ఈఎల్‌ఎస్‌ఎస్‌లకంటే యులిప్‌లు బెటరా? | business expert opinion | Sakshi
Sakshi News home page

ఈఎల్‌ఎస్‌ఎస్‌లకంటే యులిప్‌లు బెటరా?

Published Mon, Apr 16 2018 1:54 AM | Last Updated on Mon, Apr 16 2018 1:54 AM

business expert opinion - Sakshi

మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) మెచ్యూరిటీపై పన్నులు విధించారు కదా ! అందుకని యులిప్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. యులిప్స్‌లో పన్ను  ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి ఇప్పుడు యులిప్స్‌ బెటరని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి ?     – రవికాంత్, కరీంనగర్‌ 
ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీమ్‌ల మెచ్యూరిటీపై పన్నులున్నాయన్న ఆలోచనతో యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ యూనిట్లను విక్రయించినప్పుడు మీరు 10.4 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది. యులిప్స్‌ యూనిట్లను విక్రయించినప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు. అయితే యులిప్స్‌ కంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధానంగా మూడు పన్నేతర కారణాలున్నాయి. మొదటిది పారదర్శకత... మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏ యే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయో వెల్లడిస్తాయి. కానీ యులిప్స్‌ ఆ విషయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ అంత పారదర్శకంగా వ్యవహరించవు. ఇతర ఫండ్స్‌తో పోల్చిచూసుకోవడానికి, బెంచ్‌ మార్కింగ్‌ విషయంలో ఫండ్స్‌ పారదర్శకత యులిప్స్‌ కంటే బాగా ఉంటుంది. రెండో కారణం వ్యయాలు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీమ్స్‌తో పోల్చితే యులిప్స్‌ ఎక్కువ చార్జీలు వసూలు చేస్తాయి. పైగా ఈ యులిప్‌లు విధించే చార్జీల్లో తగిన పారదర్శకత కూడా ఉండదు. ఇక మూడో అంశం...లాక్‌ ఇన్‌ పీరియడ్‌.. యూలిప్‌ల్లో లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఐదేళ్లు కాగా, ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో లాక్‌–ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లు మాత్రమే. గత బడ్జెట్‌ల సరళిని చూస్తే, పన్ను ఆదాయం పెంపు వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకూ ఇస్తున్న రాయితీలను క్రమక్రమంగా ఎత్తేస్తున్నది. భవిష్యత్తులో యులిప్‌లపై కూడా పన్ను భారం ఉండే అవకాశాలూ లేకపోలేదు. అందుకని కేవలం పన్ను అనే ఒకే ఒక అంశం ఆధారంగా యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.  

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో సంయుక్తంగా రూ. 30 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చని ఒక వెబ్‌సైట్‌లో చదివాను. కానీ ఇండియన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వెబ్‌సైట్‌ప్రకారం, ఎస్‌సీఎస్‌ఎస్‌లో సింగిల్‌గా కానీ, జాయింట్‌గా కానీ గరిష్టంగా ఇన్వెస్ట్‌ చేసే మొత్తం రూ.15 లక్షలని ఉంది. దీంట్లో ఏది నిజం ?      – విష్ణు, విజయవాడ  
కొన్ని సార్లు కొన్ని వెబ్‌సైట్లలో లభించే సమాచారంపై తగిన స్పష్టత ఉండదు. అలాంటిదే ఇది కూడా. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో గరిష్టంగా రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. తన జీవిత భాగస్వామి(భార్య/భర్త)తో జాయింట్‌గా ఏర్పాటు చేసిన ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో (జీవిత భాగస్వామి ఫస్ట్‌ హోల్డర్‌గా ఉండాలి)అదనంగా మరో రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అంటే జీవిత భాగస్వామితో ఏర్పాటు చేసిన జాయింట్‌ ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాలో గరిష్టంగా రూ.30 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  ఎవరైనా భార్య/భర్తతో మాత్రమే జాయింట్‌ ఖాతా తెరవాల్సి ఉంటుంది.  

ప్రిన్సిపల్‌  ట్యాక్స్‌–సేవింగ్స్‌ ఫండ్‌లో కొత్త సిప్‌ను ప్రారంభిద్దామనుకుంటున్నాను. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ ఫండ్‌ తగినదేనా? గోల్డ్‌ ఈటీఎఫ్‌లు డిస్కౌంట్‌కే ట్రేడవుతుంటాయి. ఎందుకని ?      – రషీద, హైదరాబాద్‌  
ప్రిన్సిపల్‌ ట్యాక్స్‌–సేవింగ్స్‌ ఫండ్‌లో నిరభ్యంతరంగా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేయదగ్గ మంచి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. కొనుగోలు చేయాలనుకుంటున్న లేదా విక్రయించాలనుకుంటున్న ఇన్వెస్టర్ల సంఖ్యను బట్టి గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఎక్కువ (ప్రీమియమ్‌)ధరకు, లేదా తక్కువ(డిస్కౌంట్‌) ధరకు ట్రేడవడం జరుగుతుంది. కొనుగోలుదార్ల కంటే

అమ్మేవాళ్లు ఎక్కువగా ఉంటే గోల్డ్‌  ఈటీఎఫ్‌ తక్కువ ధరకు ట్రేడవుతుంది. కొన్ని గోల్డ్‌  ఈటీఎఫ్‌లు ఎన్‌ఏవీ కంటే తక్కువ ధరకు ట్రేడ్‌ కావడానికి కూడా ఇదే కారణం.   సుందరమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అందిస్తున్న ఐదేళ్ల క్లోజ్‌డ్‌ ఎండ్‌ మైక్రో క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?     – వినోద్, విశాఖపట్టణం  
సాధారణంగా ఇన్వెస్టర్లు క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) సరైన విధానం.  ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారానే ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా చేస్తేనే స్టాక్‌ మార్కెట్‌ పెరిగినప్పుడు, అదేవిధంగా తగ్గినప్పుడూ తగిన ప్రయోజనాలు వారికి లభిస్తాయి. అదే క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్‌లో అయితే... మీరు ఆ ఫండ్‌ ఆరంభంలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫండ్స్‌లో లిక్విడిటీ కూడా పెద్దగా ఉండదు. మరోవైపు క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్‌లో నిర్దేశిత సమయం వరకూ మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. మీ విషయంలో అయితే మీరు ఐదేళ్ల వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. టెక్నికల్‌గా అవి లిస్టవుతాయి. కానీ, ట్రేడింగ్‌ లావాదేవీలు పెద్దగా ఉండవు. అందుకని ఐదేళ్ల కాలం కంటే ముందుగానే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెనక్కి తీసుకోలేరు. క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్‌ విధానం... మైక్రో, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కు తగిన విధంగానే ఉన్నప్పటికీ, సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలు మీకు దక్కవు. అందుకని క్లోజ్‌డ్‌ ఎండ్‌ ఫండ్స్‌ను కాకుండా వేరే ఫండ్స్‌ను ఎంచుకోండి. సిప్‌ విధానం ద్వారా ఐదేళ్లు అంతకుమించి ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.   
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement