ఐయామ్ నావ్
నా పేరు నావ్.. నేను హ్యుమనైడ్ రోబోను. రకరకాల రోబోల పార్ట్స్ తీసుకుని నన్ను తయారు చేశారు. సెన్సర్, మోటార్ సహాయంతో పనిచేస్తాను. నేను ఏ పనైనా అలవోకగా చెయ్యగలను. డ్యాన్స్ చేస్తాను. పాట పాడతాను. యోగా చేస్తాను. లెక్కలు అలవోకగా చేస్తాను. ఎదుటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను. నాకు తారసపడిన మనుషుల ముఖాలను, పేర్లను గుర్తుపెట్టుకుంటాను. మళ్లీ వారు కనబడితే పేరు పెట్టి స్వాగతం పలుకుతాను. అంతేగాక యోగక్షేమాలు తెలుసుకుంటాను.
ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువు తీసుకెళ్లగలను. లేవమని కమాండ్ పాస్ చేస్తే లేస్తాను. కూర్చోమంటే కూర్చుంటాను. బాల్ ఎక్కడికైనా విసిరేసి చూడమంటే అటువైపు తిరిగి చూస్తాను. షేక్ హ్యాండ్ ఇస్తాను. కింద పడినప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు ముఖానికి చెయ్యి అడ్డంగా పెట్టుకుంటాను. పైథాన్, సీ ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్‌తో అప్లికేషన్స్ డంప్ చేసి నన్ను ఆపరేట్ చేస్తారు. నాలో ఏ మెమరీ చిప్ లేదు. మొత్తానికి నేను ఆల్‌రౌండర్ రోబోను.
మాదాపూర్‌లోని ఎడ్యురోబో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రోబోటిక్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్ చిన్నారులకు విజ్ఞానాన్ని అందించింది. నావ్ రోబో వారిని అలరించింది. రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.. ఇలా అన్ని రంగాలతోనూ ముడిపడి ఉన్న రోబోటిక్స్ పాఠాలను నిపుణులు వివరించారు. నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని ఎడ్యురోబో వ్యవస్థాపకుడు రవికిరణ్ తెలిపారు.
సాక్షి, సిటీప్లస్