లాభాలు వచ్చాయి, ఫండ్‌ నుంచి వైదొలగవచ్చా? | Profits have come, can you withdraw from the fund? | Sakshi
Sakshi News home page

లాభాలు వచ్చాయి, ఫండ్‌ నుంచి వైదొలగవచ్చా?

Published Mon, Aug 6 2018 12:20 AM | Last Updated on Mon, Aug 6 2018 12:20 AM

 Profits have come, can you withdraw from the fund? - Sakshi

నేను గత కొన్నేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్‌ చేసిన కొన్ని ఫండ్స్‌ ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చాయి. మంచి రాబడులు వచ్చాయి. కాబట్టి ఈ ఫండ్స్‌ నుంచి నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చా? – సరళ, హైదరాబాద్‌  

ఈ డబ్బులతో వేరే ముఖ్యమైన పనులు నిర్వహించాలనుకున్న పక్షంలో.. ఏడాదిలో 30 శాతానికి పైగా  రాబడులనిచ్చిన ఫండ్స్‌ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ప్రయోజనకరమైన పనులకు మాత్రమే ఇలాంటి లాభాలను వినియోగించాలి. అంతేకానీ, లాభాలు భారీగా వచ్చాయి కదాని మిత్రులకు, బంధువులకు భారీగా పార్టీ ఇవ్వడానికే, ఇతరత్రా వృథా ఖర్చులకు వినియోగించకూడదు. 30 శాతానికి పైగా లాభాలు వచ్చాయి కదాని ముఖ్యమైన అవసరాలు లేకపోయినా, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారనుకుందాం. తర్వాతి ఏడాది వచ్చే లాభాలను మీరు కోల్పోతారు కదా ! చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమే మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. కాబట్టి ఆ ఆర్థిక లక్ష్యాలు సాకారమయ్యేంత వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తేనే మేలు. మరోవైపు ఇన్వెస్టర్లు రీ బ్యాలెన్సింగ్‌ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. రీ బ్యాలెన్సింగ్‌ ప్లాన్‌ అంటే..ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో నిర్దిష్టమైన నిష్పత్తిలో ఇన్వెస్ట్‌ చేయడం. స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. మార్కెట్‌ పడిపోతున్నప్పుడు డెట్‌ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. ఇలా మార్కెట్‌ స్థితిగతులను అనుసరించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యూహాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలి.  

నేను డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ట్యాక్స్‌ సేవర్, యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీల్లో గత ఏడాది కాలం నుంచి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉన్నాను. డీఎస్‌పీ ట్యాక్స్‌ సేవర్‌ పనితీరు సంతృప్తికరంగా లేదు. దీని నుంచి వైదొలగమంటారా ?లేక సిప్‌లను కొనసాగించమంటారా? అంతేకాకుండా నేను మరికొంత మొత్తాన్ని రెండు మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్‌  చేయడానికి రెండు మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను సూచించండి.  -నిరంజన్, విశాఖపట్టణం  
పన్ను ఆదా చేసే చాలా ఫండ్స్‌ సాధారణంగా మల్టీక్యాప్‌ ఫండ్స్‌ అయి ఉంటాయి. కేవలం ఏడాది స్వల్ప కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్‌ పనితీరును అంచనా వేసి సరైన రాబడులనివ్వడం లేదంటూ ఆ ఫండ్‌ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. మూడు నెలలకో, ఆర్నెల్లకో, ఏడాది కాలాన్నో పరిగణనలోకి తీసుకొని పెట్టుబడుల వ్యూహాన్ని, నిర్ణయాలను మార్చుకోవడం సరైన విధానం కాదు. పనితీరు బాగా లేని ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని, పనితీరు బాగా ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం.. సరైన పెట్టుబడి వ్యూహం కాదు. నిరంతరం మంచి రాబడులనివ్వడమనేది  ఏ ఫండ్‌కు సాధ్యం కాదు. మీరు ఇన్వెస్ట్‌ చేసిన రెండు ఫండ్స్‌ విషయానికొస్తే, పన్ను ఆదా ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు ఫండ్స్‌ మంచివే. యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో అధిక లాభాలు ఆర్జించే కంపెనీల షేర్లు ఉన్నాయి. పన్ను ఆదా ఫండ్‌కు సాధారణంగా లాక్‌–ఇన్‌–పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. అంటే మీ డీఎస్‌పీ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకునే వీలు లేదు. మీరు సిప్‌లు ప్రారంభించి ఏడాది దాటింది. కాబట్టి మరో రెండేళ్ల దాకా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేరు.   సమీప కాలంలోనే డీఎస్‌పీ ట్యాక్స్‌ సేవర్‌ కోలుకొని మంచి రాబడులనే ఇస్తుందని నేను భావిస్తున్నాను. అందుకని మీరు నిరభ్యంతరంగా ఈ ఫండ్‌లో సిప్‌లను కొనసాగించవచ్చు. మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి రెండు మల్టీ క్యాప్‌లు–మిరా అసెట్‌ ఇండియా ఈక్విటీ, మోతీలాల్‌ ఓస్వాల్‌ మల్టీక్యాప్‌ 35 ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. గత కొన్ని నెలలుగా మోతీలాల్‌ ఓస్వాల్‌ మల్టీక్యాప్‌ 35 ఫండ్‌ పనితీరు బలహీనంగా ఉన్నా, భవిష్యత్తులో ఇది మంచి రాబడులనే ఇవ్వగలదని అంచనాలున్నాయి. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ను కూడా పరిశీలించవచ్చు.  కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. 

షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మంచి పనితీరు ఉన్న కంపెనీ షేర్లను ఎంచుకోమని చెబుతారు కదా !  ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందని ఎలా తెలుసుకోవాలి?     – రియాజ్, విజయవాడ 
ఒక సామాన్య ఇన్వెస్టర్‌గా మీరు కంపెనీ యాజమాన్యాన్ని కలిసి, వారితో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చక్కని మార్గం... ఆ యాజమాన్యం చరిత్రను తెలుసుకోవడమే. ఇంటర్నెట్‌ విస్తృతంగా అమల్లోకి వచ్చాక, మీరు గూగుల్, వికీ పీడియా ద్వారా కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తుల సమాచారం తెలుసుకోవచ్చు. కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తులు గతంలో ఏవైనా వివాదాల్లో చిక్కుకున్నా, లేదా వారి చుట్టూ ఏవైనా వివాదాలు ముసురుకున్నా, కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగినా, కంపెనీ ఆడిటర్లు తరచుగా మారుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే మంచో, చెడో అన్న నిర్ణయానికి రావద్దు. కొంత కాలం ఎదురు చూసి, మరింత సమాచారం సేకరించి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి.   
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement