం డైవర్సిఫికేషన్. ఇది ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. మీరు నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కొన్ని కంపెనీలకే పరిమితమవుతాయి.
అదే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుంటే ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో విభిన్న రంగాలకు చెందిన కంపెనీలుండే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. చాలా మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే.. తమకు మంచి అవగాహన ఉందంటూ ఏవో కొన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. తమ నైపుణ్యాలను అధికంగా అంచనా వేసుకొని బోల్తా పడుతుంటారు. పలితంగా ఖరీదైన మూల్యం చెల్లిస్తుంటారు. ఇలా జరగకుండా ఉండాలనుకుంటే ఈక్విటీల్లో నేరుగా కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం.
నాకు ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరి వయసులు 25, 23 సంవత్సరాలు. వీరిద్దరి పేరు మీద జీవన్ సరళ్, మనీ బ్యాక్ పాలసీల కింద ఏడాదికి రూ.25,000 ప్రీమియమ్ చెల్లిస్తున్నాను. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద నా ఇద్దరు కొడుకుల పాలసీలకు చెల్లిస్తున్న ప్రీమియమ్‌కు నేను పన్ను మినహాయింపు పొందవచ్చా? –అనంత్, విజయవాడ
మీ ఇద్దరు కొడుకులకు మీరు చెల్లిస్తున్న పాలసీల ప్రీమియమ్‌లకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఏ వ్యక్తి అయినా, తనకు, తన భార్యకు, తన సంతానానికి చెల్లిస్తున్న పాలసీల ప్రీమియమ్‌లకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు.
- ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment