
పెట్టుబడులకు సంబంధించి ‘హండ్రెడ్ మైనస్ మై ఏజ్’ రూల్ కరెక్టేనా ? ఈ నియామకాన్ని అనుసరించి డెట్, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే అది సరైన పోర్ట్‌ఫోలియో అవుతుందా ? –శశికాంత్, విజయవాడ
సాధారణంగా పెట్టుబడులకు సంబంధించి ‘హండ్రెడ్ మైనస్ మై ఏజ్’ అనే నియమాన్ని పాటించాలని చెబుతుంటారు. అంటే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి వయస్సును వంద నుంచి తీసివేస్తే ఎంత సంఖ్య వస్తుందో అంత శాతం ఈక్విటీలోనూ, మిగిలినది ఇతర సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని ఈ సూత్రం సూచిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలనుకుందాం. హండ్రెడ్ మైనస్ మై ఏజ్ ప్రకారం (100–60–40) ఆ వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో 40 శాతం ఈక్విటీలోనూ, మిగిలిన 60 శాతం ఇతర సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలి.
అదే 40 సంవత్సరాల వ్యక్తిని తీసుకుంటే (100–40–60) ఆ వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో 60 శాతం ఈక్విటీలోనూ, మిగిలిన 40 శాతం ఇతర సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలి. అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగ్గించాలని దీని అర్థం. మరో రకంగా చెప్పాలంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ, జీవన వ్యయాల కోసం పెట్టుబడులపై అధికంగా అధారపడాల్సి ఉంటుంది. అందుకని ఈక్విటీపై ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గించుకోవాలి. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయి. అందరికీ ఒకే రకమైన ఖర్చులు ఉండటం లేదు. ఆర్థిక అవసరాలు కూడా మారిపోయాయి. అందుకని ఈ రూల్‌ను కచ్చితంగా పాటించాలని ఏమీ లేదు.
మీరు రిటైరైన తర్వాత మీకు ఉండే అవసరాలకు సరిపడా స్థిర ఆదాయం ఉంచుకొని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మరీ అధిక రిస్క్ మాత్రం తీసుకోకండి. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు పాటించాల్సిన ఫార్ములా ఒకటి ఉంది. ఒక వ్యక్తికి (ఎంత వయస్సున్నా సరే) 5–10 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్‌మెంట్ సొమ్ములు అవసరం లేదనుకోండి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ సొమ్ములను అధిక భాగం(మొత్తం సొమ్ముల్లో 60 శాతానికి పైగా) ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన మొత్తాన్ని స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎప్పుడూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వంద శాతం మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయవద్దు. కొంత మొత్తాన్ని స్థిరాదాయం వచ్చే సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మార్కెట్లు చక్రీయంగా ఉంటాయి. కాబట్టి, మార్కెట్లు బాగా పడిన సందర్భంలో మీకు తగిన రక్షణ ఉంటుంది.
నేను గత కొంత కాలంగా రిలయన్స్ ట్యాక్స్ సేవర్(ఈఎల్‌ఎస్‌ఎస్–ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్)లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పెట్టుబడులను యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి.
–మహేందర్, విశాఖపట్టణం
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి సిప్‌కు మూడేళ్ల లాక్–ఇన్– పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్‌లో అంటే ఈ మూడేళ్ల కాలంలో మీరు పాత ఫండ్ నుంచి వైదొలగడం కానీ, మరో ఫండ్‌కు మారడం కానీ కుదరదు. అందుకని మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేసి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్‌లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించవచ్చు.
నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కనీసం 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనేది నా ప్రణాళిక. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీగా ఇంత మొత్తంలో రాబడులు వస్తాయని ఏమైనా ఉందా ? –కార్తీక్, హైదరాబాద్
మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీగా ఇంత మొత్తంలో రాబడులు ఇస్తాయని చెప్పలేము. పైగా మూలధన రక్షణ కూడా ఉండదు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్‌కు నష్టాలు వస్తే, మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత హరించుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులే పొందవచ్చు. సురక్షితమైన, గ్యారంటీ రాబడులనిచ్చే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర స్థిరాదాయ మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడుల కంటే అధిక రాబడులు పొందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
అయితే మీరు 25 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇంత సుదీర్ఘ ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎంత అధ్వానమైన మ్యూచువల్ ఫండ్ అయినా స్థిర ఆదాయాన్నిచ్చే సాధనాల కంటే అధిక మొత్తంలోనే రాబడులను ఇవ్వవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, ముందుగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఒకటి లేదా రెండు మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటిల్లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
ఇలా కనీసం రెండేళ్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మ్యూచువల్ ఫండ్స్‌పై, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై, మార్కెట్ పరిస్థితులపై తగిన అవగాహన వస్తుంది. అప్పుడు రెండు లేదా మూడు మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కనీసం ఏడాదికి ఒకసారైనా, మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్ పనితీరును మదింపు చేయండి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా, ఎంతో కొంత మొత్తం సిప్‌లను పెంచండి.
– ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment