ఎన్‌ఏవీ అధికంగా ఉన్నా, ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను ఏడాది క్రితం రూ.5 లక్షల విలువైన హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్ డెరైక్ట్-జీ యూనిట్లను కొనుగోలు చేశాను. మూడేళ్లలోపు ఈ యూనిట్లను విక్రయిస్తే నేను స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్ యూనిట్లను హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ డెరైక్ట్-జీ స్కీమ్‌తో విలీనం చేయాలనుకుంటున్నాను. ఇలా చేసిన ఏడాది తర్వాత ఆ యూనిట్లను విక్రయిస్తే నేను స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందా?
- అనిత, హైదరాబాద్
రెండు ఫండ్ హోల్డింగ్స్‌ను ఇక సాధారణ ఇన్వెస్టర్‌గా మీరు విలీనం చేయలేరు. విలీన నిర్ణయం ఫండ్ హౌస్‌లకు మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఒకే విధమైన లక్ష్యాలున్న ఫండ్ స్కీమ్‌లను ఫండ్ హౌస్‌లు విలీనం చేస్తాయి. ఈక్విటీ ఇన్వెస్టింగ్ మీకు సౌకర్యకరంగా ఉంటే,(స్వల్పకాలంలో తగినంత రిస్క్ భరించగలిగి, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగిన ఓపిక ఉంటే) హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్ డెరైక్ట్-జీ యూనిట్లను సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ డెరైక్ట్-జీ ఫండ్ స్కీమ్‌కు మార్చుకోవచ్చు. ఇలా బదిలీ చేస్తే హెచ్‌డీఎఫ్‌సీ లిక్వ్‌డ్ ఫండ్ యూనిట్లను విక్రయించినట్లుగానే పరిగణిస్తారు.
మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయ పన్ను శ్లాబుననుసరించి పన్ను రేటు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్ ఫండ్‌లో మూడేళ్లకు మించి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తేనే మీకు దీర్ఘకాల మూల ధన లాభాల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
నేను 2002లో బిర్లా సన్ ఫ్లెక్సీ సేవ్ ప్లస్(ఎండోమెంట్) పాలసీ తీసుకున్నాను. దీనికి ప్రీమియం 40 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఇప్పటి వరకూ (13 ఏళ్లపాటు) ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇది మంచి పాలసీయేనా? దీంట్లో కొనసాగమంటారా? లేక సరెండర్ చేయమంటారా?
- సురేందర్, గుంటూరు
ఎండోమెంట్ పాలసీలు సరైన రాబడులను ఇవ్వలేవు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పాలసీలు రాబడులు ఏమంత సంతృప్తికరంగా ఉండవని చెప్పవచ్చు. బాగా దీర్ఘకాలం పాటు ఉండే ప్లాన్ ఇది. ఈ పాలసీ వ్యయ వివరాలు కూడా ఏమంత పారదర్శకంగా ఉండవు. అందుకని ఈ పాలసీని సరెండర్ చేయడమే సముచితంగా ఉంటుంది. ఈ పాలసీని మీరు సరెండర్ చేస్తే, ఆ సరెండర్ వేల్యూ మీరు చెల్లించిన ప్రీమియమ్ మొత్తంలో 30 శాతానికి సమానంగా ఉంటుంది. (మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం కాక)ఇక నుంచి ఈ పాలసీ కోసం కేటాయించిన ప్రీమియం మొత్తాలను ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి.
నేను ఇప్పటి వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయని మిత్రులు చెప్పడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృతంగా రీసెర్చ్ చేసిన తర్వాత నేను కొన్ని ఫండ్స్‌ను ఎంపిక చేశాను. అవి..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్,.. వీటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ ఈ ఫండ్స్ నెట్ అసెట్ వేల్యూ(ఎన్‌ఏవీ)లు అధికంగా ఉన్నాయి. నేను ఎంపిక చేసిన ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయా? ఎన్‌ఏవీ అధికంగా ఉన్నప్పటికీ, వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? -జాన్సన్, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమే. ఇక మీరు ఎంపిక చేసిన మూడు ఫండ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్ మంచి ఎంపిక. మిగిలిన రెండు మంచి ఫండ్సే అయినప్పటికీ, మీరు మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించిన మీలాంటి ఇన్వెస్టర్లకు ఇవి సరైనవి కావు.
ఇక ఎన్‌ఏవీ విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అది అసలు సమస్యే కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గతాన్ని, ప్రస్తుతంతో పోల్చడానికి మాత్రమే ఎన్‌ఏవీ ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పనితీరును బట్టి వాటిని అంచనా వేయాలి కానీ, ఎన్‌ఏవీని బట్టి కాదు. వివిధ కాలాల్లో ఆ ఫండ్ ఇచ్చిన రాబడులను, పోర్ట్ ఫోలియో వివరాలను బట్టి మ్యూచువల్ ఫండ్స్ పనితీరును మదింపు చేయాలి.