
మల్టీక్యాప్ ఫండ్స్‌కు, డైనమిక్ ఫండ్స్‌కు మధ్య తేడా ఏమిటి ? – మాధురి, విజయవాడ
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని బట్టి మల్టీక్యాప్ ఫండ్స్‌కు, డైనమిక్ ఫండ్స్‌కు తేడా ఉంటుంది. ఎల్లప్పుడూ ఈక్విటీల్లోనే పూర్తిగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మల్టీక్యాప్ ఫండ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక డైనమిక్ ఫండ్స్ కూడా దాదాపు అధిక స్థాయిల్లోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే మార్కెట్ స్థితిగతులను బట్టి, ఈక్విటీ, స్థిరాదాయ సాధనాలకు సంబంధించిన పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పుచేర్పులు చేస్తాయి.
అంటే మార్కెట్ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఈక్విటీల్లో తక్కువగానూ, మార్కెట్ పతనమైన పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఎక్కువగానూ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని డైనమిక్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. మార్కెట్ పరిస్థితులను బట్టి డైనమిక్ ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్ ఒక్కోసారి స్థిరాదాయ సాధనాల్లో 25 శాతం నుంచి 30 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మల్టీక్యాప్ ఫండ్స్ అయితే వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందుతాయి.
నా వయస్సు 40 సంవత్సరాలు. నా నికర వేతనం రూ.40,000. ఈ రోజుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్లు చౌకగా ఉన్నాయి. అందుకని వీలైనంత ఎక్కువ మొత్తానికి(రూ.30–35 లక్షల వరకూ) గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – రవి కుమార్, విశాఖపట్టణం
ఈ రోజుల్లో గృహరుణాలపై వడ్డీరేట్లు తక్కువగానే ఉన్నాయన్నది నిజమే. అయితే మీ విషయంలో ఎక్కువ మొత్తానికి గృహ రుణం తీసుకోవడమనేది సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తోంది. మీకు వచ్చే ఆదాయంలో 60–80 శాతం వరకూ గృహ రుణ నెలసరి వాయిదాల చెల్లింపులకే పోవడం వల్ల మీ కుటుంబ ఇతర ఆర్థిక అవసరాలపై బాగానే ప్రభావం చూపుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీరు ఉద్యోగం కోల్పోతే అప్పుడు పరిస్థితులు మరింత విషమిస్తాయి.
ఉద్యోగం కోల్పోయిన కారణంగా ఈఎంఐలు చెల్లించలేక ఇల్లును కూడా కోల్పోవలసి వస్తుంది. అందుకని ఎవరైనా సరే, గృహ రుణానికి సంబంధించిన నెలసరి వాయిదా (ఈఎంఐ) వారి వారి వేతనంలో మూడో వంతుకు మించకుండా చూసుకోవాలి. మీ విషయానికొస్తే, మీ గృహ రుణ ఈఎంఐ రూ.10,000–14,000 రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ సందర్భంలో మీరు ఉద్యోగం కోల్పోయినా, గృహ రుణ ఈఎంఐ చెల్లించే స్థాయిలోనైనా వెంటనే మరో చిన్న ఉద్యోగం సంపాదించుకొని, సొంత ఇంటిని చేజారకుండా చూసుకోవచ్చు.
అయితే గృహ రుణాలు చౌకగా ఉన్నందున ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవడం ఒక్కోసారి మంచి ఫలితాలే ఇవ్వవచ్చు. గృహం విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పెరిగే విలువతో పోల్చితే, గృహ రుణంపై అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి. మీరు ఉద్యోగం కోల్పోయినా, విషమ పరిస్థితుల్లో ఈఎంఐ చెల్లింపులు కుంటుపడకుండా ఉండేటట్లయితే(మీ భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ గృహ రుణ ఈఎంఐ చెల్లింపులు చేయగలిగితే) వీలైనంత ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకోవచ్చు. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
నేను ఎల్‌ఐసీ జీవన్ తరంగ్ పాలసీని 2011లో తీసుకున్నాను. పాలసీ వివరాలను మీకు పంపిస్తున్నాను. ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? ఈ పాలసీకి దీనికి బదులుగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. – పవన్, హైదరాబాద్
జీవన్ తరంగ్ అనేది విత్ ప్రాఫిట్స్–హోల్ లైఫ్ ప్లాన్. మీరు పంపిన వివరాలను బట్టి చూస్తే, మీరు తీసుకున్న పాలసీకి బీమా కవరేజ్ రూ.9 కోట్లకు ఉంది. మీరు ఒక వేళ ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు భారీగా నష్టపోతారు. మీరు ఇప్పటిదాకా చెల్లించిన ప్రీమియమ్‌ల్లో మొదటి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించి మిగిలిన దాంట్లో 30 శాతం మాత్రమే మీకు గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూగా వస్తుంది. ఎల్‌ఐసీ ఒకోసారి స్పెషల్ సరెండర్ వ్యాల్యూని కూడా చెల్లించవచ్చు.
ఇది గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ కంటే కొంచెం అధికంగానే ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకుని మూడేళ్లు దాటింది కాబట్టి మీరు ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. బీమా తీసుకోవాలనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడమే ఉత్తమమైన విధానం. టర్మ్ బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. పైగా బీమా కవరేజ్ అధికంగా ఉంటుంది. తక్కువ ప్రీమియమ్ చెల్లించడం ద్వారా అధిక మొత్తానికి బీమా కవరేజ్ పొందవచ్చు.
బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒకే పాలసీని ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయాలి. బీమా కోసం టర్మ్ పాలసీని తీసుకున్నట్లుగానే, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్‌చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు.
- ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment