అపోహలు వదిలేస్తే..కాయ కాదు ఫండే!
♦ ఎన్‌ఏవీ తక్కువున్నంత మాత్రాన మంచివికావు
♦ సిప్ అంటే ఒక విధానమే... మంచి పథకాలైతేనే రాబడి
♦ మూడేళ్లు దాటినా ఈఎల్‌ఎస్‌ఎస్ కొనసాగించవచ్చు
♦ డివిడెండ్ ఇవ్వకపోయినా గ్రోత్ పథకాలు మంచివే
♦ గత పనితీరు భవిష్యత్తుకు గ్యారెంటీ కాదు
♦ రిస్క్ ఉండని ఫండ్ పథకాలూ ఉంటాయి
♦ దీర్ఘకాలమే కాదు; స్వల్పకాలానికీ పెట్టొచ్చు
♦ ఫండ్స్‌పై ఉన్న అపోహలకు జవాబులివిగో...
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. కానీ ఎంత పెరుగుతున్నా... దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఇప్పటికీ జనాభాలో 5 శాతానికి లోపే ఉంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా... ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి చాలామందిలో ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఎన్నో సందేహాలు, అపోహలు వారికి అడ్డు పడుతున్నాయి. మనదేశంలో ఉద్యోగులు, స్వయం ఉపాధి ఉన్నవారి సంఖ్య సుమారు 70 కోట్లుగా ఉన్పప్పటికీ అతి తక్కువ మంది ఫండ్స్‌ను ఆశ్రయిస్తుండటం చూస్తే ఇది తెలియకమానదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటపుడు సాధారణంగా వచ్చే సందేహాలేంటి? వాటికి నిపుణులు ఏం చెబుతున్నారు? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రత్యేకం...
మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లా...?
మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లు కాదు. షేర్లలో పెట్టుబడి పెట్టేవి. అలాగని అన్ని ఫండ్లూ పూర్తిగా ఈ క్విటీ మార్కెట్లతోనే ముడిపడి ఉండవు. కొన్ని ఫండ్లు డెట్‌లో... అంటే ప్రభుత్వం, ఇతర కంపెనీలు ఇష్యూ చేసే రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కూడా ఇంచుమించు అలాంటివే. ఇవన్నీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి కనక వీటిలో రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. ఈక్విటీలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ కూడా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి కనక రిస్క్ తక్కువని చెప్పొచ్చు.
సిప్ అంటే ఒక విధానమే...
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) అంటే ఎంచుకున్న కాలావధి ప్రకారం క్రమంగా పెట్టుబడులు పెట్టే ఒక విధానం. ఈ విధానంలో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని చాలామంది భావిస్తుంటారు. కొందరైతే ఇది రిస్కు కదా అనుకుంటారు. నిజానికి సిప్ అనేది ఒక విధానం మాత్రమే. రాబడులనేవి ఈ సిప్ ద్వారా మనం దేంట్లో పెట్టుబడులు పెడుతున్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోనే కాదు. ఈక్విటీలు, ఆఖరికి బంగారంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని అందులో పెట్టుబడిగా పెడుతుంటే... అప్పటి ధర ప్రకారం మనకు రావాల్సినన్ని యూనిట్లు వస్తాయి.
ఒక్కోసారి తగ్గొచ్చు... ఒక్కోసారి పెరగొచ్చు. మొత్తంగా దీర్ఘకాలంలో చూస్తే మాత్రం లాభదాయకమే అన్నది కాదనలేని వాస్తవం. ప్రతి వారం, నెల, లేదా మూడు నెలలకోసారి నిర్దేశించిన మొత్తాన్ని సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్ణీత తేదీ రోజున బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఎంచుకున్న పథకంలోకి డబ్బులు పెట్టుబడిగా వెళతాయి. సిప్ మొదలు పెడితే ఆపేందుకు అవకాశం లేదన్న అపోహ ఉంది. కానీ, సిప్ మొదలైన తర్వాత కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలిపివేయొచ్చు.
మూడేళ్లయితే ఈఎల్‌ఎస్‌ఎస్ యూనిట్లు అమ్మేయాలా?
ఈఎల్‌ఎస్‌ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లన్న మాట. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఈ ఫండ్లలో ఒకవైపు పొదుపు, మరోవైపు పన్ను ఆదా కూడా ఉంటుంది. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను ఆదా చేసే ఈ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ (ప్రతి పెట్టుబడి వాయిదా తేదీ నుంచి సరిగ్గా మూడేళ్లు) ఉంటుంది. అంటే ఆ కాలంలో విక్రయించేందుకు అవకాశం లేదు. అయితే, మూడేళ్ల తర్వాత వాటిని తప్పనిసరిగా విక్రయించాల్సిన పనిలేదు. కావాల్సినంత కాలం దాన్ని కొనసాగించవచ్చు. అవసరమైతే సిప్ రూపంలో పెట్టుబడులు నిలిపివేయొచ్చు. కానీ పాత పెట్టుబడులు అలాగే ఉంచితే అవి పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఫండ్ పనితీరు బాగులేకుంటే ఉపసంహరణను పరిశీలించొచ్చు.
ఎన్‌ఏవీ తక్కువ ఉన్నవే మంచివా...?
ఫండ్ యూనిట్లలో ఎక్కువ ఎన్‌ఏవీ (నెట్ అస్సెట్ వ్యాల్యూ) ఉన్నవే నయమన్న భావన నిజం కాదు. షేర్ల విషయంలోనూ ఇది నిజం కానట్టే... ఫండ్ల విషయంలోనూ ఎన్‌ఏవీకి వాటి పనితీరుకు సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో రూ.10 ఉన్న షేరు రూ.1,000 ఉన్న షేరు కంటే వేగంగా పెరిగే అవకాశముంటుంది. కానీ, ఫండ్స్ విషయంలో ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఫండ్ పనితీరు ఆధారంగా నెట్ అస్సెట్ వ్యాల్యూలో (నికర ఆస్తుల విలువ) వృద్ధి ఉంటుంది. ఇదే ఎన్‌ఏవీ పెరుగుదలకు కారణమవుతుంటుంది.
మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే..?
మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే నష్టపోవాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ వ్యవస్థ అధిక భద్రతతో కూడుకునే ఉంటుంది. ఇవెప్పుడూ సెబీ నియంత్రణలోనే పనిచేస్తుంటాయి. కనుక స్కామ్ వల్లో, ఏఎంసీ దివాలా తీస్తేనో నష్టపోవాలన్న భయం అక్కర్లేదు. యూనిట్లు ఫండ్ చేతిలో ఉండవు. అవి సంరక్షకుల చేతిలో ఉంటాయి. ఫండ్ మేనేజర్ కేవలం అమ్మకం, కొనుగోలు నిర్ణయాలు మాత్రమే తీసుకోగలరు.
గ్రోత్ కంటే డివిడెండ్ ఆప్షన్ మంచిదా?
ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లని ఉంటాయి. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే రెగ్యులర్‌గా చేతికి డివిడెండ్ వస్తుంది. గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే చేతికి ఎలాంటి డివిడెండూ రాదు. కాబట్టి చాలామంది డివిడెండ్ ఫండ్స్‌ను ఎంచుకోవటమే మంచిదనుకుంటారు. కానీ డివిడెండ్ ఫండ్ల ఎన్‌ఏవీ చాలా తక్కువగా పెరుగుతుంటుంది. ఎందుకంటే పెరుగుతున్న విలువను డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు చెల్లించేస్తూ ఉంటారు కనక. అదే గ్రోత్ ఫండ్లయితే ఆ డివిడెండ్ మొత్తం కూడా దానిమీదే రీఇన్వెస్ట్ చేయటం జరుగుతుంటుంది. దీంతో గ్రోత్ ఫండ్ల వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మన చేతికొచ్చిన డివిడెండ్‌ను మనం ఖర్చు చేసేస్తుంటాం. కానీ గ్రోత్ ఫండ్లలో ఆ మొత్తాన్ని అలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనక వీటిని ఎంచుకోవటమే బెటరని చెప్పొచ్చు.
ఫండ్స్‌లో కనీసం రూ.5,000 పెట్టాలా?
మ్యూచువల్ ఫండ్స్‌లో అన్ని పథకాల్లోనూ ప్రారంభ పెట్టుబడి రూ.5,000 అవసరం లేదు. సిప్ విధానంలో అయితే రూ.500 నుంచీ ప్రారంభించొచ్చు. సిప్ కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 అవసరం.
దీర్ఘకాలం కోసమే..?
ఫండ్స్ అన్నవి దీర్ఘకాలం కోసమేనన్న అపోహ కూడా నిజం కాదు. లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలం కోసం ఎంచుకోవచ్చు. వీటిలో 8 నుంచి 12 శాతం వరకూ రాబడులకు వీలుంటుంది.
కచ్చితమైన రాబడులొస్తాయా?
ఫండ్స్‌లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. ఇవి ఫిక్స్‌డ్ డిపాజిట్ల తరహా కానే కావు. ఎక్కువ మంది ఫండ్స్ వైపు రాకపోవడానికి కూడా ఇదే కారణం. ఈక్విటీ పథకాలైతే ఏడాదిలో 50 శాతం రాబడులను సైతం ఇచ్చే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో 5 నుంచి 15 శాతం, లిక్విడ్ ఫండ్స్‌లో 6 నుంచి 8 శాతం వరకు రాబడులకు వీలుంటుంది. కానీ, ఇవేవీ గ్యారంటీ కావు. మార్కెట్ గమనాలు, వడ్డీ రేట్లపై రాబడులు ఆధారపడి ఉంటాయి.
గత పనితీరు భవిష్యత్తులోనూ...
గతంలో ఓ పథకం ఇచ్చిన రాబడుల మాదిరిగానే భవిష్యత్తులోనూ రాబడులను ఇస్తుందని భావించడం సరికాదు. కాకపోతే గతంలో మంచి పనితీరుంటే ఇక ముందూ మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఫండ్ మేనేజర్ తీసుకునే నిర్ణయాలే రాబడులను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నంబర్ 1 ఫండ్‌గా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఇప్పుడు టాప్ 10లోనూ లేదు. టాప్ పనితీరు చూపించే ఫండ్స్‌లో 92 శాతం రెండేళ్ల తర్వాత అదే స్థాయిలో ఉండడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ఫండ్స్‌లో వైవిధ్యం ఉండాలా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటికి మించిన పథకాల్లో వైవిధ్యం కోసం పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఓ రంగానికి చెందినవి కాకుండా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవన్నీ వైవిధ్యంతో కూడుకునే ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులు పెడుతుంటారు.
డీ మ్యాట్ ఖాతా ఉండాలా?
అక్కర్లేదు. నేరుగా ఫండ్ హౌస్‌ల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉండి, స్టాక్ బ్రోకర్ ద్వారా కొంటే అప్పుడు డీమ్యాట్ ఖాతాలో యూనిట్లు జమ అవుతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. డెబిట్ చార్జీల విధింపు కూడా ఉంటుంది.
సిప్‌కు ఓకే చెప్పి మర్చిపోవచ్చా...?
సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకుని మర్చిపోవడం తగదు. ఏటా వాటి రాబడులను సమీక్షిస్తూ అవసరమైతే పథకం నుంచి వైదొగలడం కూడా అవసరమే.
సిప్‌లో ఏదైనా ఓ నెల ఎగ్గొడితే?
12 నెలల పాటు ఓ ఫండ్ పథకంలో పెట్టుబడులకు సిప్ ఎంచుకున్నారనుకుందాం. మధ్యలో ఓ నెల బ్యాంకు ఖాతాలో నిధుల్లేక సిప్ ఫెయిలైందనుకోండి. సిప్ విధానం ఆగిపోదు. మరుసటి నెలలో అదే తేదీన తిరిగి వాయిదా పెట్టుబడి కొనసాగుతుంది. కాకపోతే లావాదేవీ ఫెయిలైతే బ్యాంకు కొంత మేర చార్జీ విధించొచ్చు.
మార్కెట్లు పడిపోతుంటే సిప్ ఆపేయాలా?
నిజానికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు మార్కెట్లు క్షీణించే సమయమే అనుకూలం. ఫండ్ యూనిట్లు తక్కువ ఎన్‌ఏవీకే లభిస్తాయి. మార్కెట్లలో లాభ నష్టాలతో సంబంధం లేకుండా సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది.
టీడీఎస్ కోత ఉంటుందా..?
మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) అమలు చేయరు. విడిగా వ్యక్తులు వార్షిక రిటర్నుల్లో భాగంగా పన్ను చెల్లించాల్సి ఉంటే చెల్లించాలి. ఎన్‌ఆర్‌ఐలకు మాత్రం టీడీఎస్ అమలు ఉంటుంది.
సిప్ బెటరా.. ఏకమొత్తం బెటరా?
ఒకేసారి పెట్టుబడులు పెట్టే కంటే సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టడమే బెటర్. ఇవే సగటున మెరుగైన పనితీరు చూపించగలవు.
పాక్షికంగా వెనక్కు...
ఫండ్స్‌లో పెట్టుబడులన్నింటినీ వెనక్కి తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. మీకెంత అవసరం అనుకుంటే ఆ మేరకే రిడెంప్ట్ చేసుకోవచ్చు.
వ్యక్తులకే కాదు...
వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు.
మారే అవకాశం ఉంది...
ఒక ఫండ్ హౌస్‌లో ఒకదాంట్లో నుంచి మరోదాన్లోకి మారే వీలుంది. మీరు ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి రాబడుల కోసం మరో ఫండ్‌లోకి వెళితే బాగుండేది అనుకున్నారు. ఇక్కడ మీరు ఒక ఫండ్‌లోంచి ఇంకొక ఫండ్‌లోకి మీ పెట్టుబడులు మార్చుకునే అవకాశం ఉంది. అంటే మీరు బిర్లా ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో బిర్లా ఫండ్‌లోకి మారవచ్చన్నమాట.
అన్నీ మంచివేనా?
మీకు ఒక విషయం తెలుసా? ఎల్‌ఐసీకి కూడా మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ఉంది. అయితే మొత్తం ఫండ్ పరిశ్రమలో అతి పేలవ పనితీరు ప్రదర్శించే ఫండ్స్‌లో ఇదొకటి. అలాగే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌కూ, ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధం ఉంటుందని భావించవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారి ప్రవేశించే వారు దాదాపు ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి విశ్వసనీయ బ్రాండ్ల వైపు నడుస్తారు. ఇక్కడ ఫండ్స్ పనితీరు దేనికదిగా విడిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
పన్ను రాబడులు...
కేవలం ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో ఏడాదిలో రూ.1.50 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది.
ఫండ్స్‌లో పెట్టుబడులు అర్థం కావా?
ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తేలిక. మొదటి సారి కేవైసీ అంటే గుర్తింపు, నివాస ధ్రువీకరణలు, బ్యాంకు ఖాతా నంబర్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటి అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే కొనుగోలు, అమ్మకం చేసుకోవచ్చు. చిరునామా, బ్యాంకు ఖాతా మారినప్పుడు ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఎంచుకోవడం పరిశోధనతో కూడుకున్నది. కష్టమనిపిస్తే ఆర్థిక సలహాదారులు ఉండనే ఉన్నారు.
వృద్ధులకు తగినవి కావా...?
ఇది నిజం కాదు. రిస్క్ తీసుకోని వారి కోసం డెట్ ఫండ్స్ ఉన్నాయి. స్వల్ప రిస్క్ తీసుకునే వారికి మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్స్ ఉన్నాయి. తరచూ డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకోవచ్చు. లేదా ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. దీన్నే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌గా పిలుస్తుంటారు.
ఎప్పుడంటే అప్పుడు విక్రయించుకోవచ్చా?
పనిదినాల్లో ఎప్పుడైనా ఫండ్స్ యూనిట్లను అమ్ముకోవచ్చు. విక్రయించిన మేర డబ్బు మీ ఖాతాకు జమ కావాలంటే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఒక్కరోజులోనే అందుకోవాలంటే లిక్విడ్ ఫండ్స్ అందుకు అనువైనవి. – సాక్షి, బిజినెస్ విభాగం