
నేను ఇటీవలే రిటైరయ్యాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.40 లక్షల వరకూ వచ్చాయి. ఇద్దరు పిల్లలకు చెరో రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను. మిగిలిన రూ.20 లక్షలను నా, నా భార్య భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఆదాయమూ, వృద్ధి రెండూ ఉండేలా నాకు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ సూచించండి? –ప్రహ్లాదరావు, విజయవాడ
వడ్డీరేట్లు తగ్గుతుండటం సీనియర్ సిటిజన్‌లకు ప్రతికూలమైన అంశం. ఇక మార్కెట్ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే నష్ట భయం అధికంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి అధిక రాబడి వచ్చేలా ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈక్విటీ కూడా ఒక భాగంగా ఉండాలి. మీకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో రూ.20 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు.. దీనిపై వచ్చే ఆదాయమే మీకు ఆధారమనుకుందాం. ప్రస్తుత వడ్డీరేట్ల పరిస్థితుల్లో ఈ డబ్బును బ్యాంక్‌లో దాచుకున్నా, దానిపై వచ్చే వడ్డీతో ఐదేళ్ల పాటు ఎలాగో అలాగా బండి నెట్టుకురావచ్చు.
ఐదేళ్ల తర్వాత వచ్చే వడ్డీ మీ అవసరాలను తీర్చలేకపోవచ్చు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ, కాలం గడుస్తున్నకొద్దీ మీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని మీకు అధిక ఆదాయం కావలసిందే. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు పొందాలంటే కచ్చితంగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాల్సిందే. మీ ఆదాయ అవసరాలను బట్టి ఎంత మొత్తం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి.
దీని కోసం మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్‌లు, సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)లను పరిశీలించవచ్చు. మీ అవసరాలకు ఇతర మొత్తాలు(పెన్షన్, ఇంటి అద్దె, తదితరాలు) ఉండి, కొంచెం మొత్తమే మీకు ఆదాయం అవసరమైన పరిస్థితుల్లో బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనప్పుడు వార్షిక విత్‌డ్రాయల్స్ 5 శాతానికి మించి ఉండకూడదని గుర్తుంచుకోండి.
నా వయస్సు 26 సంవత్సరాలు. ఇటీవలనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరాను. ఈ కంపెనీ తెలిసిన వారిదే అయినందున ఉద్యోగ భద్రతకు ఢోకా లేదు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. నాకు వచ్చే జీతంలో రూ.8,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఒకే సంస్థకు చెందిన రెండు, మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేకుంటే, వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెం దిన రెండు, మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా?
–భాస్కర్, విశాఖపట్టణం
వివిధీకరణ(డైవర్సిఫికేషన్) ప్రయోజనాలు పొందాలంటే ఒకే మ్యూచువల్ ఫండ్‌కు చెందిన రెండు, మూడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే, వేర్వేరు ఫండ్ హౌస్‌లకు చెందిన రెండు, మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. మీరు ఒకే ఫండ్‌హౌస్‌కు చెందిన రెండు, మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సాధారణంగా ఒకే సంస్థకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ టీమ్‌లు ఒకేలా ఉంటాయి.
అంటే ఒక ఫండ్ హౌస్‌కు చెందిన వివిధ మ్యూచువల్ ఫండ్స్.. మేనేజ్‌మెంట్, రీసెర్చ్, దాదాపు ఒకేలాగా ఉంటాయి. ఒకవేళ వీరి అంచనాలు తప్పాయనుకోండి. ఆ ప్రభావం ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటి మీదా పడుతుంది. మరోవైపు ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి కీలకమైన ఫండ్ మేనేజర్ ఎవరైనా నిష్క్రమించారనుకోండి.. ఆ అంశం కూడా ఫండ్స్ పనితీరుపై ప్రతికూల ప్రభావమే చూపుతుంది.
ఈ ప్రతికూలతలను అధిగమించడానికి ఒకే ఫండ్‌హౌస్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో కంటే వివిధ ఫండ్స్‌హౌస్‌లకు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు మీరు ఎంచుకోవడానికి వివిధ కేటగిరీల్లో(ఈక్విటీ, బ్యాలన్స్‌డ్, ) వివిధ సంస్థలకు చెందిన ఎన్నో మంచి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
నేను కొత్త ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రెగ్యులర్ ప్లాన్‌ల కన్నా డైరెక్ట్ ప్లాన్‌లో ప్రయోజనాలు బాగా ఉంటాయని, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయమని మిత్రులు చెప్తున్నారు. నా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? –ఫరూక్, హైదరాబాద్
రెగ్యులర్ ప్లాన్‌ల కన్నా డైరెక్ట్ ప్లాన్‌లు కొంచెం ఖరీదు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్లలో డిస్ట్రిబ్యూటర్ల కమీషన్‌లు ఏమీ ఉండకపోవడమే దీనికి కారణం. డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లకు సంబందించి వ్యయాల్లో తేడా ఏడాదికి కనీసం 1 శాతంగానైనా ఉంటుంది. అయితే మార్కెట్ పట్ల, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పట్ల తగిన అవగాహన ఉన్నవారికి డైరెక్ట్ ప్లాన్‌లు తగిన విధంగా ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు.
కాబట్టి, అన్నప్రాశన రోజే ఆవకాయ మంచిది కానట్లే, తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి డైరెక్ట్ ప్లాన్‌లు తగినవి కావని చెప్పవచ్చు. అందుకని మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం మొదటగా రెగ్యులర్ ప్లాన్‌లనే ఎంచుకోండి. మరోవైపు మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, బ్యాంక్ ద్వారా రెగ్యులర్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. దీనివల్ల కొంచెం అదనంగా ఖర్చయినప్పటికీ, మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ పట్ల తగిన అవగాహన వస్తుంది.
ఒక ఏడాది తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పట్ల తగిన అవగాహన, మార్కెట్ పరిస్థితుల పట్ల కొంత పరిజ్జానం వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు.
– ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment