పన్ను ప్రయోజనాలే ముఖ్యం కాదు..
రానున్న బడ్జెట్‌లో ఈక్విటీ స్కీమ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించే అవకాశాలున్నాయని మిత్రులంటున్నారు. అలా జరుగుతుందా ? అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉన్నా కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా? వివరించగలరు.
- శశికాంత్, హైదరాబాద్
మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్కీమ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించే అవకాశాలను అంచనా వేయలేం. బడ్జెట్ వరకూ వేచి చూడడమే మంచిది. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తుందన్న అంచనాలతో ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడం సరైన నిర్ణయం కాదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఈ విషయమై బడ్జెట్‌లో ఒక స్పష్టత వచ్చే వరకూ ఓపికపట్టండి. పన్ను మినహాయింపులున్నాయన్న ఒకే ఒక్క కారణంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదన్న విషయం గుర్తించుకోండి.
మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే, దీర్ఘకాలంలో మరే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలకంటే కూడా ఈక్విటీలపైననే అధిక రాబడులు వస్తాయి. మూలధన లాభాల పన్ను మినహాయింపు లభించడమనేది అదనపు ప్రయోజనం మాత్రమే. అందుకని ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో ఈక్విటీలపై మూలధన లాభాల పన్ను విధించినప్పటికీ, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రాధాన్యత ఏమీ తగ్గదు. అయితే ఇలా పన్ను విధిస్తే లాభాల్లో కొంత కోత ఉంటుంది.
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండొచ్చన్న ఒకే ఒక కారణంతో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వైదొలగాలనుకోవడం సరైన వ్యూహం కాదు. దీర్ఘకాలంలో మంచి రాబడులనిచ్చేలా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రత్యామ్నాయమేదీ లేదు. అందుకని పన్నులు విధించినా సరే, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.
నేను నెలకు రూ.10,000 చొప్పున ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ఇన్వెస్ట్ చేస్తున్నాను. లాక్-ఇన్-పీరియడ్‌కు ముందే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చా? ఏమైనా అత్యవసర సందర్భాలు వస్తే ఎంతో కొంత జరిమానా చెల్లించి ఈ సొమ్ములను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉందా ?
- రవళి, విశాఖపట్టణం
పన్ను ప్రయోజనాలు లభించే ప్రతీ ఇన్వెస్ట్‌మెంట్‌కు లాక్-ఇన్-పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు మూడేళ్ల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. ఈ లాక్-ఇన్-పీరియడ్‌కు ముందే ఈఎల్‌ఎస్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడం కుదరదు. జరిమానా చెల్లించి లాక్-ఇన్-పీరియడ్ కంటే ముందే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు.
నేను అక్టోబర్ 2005లో ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్ పెన్షన్ ప్లాన్ టూ ను తీసుకున్నాను. వార్షిక ప్రీమియం రూ.15,000 చొప్పున చెల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. మెచ్యూరిటీకి ముందే ఈ స్కీమ్‌ను క్లోజ్ చేయవచ్చా? ఇలా క్లోజ్ చేస్తే నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? లేకుంటే ఈ స్కీమ్‌లో కొనసాగమంటారా?
- ఆనంద్, విజయవాడ
ఐసీఐసీఐ ప్రు లైఫ్‌టైమ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూలిప్). మీరు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపకరిస్తుంది. మీరు రిటైర్ కావాలనుకున్నప్పుడు యాన్యుటీని కొనుగోలు చేయాలి. మీకు ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరమైన పక్షంలో, యాన్యుటీ కొనుగోలు అవసరం లేదనుకుంటే, ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. మీరు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి పదేళ్లు దాటాయి. కనుక మీరు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే మొత్తం కూడా సరెండర్ వాల్యూగా వస్తుంది. మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం, ఈ సరెండర్ విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌తో కలగలసి ఉన్న బీమా ప్లాన్‌లు తగిన రాబడులనివ్వలేవని చెబుతుంటాం. ఈ ప్లాన్‌లు ఖరీదైనవే కాకుండా, చాలా చార్జీలు వీటిల్లో ఉంటాయి.
ఇవి తగినంత బీమా రక్షణ ఇవ్వలేవు. ఇన్వెస్ట్ చేయడానికి తగిన సాధనాలు కూడా కావు. అందుకనే ఇన్వెస్టర్లు ఎప్పుడూ బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వేర్వేరు సాధానాల్లో ఇన్వెస్ట్ చేయాలి. జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్‌లను ఎంచుకోవాలి. వీటికి ప్రీమియం తక్కువ. బీమా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్