యులిప్‌లలో పెట్టుబడులు పెట్టొచ్చా? | Expect no big change in personal tax slabs in Budget 2015 ... | Sakshi
Sakshi News home page

యులిప్‌లలో పెట్టుబడులు పెట్టొచ్చా?

Published Mon, Mar 9 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

యులిప్‌లలో పెట్టుబడులు పెట్టొచ్చా?

యులిప్‌లలో పెట్టుబడులు పెట్టొచ్చా?

హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 అనేది తక్కువ వ్యయమున్న యులిప్. మోర్టాలిటి రిస్క్, ఫండ్ నిర్వహణ వ్యయాలు(ఏడాదికి 1.35 శాతం)లను మాత్రమే వసూలు చేస్తుంది.

నా వయస్సు 28 సంవత్సరాలు. నా వార్షికాదాయం 6 లక్షలు. ఇటీవలే పెళ్లయింది. ఇంకా పిల్లలు లేరు.  ఏటా రూ.2 లక్షలు చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లో ఇరవై ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తక్కువ చార్జీలు ఉండడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది సరైనదేనా? అసలు యులిప్‌లో పెట్టుబడులు పెట్టవచ్చా? కనిపించని ఖర్చులేమైనా తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ చార్జ్ చేస్తుందా? హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్‌ని మించి ఇంకా ఉత్తమమైనవి ఏమైనా ఉన్నాయా? తగిన సూచనలివ్వండి?
 - వెంకటేశ్వర్లు, గుంటూరు
 
హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 అనేది తక్కువ వ్యయమున్న యులిప్. మోర్టాలిటి రిస్క్, ఫండ్ నిర్వహణ వ్యయాలు(ఏడాదికి 1.35 శాతం)లను మాత్రమే వసూలు చేస్తుంది. ఇన్వెస్టర్ చెల్లించిన మొత్తంలో వీటిని మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. తక్కువ చార్జీలే ఉన్నప్పటికీ, ఇతర యులిప్‌లకు ఉండే ప్రతికూలాంశాలు దీనికి కూడా ఉన్నాయి. బీమాను, పెట్టుబడులను కలగలపకూడదనే నియమంతో యూలిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయవద్దని చెబుతుంటాం. లైఫ్ కవర్ కోసం టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక ఇన్వెస్ట్‌మెంట్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వ్యయాల విషయాల్లోనే కాకుండా చాలా అంశాల్లో యూలిప్‌ల కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. యూలిప్‌లకు లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. దీంతో ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఉన్నట్లుగా వీటికి లిక్విడిటీ ఉండదు.

మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఎన్‌ఏవీ, పోర్ట్‌ఫోలియోలు, ఫండ్ మేనేజర్ వ్యూహాలు,... తదితర విషయాల్లో పారదర్శకత ఉంటుంది. కానీ యూలిప్‌ల్లో అలాంటి పారదర్శకత ఉండదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త అని తెలుస్తోంది. అందుకని మీరు ముందుగా ఏదైనా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి.  ఆ తర్వాత ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్‌డ్, కెనరా రొబెకొ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లను పరిశీలించవచ్చు.
 
నా వయస్సు 34, నా భార్య వయస్సు 30 సంవత్సరాలు. మాకు ఏడాది బాబు ఉన్నాడు. ఇద్దరమూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లమే. ఇద్దరి వార్షికాదాయం రూ.25 లక్షల వరకూ ఉంటుంది. గృహ, కారు,  ఇతర రుణాలు కలిసి మొత్తం రుణాలు రూ.80 లక్షల వరకూ ఉంటాయి. మాలో ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున కంపెనీ బీమా రక్షణ అందిస్తోంది. దీనికి అదనంగా రూ.75 లక్షలకు టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. భార్యాభర్తలిద్దరికీ కలిపి జాయింట్ లైఫ్ టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా ఉన్నాయా?
 - సాయిరామ్, హైదరాబాద్
 
కుటుంబంలో సంపాదన పరులకు టెర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే, ఇది మరింత తప్పనిసరి. సంపాదన పరులైన భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి అనుకోకుండా ఏమైనా జరిగితే, కుటుంబానికి వచ్చే మొత్తం ఆదాయంపై ప్రభావం పడుతుంది. మార్కెట్లో రెండు రకాలైన జాయింట్ లైఫ్ పాలసీలు ఉన్నాయి. మొదటి రకం పాలసీలో పాలసీ తీసుకున్న భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా మరణిస్తే, బీమా మొత్తం రెండో వ్యక్తికి చెల్లిస్తారు. దీంతో ఈ పాలసీ పూర్తవుతుంది. ఇలాంటి వాటికి ప్రీమియం తక్కువగా ఉంటుంది.  

హెచ్‌డీఎఫ్‌సీ టెర్మ్ ఎష్యూరెన్స్ ఇలాంటిదే. ఇక రెండో రకం పాలసీల్లో ఒక వ్యక్తి మరణిస్తే బీమా మొత్తం చెల్లిస్తారు. రెండో వ్యక్తికి బీమా రక్షణ కొనసాగుతుంది. చెల్లించాల్సిన బీమా ప్రీమియం తగ్గుతుంది.  వయస్సు, పాలసీ కాల వ్యవధి, ప్రీమియం చెల్లించే గడువు, బీమా మొత్తం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత ప్రీమియం తగ్గించాలో నిర్ణయిస్తారు. బజాజ్ అలియంజ్ ఐసెక్యూర్ ఈ తరహా పాలసీనే.  మీపై ఆధారపడి ఉన్నవాళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని పాలసీని ఎంచుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు జాయింట్ లైఫ్ ఎండోమెంట్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని తీసుకోకండి. అలా కాకుండా పూర్తిగా టెర్మ్ పాలసీనే తీసుకోవడం ఉత్తమం.
 
సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పన్ను ఆదా చేయడం లక్ష్యంగా నెలకు రూ.2,000 చొప్పున  రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇలా కనీసం 8-10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. తగిన సూచనలివ్వండి?
 - శ్రీలత, మంగళగిరి
 
ఆదాయపు పన్ను(ఐటీ) చట్టం సెక్షన్ 80 సీ కింద  మీకు పన్ను రాయితీలు కావాలనుకుంటే, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.  ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.1 లక్ష వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాకిన్ పీరియడ్ మూడేళ్లు. ఈ లాకిన్ పీరియడ్ కారణంగా ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఇన్వెస్ట్‌మెంట్ డిసిప్లిన్ ఏర్పడే అవకాశాలుంటాయి. అయితే లాభాలు బాగా వచ్చినప్పటికీ, మూడేళ్ల లాకిన్ పీరియడ్ కారణంగా వీటి నుంచి బయటకు రాలేం. వేర్వేరు స్థాయి మూలధనాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి వీటిని డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. దీర్ఘకాలంగా చూస్తే ఇవి మంచి రాబడులనే ఇచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement