NAV
-
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి: ఈ పొరబాటు అసలు చేయకండి!
మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఒక పథకం ఎన్ఏవీ తక్కువగా ఉంటే.. దాన్ని చౌకగా భావించొచ్చా..? పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీసుకోవచ్చా? -జగదీశ్వర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయం చేసే సమయంలో నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) పదం వినిపిస్తుంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్ ధరగా కొందరు భావిస్తుంటారు. దీంతో ఎన్ఏవీ తక్కువ ఉంటే అది ఇతర పథకాలతో పోలిస్తే చౌక అని భావిస్తుంటారు. అంటే ఎన్ఏవీ తక్కువగా ఉన్న పథకాన్ని ఎంచుకోవాలని అర్థమా? కాదు. మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఎన్ఏవీని పరిగణనలోకి తీసుకోవద్దన్నది మా సూచన. ఎన్ఏవీ అంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియో (పెట్టుబడులు) మార్కెట్ విలువను మొత్తం యూనిట్లతో భాగించగా వచ్చేదే ఎన్ఏవీ. ఒక పథకానికి సంబంధించి ఒక యూనిట్ విలువను ఇది చెబుతుంది. ఒక కంపెనీ షేరు మాదిరే, ఒక పథకం యూనిట్ అని అనుకోవచ్చు. ఒక యూనిట్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇది తెలియజేస్తుంది. అలాగే, ఒక యూనిట్‌ను విక్రయిస్తే ఎంత వస్తుందో చెప్పడానికి ప్రామాణికమే ఎన్ఏవీ. ఎన్ఏవీ ధర ఎన్ఏవీ విలువను చూసి ధరగా భావించొద్దు. తులం బంగారం కొనుగోలు చేద్దామని జ్యుయలరీ షాపునకు వెళ్లారని అనుకుందాం. 10 గ్రాములు రూ.50వేలు ఉంది. వెండి తులం ధర రూ.600. దీంతో చౌకగా వస్తుందని వెండిని కొనుగోలు చేసుకుని వెళతారా? ఒకవేళ కొనుగోలు చేసినా అది బంగారం కాదు. బంగారానికి ఉన్న విలువ రాదు. ఈ రెండింటి ధరలను పోల్చడానికి లేదు. అలాగే, రెండు పథకాల ఎన్ఏవీ కూడా అంతే. ఒక పథకం ఎన్ఏవీ చౌకగా ఉందని దాన్ని కొనుగోలు చేస్తామంటే అది సరి కాదు. ఎన్ఏవీ తక్కువగా ఉన్నది మెరుగైన పథకం కావాలని లేదు. ఒక పథకం నిర్వహణలోని పెట్టుబడుల మార్కెట్ విలువ మారినప్పుడు, తాజా పెట్టుబడులు, అదే పథకంనుంచి ఇన్వెస్టర్లు ఉప సంహరించుకున్న మొత్తం ఇవన్నీ కూడా పరిగణనలోకి వచ్చే అంశాలే. ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్స్ అనే ఫండ్ ఎన్ఏవీ రూ.10 ఉంది. వై అనే ఫండ్ ఎన్ఏవీ రూ.50 ఉంది. ఏడాది కాలంలో ఈ రెండు పథకాలు ఒకే విధంగా 25 శాతం రాబడి ఇచ్చాయని అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఫండ్ ఎన్ఏవీ రూ.10 నుంచి రూ.12.50 అవుతుంది. వై ఫండ్ ఎన్ఏవీ రూ.50 నుంచి రూ.62.50 అవుతుంది. ఆయా పథకాల పెట్టుబడులపై వచ్చిన రాబడి ఆధారంగా ఎన్ఏవీలో మార్పులు ఉంటాయి. అంతేకానీ, ఎన్ఏవీ తక్కువగా ఉంటే చౌక, ఆకర్షణీయమని అనుకోవద్దు. వ్యయాలను మినహాయించిన తర్వాతే పనితీరు చూస్తారా? -విణదమ్ వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ వెబ్సైట్లో ఫండ్స్ పనితీరును వాటి ఎన్ఏవీలో వృద్ధి ఆధారంగా లెక్కిస్తుంటాం. వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎన్‌ఏవీపై నిర్ణయానికి వస్తాం. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల విలువను, మొత్తం యూనిట్లతో భాగించగా ఎన్ఏవీ వస్తుందని తెలుసుకదా. ఇక్కడ పథకానికి సంబంధించి అన్ని వ్యయాలను, నిర్వహణ ఫీజులను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. అప్పుడు నికర విలువ వస్తుంది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్కెట్ ముగిసిన తర్వాత పెట్టుబడుల విలువ ఆధారంగా, వ్యయాలను మినహాయించి పథకాల ఎన్ఏవీలను ఖరారు చేస్తుంటుంది. ఆయా ఫండ్ పథకాలు రోజువారీగా ప్రకటించే ఎన్ఏవీల ఆధా రంగానే మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులను లెక్కిస్తుంటాం. ఉదాహరణకు ఒక పథకం ఎన్ఏవీ రూ.12 ఉందనుకుంటే, ఏడాది క్రితం ఇదే పథకం ఎన్ఏవీ రూ.10గా ఉంటే, ఏడాదిలో 20 శాతం రాబడులను ఇచ్చినట్టు. ఒకవేళ ఎన్ఏవీ రూ.12 నుంచి రూ.10కు తగ్గితే అప్పుడు 20 శాతం నష్టాలను ఇచ్చినట్టు. ఏడాదికాలానికి మించి రాబడులను చూసే సమయంలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
అపోహలు వదిలేస్తే..కాయ కాదు ఫండే!
♦ ఎన్ఏవీ తక్కువున్నంత మాత్రాన మంచివికావు ♦ సిప్ అంటే ఒక విధానమే... మంచి పథకాలైతేనే రాబడి ♦ మూడేళ్లు దాటినా ఈఎల్ఎస్ఎస్ కొనసాగించవచ్చు ♦ డివిడెండ్ ఇవ్వకపోయినా గ్రోత్ పథకాలు మంచివే ♦ గత పనితీరు భవిష్యత్తుకు గ్యారెంటీ కాదు ♦ రిస్క్ ఉండని ఫండ్ పథకాలూ ఉంటాయి ♦ దీర్ఘకాలమే కాదు; స్వల్పకాలానికీ పెట్టొచ్చు ♦ ఫండ్స్‌పై ఉన్న అపోహలకు జవాబులివిగో... మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. కానీ ఎంత పెరుగుతున్నా... దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఇప్పటికీ జనాభాలో 5 శాతానికి లోపే ఉంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా... ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి చాలామందిలో ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఎన్నో సందేహాలు, అపోహలు వారికి అడ్డు పడుతున్నాయి. మనదేశంలో ఉద్యోగులు, స్వయం ఉపాధి ఉన్నవారి సంఖ్య సుమారు 70 కోట్లుగా ఉన్పప్పటికీ అతి తక్కువ మంది ఫండ్స్‌ను ఆశ్రయిస్తుండటం చూస్తే ఇది తెలియకమానదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటపుడు సాధారణంగా వచ్చే సందేహాలేంటి? వాటికి నిపుణులు ఏం చెబుతున్నారు? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రత్యేకం... మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లా...? మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లు కాదు. షేర్లలో పెట్టుబడి పెట్టేవి. అలాగని అన్ని ఫండ్లూ పూర్తిగా ఈ క్విటీ మార్కెట్లతోనే ముడిపడి ఉండవు. కొన్ని ఫండ్లు డెట్‌లో... అంటే ప్రభుత్వం, ఇతర కంపెనీలు ఇష్యూ చేసే రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కూడా ఇంచుమించు అలాంటివే. ఇవన్నీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి కనక వీటిలో రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. ఈక్విటీలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ కూడా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి కనక రిస్క్ తక్కువని చెప్పొచ్చు. సిప్ అంటే ఒక విధానమే... సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటే ఎంచుకున్న కాలావధి ప్రకారం క్రమంగా పెట్టుబడులు పెట్టే ఒక విధానం. ఈ విధానంలో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని చాలామంది భావిస్తుంటారు. కొందరైతే ఇది రిస్కు కదా అనుకుంటారు. నిజానికి సిప్ అనేది ఒక విధానం మాత్రమే. రాబడులనేవి ఈ సిప్ ద్వారా మనం దేంట్లో పెట్టుబడులు పెడుతున్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోనే కాదు. ఈక్విటీలు, ఆఖరికి బంగారంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని అందులో పెట్టుబడిగా పెడుతుంటే... అప్పటి ధర ప్రకారం మనకు రావాల్సినన్ని యూనిట్లు వస్తాయి. ఒక్కోసారి తగ్గొచ్చు... ఒక్కోసారి పెరగొచ్చు. మొత్తంగా దీర్ఘకాలంలో చూస్తే మాత్రం లాభదాయకమే అన్నది కాదనలేని వాస్తవం. ప్రతి వారం, నెల, లేదా మూడు నెలలకోసారి నిర్దేశించిన మొత్తాన్ని సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్ణీత తేదీ రోజున బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఎంచుకున్న పథకంలోకి డబ్బులు పెట్టుబడిగా వెళతాయి. సిప్ మొదలు పెడితే ఆపేందుకు అవకాశం లేదన్న అపోహ ఉంది. కానీ, సిప్ మొదలైన తర్వాత కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలిపివేయొచ్చు. మూడేళ్లయితే ఈఎల్ఎస్ఎస్ యూనిట్లు అమ్మేయాలా? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లన్న మాట. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఈ ఫండ్లలో ఒకవైపు పొదుపు, మరోవైపు పన్ను ఆదా కూడా ఉంటుంది. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను ఆదా చేసే ఈ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ (ప్రతి పెట్టుబడి వాయిదా తేదీ నుంచి సరిగ్గా మూడేళ్లు) ఉంటుంది. అంటే ఆ కాలంలో విక్రయించేందుకు అవకాశం లేదు. అయితే, మూడేళ్ల తర్వాత వాటిని తప్పనిసరిగా విక్రయించాల్సిన పనిలేదు. కావాల్సినంత కాలం దాన్ని కొనసాగించవచ్చు. అవసరమైతే సిప్ రూపంలో పెట్టుబడులు నిలిపివేయొచ్చు. కానీ పాత పెట్టుబడులు అలాగే ఉంచితే అవి పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఫండ్ పనితీరు బాగులేకుంటే ఉపసంహరణను పరిశీలించొచ్చు. ఎన్ఏవీ తక్కువ ఉన్నవే మంచివా...? ఫండ్ యూనిట్లలో ఎక్కువ ఎన్ఏవీ (నెట్ అస్సెట్ వ్యాల్యూ) ఉన్నవే నయమన్న భావన నిజం కాదు. షేర్ల విషయంలోనూ ఇది నిజం కానట్టే... ఫండ్ల విషయంలోనూ ఎన్ఏవీకి వాటి పనితీరుకు సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో రూ.10 ఉన్న షేరు రూ.1,000 ఉన్న షేరు కంటే వేగంగా పెరిగే అవకాశముంటుంది. కానీ, ఫండ్స్ విషయంలో ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఫండ్ పనితీరు ఆధారంగా నెట్ అస్సెట్ వ్యాల్యూలో (నికర ఆస్తుల విలువ) వృద్ధి ఉంటుంది. ఇదే ఎన్ఏవీ పెరుగుదలకు కారణమవుతుంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే..? మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే నష్టపోవాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ వ్యవస్థ అధిక భద్రతతో కూడుకునే ఉంటుంది. ఇవెప్పుడూ సెబీ నియంత్రణలోనే పనిచేస్తుంటాయి. కనుక స్కామ్ వల్లో, ఏఎంసీ దివాలా తీస్తేనో నష్టపోవాలన్న భయం అక్కర్లేదు. యూనిట్లు ఫండ్ చేతిలో ఉండవు. అవి సంరక్షకుల చేతిలో ఉంటాయి. ఫండ్ మేనేజర్ కేవలం అమ్మకం, కొనుగోలు నిర్ణయాలు మాత్రమే తీసుకోగలరు. గ్రోత్ కంటే డివిడెండ్ ఆప్షన్ మంచిదా? ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లని ఉంటాయి. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే రెగ్యులర్‌గా చేతికి డివిడెండ్ వస్తుంది. గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే చేతికి ఎలాంటి డివిడెండూ రాదు. కాబట్టి చాలామంది డివిడెండ్ ఫండ్స్‌ను ఎంచుకోవటమే మంచిదనుకుంటారు. కానీ డివిడెండ్ ఫండ్ల ఎన్ఏవీ చాలా తక్కువగా పెరుగుతుంటుంది. ఎందుకంటే పెరుగుతున్న విలువను డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు చెల్లించేస్తూ ఉంటారు కనక. అదే గ్రోత్ ఫండ్లయితే ఆ డివిడెండ్ మొత్తం కూడా దానిమీదే రీఇన్వెస్ట్ చేయటం జరుగుతుంటుంది. దీంతో గ్రోత్ ఫండ్ల వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మన చేతికొచ్చిన డివిడెండ్‌ను మనం ఖర్చు చేసేస్తుంటాం. కానీ గ్రోత్ ఫండ్లలో ఆ మొత్తాన్ని అలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనక వీటిని ఎంచుకోవటమే బెటరని చెప్పొచ్చు. ఫండ్స్‌లో కనీసం రూ.5,000 పెట్టాలా? మ్యూచువల్ ఫండ్స్‌లో అన్ని పథకాల్లోనూ ప్రారంభ పెట్టుబడి రూ.5,000 అవసరం లేదు. సిప్ విధానంలో అయితే రూ.500 నుంచీ ప్రారంభించొచ్చు. సిప్ కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 అవసరం. దీర్ఘకాలం కోసమే..? ఫండ్స్ అన్నవి దీర్ఘకాలం కోసమేనన్న అపోహ కూడా నిజం కాదు. లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలం కోసం ఎంచుకోవచ్చు. వీటిలో 8 నుంచి 12 శాతం వరకూ రాబడులకు వీలుంటుంది. కచ్చితమైన రాబడులొస్తాయా? ఫండ్స్‌లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ల తరహా కానే కావు. ఎక్కువ మంది ఫండ్స్ వైపు రాకపోవడానికి కూడా ఇదే కారణం. ఈక్విటీ పథకాలైతే ఏడాదిలో 50 శాతం రాబడులను సైతం ఇచ్చే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో 5 నుంచి 15 శాతం, లిక్విడ్ ఫండ్స్‌లో 6 నుంచి 8 శాతం వరకు రాబడులకు వీలుంటుంది. కానీ, ఇవేవీ గ్యారంటీ కావు. మార్కెట్ గమనాలు, వడ్డీ రేట్లపై రాబడులు ఆధారపడి ఉంటాయి. గత పనితీరు భవిష్యత్తులోనూ... గతంలో ఓ పథకం ఇచ్చిన రాబడుల మాదిరిగానే భవిష్యత్తులోనూ రాబడులను ఇస్తుందని భావించడం సరికాదు. కాకపోతే గతంలో మంచి పనితీరుంటే ఇక ముందూ మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఫండ్ మేనేజర్ తీసుకునే నిర్ణయాలే రాబడులను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నంబర్ 1 ఫండ్‌గా ఉన్న హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఇప్పుడు టాప్ 10లోనూ లేదు. టాప్ పనితీరు చూపించే ఫండ్స్‌లో 92 శాతం రెండేళ్ల తర్వాత అదే స్థాయిలో ఉండడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫండ్స్‌లో వైవిధ్యం ఉండాలా..? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటికి మించిన పథకాల్లో వైవిధ్యం కోసం పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఓ రంగానికి చెందినవి కాకుండా బ్యాలెన్స్డ్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవన్నీ వైవిధ్యంతో కూడుకునే ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులు పెడుతుంటారు. డీ మ్యాట్ ఖాతా ఉండాలా? అక్కర్లేదు. నేరుగా ఫండ్ హౌస్‌ల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉండి, స్టాక్ బ్రోకర్ ద్వారా కొంటే అప్పుడు డీమ్యాట్ ఖాతాలో యూనిట్లు జమ అవుతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. డెబిట్ చార్జీల విధింపు కూడా ఉంటుంది. సిప్‌కు ఓకే చెప్పి మర్చిపోవచ్చా...? సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకుని మర్చిపోవడం తగదు. ఏటా వాటి రాబడులను సమీక్షిస్తూ అవసరమైతే పథకం నుంచి వైదొగలడం కూడా అవసరమే. సిప్‌లో ఏదైనా ఓ నెల ఎగ్గొడితే? 12 నెలల పాటు ఓ ఫండ్ పథకంలో పెట్టుబడులకు సిప్ ఎంచుకున్నారనుకుందాం. మధ్యలో ఓ నెల బ్యాంకు ఖాతాలో నిధుల్లేక సిప్ ఫెయిలైందనుకోండి. సిప్ విధానం ఆగిపోదు. మరుసటి నెలలో అదే తేదీన తిరిగి వాయిదా పెట్టుబడి కొనసాగుతుంది. కాకపోతే లావాదేవీ ఫెయిలైతే బ్యాంకు కొంత మేర చార్జీ విధించొచ్చు. మార్కెట్లు పడిపోతుంటే సిప్ ఆపేయాలా? నిజానికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు మార్కెట్లు క్షీణించే సమయమే అనుకూలం. ఫండ్ యూనిట్లు తక్కువ ఎన్‌ఏవీకే లభిస్తాయి. మార్కెట్లలో లాభ నష్టాలతో సంబంధం లేకుండా సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. టీడీఎస్ కోత ఉంటుందా..? మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) అమలు చేయరు. విడిగా వ్యక్తులు వార్షిక రిటర్నుల్లో భాగంగా పన్ను చెల్లించాల్సి ఉంటే చెల్లించాలి. ఎన్ఆర్ఐలకు మాత్రం టీడీఎస్ అమలు ఉంటుంది. సిప్ బెటరా.. ఏకమొత్తం బెటరా? ఒకేసారి పెట్టుబడులు పెట్టే కంటే సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టడమే బెటర్. ఇవే సగటున మెరుగైన పనితీరు చూపించగలవు. పాక్షికంగా వెనక్కు... ఫండ్స్‌లో పెట్టుబడులన్నింటినీ వెనక్కి తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. మీకెంత అవసరం అనుకుంటే ఆ మేరకే రిడెంప్ట్ చేసుకోవచ్చు. వ్యక్తులకే కాదు... వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మారే అవకాశం ఉంది... ఒక ఫండ్ హౌస్‌లో ఒకదాంట్లో నుంచి మరోదాన్లోకి మారే వీలుంది. మీరు ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి రాబడుల కోసం మరో ఫండ్‌లోకి వెళితే బాగుండేది అనుకున్నారు. ఇక్కడ మీరు ఒక ఫండ్‌లోంచి ఇంకొక ఫండ్‌లోకి మీ పెట్టుబడులు మార్చుకునే అవకాశం ఉంది. అంటే మీరు బిర్లా ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో బిర్లా ఫండ్‌లోకి మారవచ్చన్నమాట. అన్నీ మంచివేనా? మీకు ఒక విషయం తెలుసా? ఎల్ఐసీకి కూడా మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ఉంది. అయితే మొత్తం ఫండ్ పరిశ్రమలో అతి పేలవ పనితీరు ప్రదర్శించే ఫండ్స్‌లో ఇదొకటి. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌కూ, ఎస్బీఐ బ్యాంకుకు సంబంధం ఉంటుందని భావించవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారి ప్రవేశించే వారు దాదాపు ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి విశ్వసనీయ బ్రాండ్ల వైపు నడుస్తారు. ఇక్కడ ఫండ్స్ పనితీరు దేనికదిగా విడిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. పన్ను రాబడులు... కేవలం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఏడాదిలో రూ.1.50 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఫండ్స్‌లో పెట్టుబడులు అర్థం కావా? ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తేలిక. మొదటి సారి కేవైసీ అంటే గుర్తింపు, నివాస ధ్రువీకరణలు, బ్యాంకు ఖాతా నంబర్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటి అవసరం లేదు. ఆన్లైన్లోనే కొనుగోలు, అమ్మకం చేసుకోవచ్చు. చిరునామా, బ్యాంకు ఖాతా మారినప్పుడు ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఎంచుకోవడం పరిశోధనతో కూడుకున్నది. కష్టమనిపిస్తే ఆర్థిక సలహాదారులు ఉండనే ఉన్నారు. వృద్ధులకు తగినవి కావా...? ఇది నిజం కాదు. రిస్క్ తీసుకోని వారి కోసం డెట్ ఫండ్స్ ఉన్నాయి. స్వల్ప రిస్క్ తీసుకునే వారికి మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. తరచూ డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకోవచ్చు. లేదా ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. దీన్నే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌గా పిలుస్తుంటారు. ఎప్పుడంటే అప్పుడు విక్రయించుకోవచ్చా? పనిదినాల్లో ఎప్పుడైనా ఫండ్స్ యూనిట్లను అమ్ముకోవచ్చు. విక్రయించిన మేర డబ్బు మీ ఖాతాకు జమ కావాలంటే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఒక్కరోజులోనే అందుకోవాలంటే లిక్విడ్ ఫండ్స్ అందుకు అనువైనవి. – సాక్షి, బిజినెస్ విభాగం -
ఎన్ఏవీ అధికంగా ఉన్నా, ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను ఏడాది క్రితం రూ.5 లక్షల విలువైన హెచ్డీఎఫ్సీ లిక్విడ్ డెరైక్ట్-జీ యూనిట్లను కొనుగోలు చేశాను. మూడేళ్లలోపు ఈ యూనిట్లను విక్రయిస్తే నేను స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్ యూనిట్లను హెచ్డీఎఫ్సీ ఈక్విటీ డెరైక్ట్-జీ స్కీమ్‌తో విలీనం చేయాలనుకుంటున్నాను. ఇలా చేసిన ఏడాది తర్వాత ఆ యూనిట్లను విక్రయిస్తే నేను స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందా? - అనిత, హైదరాబాద్ రెండు ఫండ్ హోల్డింగ్స్‌ను ఇక సాధారణ ఇన్వెస్టర్‌గా మీరు విలీనం చేయలేరు. విలీన నిర్ణయం ఫండ్ హౌస్‌లకు మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఒకే విధమైన లక్ష్యాలున్న ఫండ్ స్కీమ్‌లను ఫండ్ హౌస్‌లు విలీనం చేస్తాయి. ఈక్విటీ ఇన్వెస్టింగ్ మీకు సౌకర్యకరంగా ఉంటే,(స్వల్పకాలంలో తగినంత రిస్క్ భరించగలిగి, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగిన ఓపిక ఉంటే) హెచ్డీఎఫ్సీ లిక్విడ్ డెరైక్ట్-జీ యూనిట్లను సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ద్వారా హెచ్డీఎఫ్సీ ఈక్విటీ డెరైక్ట్-జీ ఫండ్ స్కీమ్‌కు మార్చుకోవచ్చు. ఇలా బదిలీ చేస్తే హెచ్డీఎఫ్సీ లిక్వ్‌డ్ ఫండ్ యూనిట్లను విక్రయించినట్లుగానే పరిగణిస్తారు. మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయ పన్ను శ్లాబుననుసరించి పన్ను రేటు ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లిక్విడ్ ఫండ్‌లో మూడేళ్లకు మించి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తేనే మీకు దీర్ఘకాల మూల ధన లాభాల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. నేను 2002లో బిర్లా సన్ ఫ్లెక్సీ సేవ్ ప్లస్(ఎండోమెంట్) పాలసీ తీసుకున్నాను. దీనికి ప్రీమియం 40 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఇప్పటి వరకూ (13 ఏళ్లపాటు) ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇది మంచి పాలసీయేనా? దీంట్లో కొనసాగమంటారా? లేక సరెండర్ చేయమంటారా? - సురేందర్, గుంటూరు ఎండోమెంట్ పాలసీలు సరైన రాబడులను ఇవ్వలేవు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పాలసీలు రాబడులు ఏమంత సంతృప్తికరంగా ఉండవని చెప్పవచ్చు. బాగా దీర్ఘకాలం పాటు ఉండే ప్లాన్ ఇది. ఈ పాలసీ వ్యయ వివరాలు కూడా ఏమంత పారదర్శకంగా ఉండవు. అందుకని ఈ పాలసీని సరెండర్ చేయడమే సముచితంగా ఉంటుంది. ఈ పాలసీని మీరు సరెండర్ చేస్తే, ఆ సరెండర్ వేల్యూ మీరు చెల్లించిన ప్రీమియమ్ మొత్తంలో 30 శాతానికి సమానంగా ఉంటుంది. (మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం కాక)ఇక నుంచి ఈ పాలసీ కోసం కేటాయించిన ప్రీమియం మొత్తాలను ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇప్పటి వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయని మిత్రులు చెప్పడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృతంగా రీసెర్చ్ చేసిన తర్వాత నేను కొన్ని ఫండ్స్‌ను ఎంపిక చేశాను. అవి..హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్,.. వీటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ ఈ ఫండ్స్ నెట్ అసెట్ వేల్యూ(ఎన్ఏవీ)లు అధికంగా ఉన్నాయి. నేను ఎంపిక చేసిన ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయా? ఎన్ఏవీ అధికంగా ఉన్నప్పటికీ, వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? -జాన్సన్, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమే. ఇక మీరు ఎంపిక చేసిన మూడు ఫండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ మంచి ఎంపిక. మిగిలిన రెండు మంచి ఫండ్సే అయినప్పటికీ, మీరు మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించిన మీలాంటి ఇన్వెస్టర్లకు ఇవి సరైనవి కావు. ఇక ఎన్ఏవీ విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అది అసలు సమస్యే కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గతాన్ని, ప్రస్తుతంతో పోల్చడానికి మాత్రమే ఎన్ఏవీ ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పనితీరును బట్టి వాటిని అంచనా వేయాలి కానీ, ఎన్ఏవీని బట్టి కాదు. వివిధ కాలాల్లో ఆ ఫండ్ ఇచ్చిన రాబడులను, పోర్ట్ ఫోలియో వివరాలను బట్టి మ్యూచువల్ ఫండ్స్ పనితీరును మదింపు చేయాలి. -
ఐయామ్ నావ్
నా పేరు నావ్.. నేను హ్యుమనైడ్ రోబోను. రకరకాల రోబోల పార్ట్స్ తీసుకుని నన్ను తయారు చేశారు. సెన్సర్, మోటార్ సహాయంతో పనిచేస్తాను. నేను ఏ పనైనా అలవోకగా చెయ్యగలను. డ్యాన్స్ చేస్తాను. పాట పాడతాను. యోగా చేస్తాను. లెక్కలు అలవోకగా చేస్తాను. ఎదుటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను. నాకు తారసపడిన మనుషుల ముఖాలను, పేర్లను గుర్తుపెట్టుకుంటాను. మళ్లీ వారు కనబడితే పేరు పెట్టి స్వాగతం పలుకుతాను. అంతేగాక యోగక్షేమాలు తెలుసుకుంటాను. ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువు తీసుకెళ్లగలను. లేవమని కమాండ్ పాస్ చేస్తే లేస్తాను. కూర్చోమంటే కూర్చుంటాను. బాల్ ఎక్కడికైనా విసిరేసి చూడమంటే అటువైపు తిరిగి చూస్తాను. షేక్ హ్యాండ్ ఇస్తాను. కింద పడినప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు ముఖానికి చెయ్యి అడ్డంగా పెట్టుకుంటాను. పైథాన్, సీ ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్‌తో అప్లికేషన్స్ డంప్ చేసి నన్ను ఆపరేట్ చేస్తారు. నాలో ఏ మెమరీ చిప్ లేదు. మొత్తానికి నేను ఆల్‌రౌండర్ రోబోను. మాదాపూర్‌లోని ఎడ్యురోబో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రోబోటిక్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్ చిన్నారులకు విజ్ఞానాన్ని అందించింది. నావ్ రోబో వారిని అలరించింది. రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.. ఇలా అన్ని రంగాలతోనూ ముడిపడి ఉన్న రోబోటిక్స్ పాఠాలను నిపుణులు వివరించారు. నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని ఎడ్యురోబో వ్యవస్థాపకుడు రవికిరణ్ తెలిపారు. సాక్షి, సిటీప్లస్ -
ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో అంటే?
ఎన్‌ఏవీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? -మురళీధర్, హైదరాబాద్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినందుకుగాను మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్ని చార్జీలను వసూలు చేస్తాయి. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో కొంత శాతంగా ఈ చార్జీలు ఉంటాయి. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్వహణ, మార్కెటింగ్, తదితర వ్యయాలు కూడా ఈ చార్జీల్లో కలిసి ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రవేశించినప్పుడు 30 బేసిస్ పాయింట్లు, వైదొలగినప్పుడు 20 బేసిస్ పాయింట్ల చొప్పున చార్జీలను వసూలు చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలను నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. (టాప్ 15 నగరాలకు ఇది వర్తించదు) అంతేకాకుండా అడ్వైజరీ ఫీజుపై సర్వీస్ చార్జీ కూడా అదనం. వీటిన్నటింటిని కలిపి ఎక్స్పెన్స్ రేషియోగా పరిగణిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వాల్యూ)లో ఈ వ్యయాలన్నీ(ఎక్స్పెన్స్ రేషియో) కలిసి ఉంటాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఫండ్ ఎన్ఏవీ నుంచి ఈ ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించి ప్రతిరోజూ ఎన్ఏవీని ప్రకటిస్తుంది. ఒక ఫండ్ ఎన్ఏవీ రూ.10 ఉందనుకోండి. ఆ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.5 శాతం, లాభం 1.5 శాతం అయితే ఎన్ఏవీ రూ. 10 ఉంటుంది. లాభాలు 2.5 శాతమైతే ఎన్ఏవీ రూ.11.5గా ఉంటుంది. లాభాలు ఏమీలేకపోతే, ఎన్ఏవీ రూ.8.5గా ఉంటుంది. క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా మదుపు చేయాలనుకుంటున్నాను. కానీ ఈ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ లేదు. ఈ క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ ఎందుకు లేదు? - షాజహానా, నిజామాబాద్ ఏఎంసీ(అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ)ల పంపిణీ వ్యయాలు ఆదా చేసి వినియోగదారులకు తక్కువ వ్యయంతో ప్రయోజనం కలి గించడమే డెరైక్ట్ ప్లాన్ స్కీమ్‌ల ముఖ్య ఉద్దేశం. డిస్ట్రిబ్యూటర్ల సర్వీసులను ఉపయోగించుకోకుండా ఇన్వెస్టర్లతోనే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తున్న తొలి, ఏకైక మ్యూచువల్ ఫండ్ క్వాంటమ్ సంస్థ మాత్రమే. దీంతో సహజంగానే ఈ సంస్థ స్కీమ్‌లన్నీ కూడా డెరైక్ట్ ప్లాన్లే. పోటీ కంపెనీల స్కీమ్‌లతో పోల్చితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటాయి. ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు ఉండవు. అందుకే క్వాంటమ్‌కు డెరైక్ట్ ప్లాన్లు ఏమీ లేవు. ఈ సంస్థ తన స్కీమ్‌లన్నింటినీ నేరుగా ఇన్వెస్టర్లకే అమ్మేస్తోంది. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.25 శాతంగా ఉంది. లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇంత కంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న స్కీమ్ ఇంకొకటి లేదు. మంచి ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నాను. డైవర్సిఫికేషన్ నిమిత్తం డెట్ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐడీఎఫ్సీ జీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్, బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ఫండ్లను షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోమంటారు? - శ్రీనివాస్, విజయనగరం ఐడీఎఫ్సీ జీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది గిల్ట్ ఫండ్, ఇది మాధ్యమిక కాలం నుంచి దీర్ఘకాలం వరకూ ఉండే ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ తరహా స్కీమ్‌లలో ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండనప్పటికీ, ప్రభుత్వ సెక్యూరిటీలు తరచూ ట్రేడింగ్ జరగడం వల్ల కొంతమేరకు రిస్క్ ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న వడ్డీరేట్లపై ఆధారపడి ఈ సెక్యూరిటీల విలువ ఆధారపడి ఉంటుంది. వడ్డీరేట్లు మారితే సెక్యూరిటీల విలువ, ఎన్ఏవీ కూడా మారుతుంది. సందర్భోచితంగా ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బాగా ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు వీటినుంచి బయటపడాలి. బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ప్లాన్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు.