మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ మంచివేనా? | Is Multi Cap Funds Good? | Sakshi
Sakshi News home page

మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ మంచివేనా?

Published Mon, Aug 27 2018 1:57 AM | Last Updated on Mon, Aug 27 2018 1:57 AM

Is Multi Cap Funds Good? - Sakshi

మల్టీక్యాప్‌ ఫండ్స్‌ మంచివేనా? కాంట్రా, వేల్యూ ఫండ్స్‌తో పోల్చితే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఏ విధంగా భిన్నమైనవి. ఈ మూడు రకాల ఫండ్స్‌లో దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తే తగిన రాబడులు పొందవచ్చు?  – సుమ, హైదరాబాద్‌  
మల్టీక్యాప్, కాంట్రా, వేల్యూ– ఈ మూడు రకాల ఫండ్స్‌ మంచివే. ఈ ఫండ్స్‌లో కనీసం 5–6 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ ఫండ్స్‌ అన్నీ ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. కానీ, ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాల విషయంలో తేడాలు ఉంటాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ అన్నీ వృద్ధి చెందగల సత్తా ఉన్న  కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ షేర్లు తక్కువ ధరల్లో కాకుండా అధిక ధరల్లో ఉన్నా కూడా ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇక వేల్యూ ఫండ్స్‌.. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేని, తక్కువ ధరల్లో ట్రేడవుతున్న కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సాధారణంగా ఈ కంపెనీల షేర్ల ధరలు చాలా చౌకగా ఉంటాయనే చెప్పవచ్చు. 

ఇక కాంట్రా ఫండ్‌ల విషయానికొస్తే, ఇప్పుడు పరిస్థితులు బాగా లేని కంపెనీలు, భవిష్యత్తులో టర్న్‌ అరౌండ్‌ కాగల కంపెనీల షేర్లలో  పెట్టుబడులు పెడతాయి. ఈ మూడు రకాల ఫండ్‌ మేనేజర్లు విభిన్నమైన ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలను అనుసరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సగటు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడు రకాల ఫండ్స్‌ ఉంటేనే మంచిది. పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌లో ఈ మూడు రకాల ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం  కూడా ఒక మార్గం. మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయదగ్గ డబ్బులు ఉంటే రెండు మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ను, ఒక వేల్యూ ఫండ్‌ను, మరో కాంట్రా ఫండ్‌ను ఎంచుకోండి.

నా కూతురును ఎమ్‌బీబీఎస్‌ చదివించడం కోసం  కొంతకాలంగా కొంత మొత్తాన్ని సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్నాను. మరో రెండేళ్లకు ఈ డబ్బులు నాకు అవసరమవుతాయి.  అప్పటివరకూ ఈ మొత్తాన్ని నేను ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌లోనే కొనసాగించమంటారా ? లేక లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి మళ్లించమంటారా ? – వీరేందర్, విజయవాడ  
ఈ రెండు మార్గాలు సరైనవి కావు. మీ పాపను ఎమ్‌బీబీఎస్‌ చదివించడం కోసం మీకు తప్పనిసరిగా రెండేళ్లలో డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ నుంచి దశలవారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోండి. కనీసం 18 నెలలు లేదా 24 నెలల వాయిదాల రూపంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లోకి బదిలీ చేయండి. మీరు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)ను అనుసరించినట్లుగానే,  విత్‌డ్రా చేసేటప్పుడు సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ని అనుసరించాలి. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లోకి మార్చిన తర్వాత దాని విలువ పెద్దగా పడిపోదు. అలాగే పెద్దగా వృద్ధి కూడా ఉండదు.  

ఫండ్‌ మేనేజర్లు మొత్తం నిధులను ఇన్వెస్ట్‌ చేయరని, మార్కెట్‌ పరిస్థితులను బట్టి కొంత సొమ్మును ఇన్వెస్ట్‌ చేయకుండానే ఉంచేస్తారని విన్నాను. ఇది నిజమేనా? ఒక వేళ ఇది నిజమైన పక్షంలో ఇన్వెస్ట్‌ చేయని డబ్బులను బ్యాంక్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారా? నగదుగానే ఉంచుతారా? వివరించండి. – మోహిసిన్, విశాఖపట్టణం   
ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం నిధులను ఇన్వెస్ట్‌ చేయకపోవడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఫండ్‌ మేనేజర్లు మొత్తం నిధుల్లో 10 శాతం లేదా 20 శాతం, లేదా 30 శాతం వరకూ పెట్టుబడులు చేయకుండా వదిలివేయవచ్చు. ఈ వెసులుబాట, విచక్షణ ఫండ్‌ మేనేజర్లకు ఉంటుంది. ఈ మొత్తాన్ని స్వల్ప కాలిక బాండ్ల రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తారు.

ముఖ్యంగా రాబడుల కోసం కాక పతనం నుంచి రక్షణ నిమిత్తం, మంచి అవకాశం కోసం ఎదురు చూడటం కోసం ఈ మార్గాన్ని ఫండ్‌ మేనేజర్లు ఎంచుకుంటారు.  మార్కెట్‌ పరిస్థితులు స్తబ్దుగా ఉన్నా, వాళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీల షేర్లు వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా, మార్కెట్‌ కరెక్షన్‌ కోసం ఎదురు చూస్తారు. మార్కెట్‌ పతనమై వాళ్ల అంచనాల మేరకు కంపెనీల షేర్లు దిగొస్తే, అప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తారు. నాకు తెలిసిన చాలా మంది ఫండ్‌ మేనేజర్లు సదరు ఫండ్‌ మొత్తం నిధుల్లో మూడో వంతు వరకూ నగదుగానో లేక డెట్‌ బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో కూడా విభిన్నమైన వ్యూహాన్ని ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తారు. హైబ్రిడ్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహంతో పోల్చితే ఇది చాలా భిన్నంగా ఉంటుంది.  

ఉదాహరణకు మల్టీ అసెట్‌ ఫండ్స్‌ ఉన్నాయనుకోండి. ఫండ్స్‌ నిధుల మొత్తాన్ని ఫండ్‌ మేనేజర్లు  ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో కానీ, ఈక్విటీ సాధనాల్లో గానీ ఇన్వెస్ట్‌ చేస్తారు. స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితులను బట్టి వారు ఈ నిర్ణయం తీసుకుంటారు. అన్ని ఈక్విటీ ఫండ్స్‌ మేనేజర్లకు ఈ వెసులుబాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో ఫండ్‌ మేనేజర్లు దీనిని పాటిస్తారు కూడా.


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement