
న్యూ ఫండ్ ఆఫర్‌లో పెట్టుబడి సరికాదు...
నేను రూ. 2 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 2005లో ఇన్వెస్ట్ చేశాను.
నేను రూ. 2 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 2005లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.10 లక్షలు. నేను 20 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. నేను ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే ఎంత పన్ను చెల్లించాలి ? నా ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా చూపాలి? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని, నా మొత్తం ఆదాయానికి కలపాలా? అలా కలిపితే నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌కు చేరతాను. దయచేసి నా సందేహాలను నివృత్తి చేయండి?
-పవన్, గుంటూరు
దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చనడానికి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పొందిన లాభాలే నిదర్శనం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను కొన్న ఏడాది తర్వాత వాటిని విక్రయిస్తే పొందే లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నా సరే ఇది వర్తిస్తుంది. ఒక వేళ ఏడాదిలోపే విక్రయిస్తే 15 శాతం షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాలి. ఇక మీ విషయానికొస్తే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి తొమ్మిదేళ్లయింది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై మీరు ఆర్జించిన రూ.8 లక్షల లాభాలపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాభాలను మూలధన లాభాల ఆదాయం అనే హెడ్ కింద చూపించాలి.
నేను ఇప్పుడు ఎన్‌ఎఫ్‌ఓ(న్యూ ఫండ్ ఆఫర్)లో గానీ, ప్రస్తుతమున్న ఏదేని ఫండ్‌లో గానీ ఒకేసారి రూ.50,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై మూడేళ్ల తర్వాత రూ.72,000 ఆశిస్తున్నాను. అప్పుడు నా సోదరి వివాహానికి ఈ సొమ్ములు అవసరం. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
-రంజని, హైదరాబాద్
ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్ చేసే ఆలోచన పూర్తిగా మానుకోండి. ఇది సరైనది కాదు. గత కొన్నేళ్ల పనితీరును మదింపు చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఎన్‌ఎఫ్‌ఓలో అలాంటి అవకాశం ఉండదు కాబట్టి. ఎన్‌ఎఫ్‌ఓలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌నే ఎంచుకోండి. ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కొంత కొంత మొత్తాల్లో క్రమం తప్పకుండా(సిప్-సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇక మీ విషయానికొస్తే, మీ రూ.50,000 మొత్తాన్ని ఏదైనా ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తమ నిధుల్లో 65 శాతం మొత్తాన్ని ఈక్విటీలో, మిగిలిన మొత్తాన్ని డెట్ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిధుల కేటాయింపు సమతూకంగా ఉండేలా, మంచి రాబడులు వచ్చేలా, అదే సమయంలో ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితంగా ఉండేలా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ పనితీరు ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్‌డ్. ఈ మూడు ఫండ్స్ గత కొన్నేళ్లుగా మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
నా వయస్సు 29 ఏళ్లు. ఇటీవలే నా పెళ్లైంది. నా భార్య కూడా ఉద్యోగే. ఇద్దరం కలసి నెలకు రూ.70,000 వరకూ ఆర్జిస్తాం. మేం ఇంత వరకూ ఎలాంటి బీమా పాలసీలు తీసుకోలేదు. మా మీద ఆధారపడినవాళ్లు కూడా ఎవరూ లేరు. మాకు బీమా పాలసీలు అవసరమా?
-అర్జున్, కర్నూల్
మీపై ఆధారపడిన వాళ్లు ఎవరూ లేనప్పటికీ, మీరు బీమా పాలసీలు తీసుకోవలసిందే. మీకు పెళ్లి అయిందంటే, మీకొక కుటుంబం ఉందన్నమాట. ఆ కుటుంబానికి బీమారక్షణ తప్పనిసరి. మీ వయస్సు చిన్నదే. ఈ వయస్సులో బీమా పాలసీ తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియమే చెల్లిస్తే సరిపోతుంది. వీలైనంత త్వరగా ఆన్‌లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఆలస్యమైన కొద్దీ, ప్రీమియం వ్యయాలు పెరుగుతుంటాయి.