చౌకగా దొరికే మంచి టెర్మ్ ప్లాన్ ఏది? | Dhirendra Kumar, CEO, Value Research interview | Sakshi
Sakshi News home page

చౌకగా దొరికే మంచి టెర్మ్ ప్లాన్ ఏది?

Published Mon, Sep 2 2013 1:37 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

చౌకగా దొరికే మంచి టెర్మ్ ప్లాన్ ఏది? - Sakshi

చౌకగా దొరికే మంచి టెర్మ్ ప్లాన్ ఏది?

నా వయస్సు 43 సంవత్సరాలు. నా వార్షిక వేతనం రూ.12 లక్షలు. రూ. కోటి టెర్మ్‌ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. చౌకలో దొరికే ఉత్తమ టెర్మ్‌ప్లాన్‌ను సూచించండి. 
 - రామస్వామి, భద్రాచలం
 
 చిన్న వయస్సులోనే బీమా పాలసీలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే ఆలస్యమైనా సరే బీమా పాలసీ తీసుకోవడం మాత్రం మరువద్దు. ఇక మీ విషయానికొస్తే, వ్యయాలు ఆదా చేయడం కోసం టెర్మ్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం మంచిది. ఏజెంట్ల ప్రమేయం ఉండదు. కాబట్టి వారి కమీషన్లు తదితర ఖర్చులుండవు ప్రీమియం తక్కువగా ఉంటుంది.  హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2ప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్ ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్‌లైన్ టెర్మ్ పాలసీలు. ఇక వేర్వేరు బీమా సంస్థల నుంచి వేర్వేరు టర్మ్ (కనీసం రెండు)పాలసీలు తీసుకోవడం ఉత్తమం. మీ రిటైర్మెంట్ వరకూ లేదా మీ కొడుకో, కూతురో సంపాదనా పరుడయ్యేంత వరకూ మీరు ప్రొటక్షన్ తీసుకోవాలి. సింగిల్ ప్రీమియం పాలసీ బదులు రెగ్యులర్ ప్రీమియం పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే రెగ్యులర్ ప్రీమియం పాలసీతో పోల్చితే సింగిల్ ప్రీమియం పాలసీ ఖరీదెక్కువ. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండి, పొగ తాగని వారైతేనే ఈ ప్రీమియంలు వర్తిస్తాయి. ఒకవేళ వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశాలుంటాయి. 
 
 ఎఫ్‌ఎంపీల నెట్ అసెట్ వాల్యూ(ఎన్‌ఏవీ) రుణాత్మకంగా ఉన్న సందర్భాల్లో ఏం చేయాలి?                                
 -పద్మిని, బెంగళూరు
 ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ)లు దాదాపు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలాంటివే. బ్యాంక్ ఎఫ్‌డీలకు ఎంత వడ్డీనిచ్చేదీ బ్యాంకులు ముందుగానే వెల్లడిస్తాయి. ఈ ఎఫ్‌ఎంపీల ఈ రిటర్న్‌లు సూచనాత్మకంగానే ఉంటాయి. కచ్చితంగా ఇంత ఇస్తామని మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెల్లడించకపోయినప్పటికీ,  ఇన్వెస్టర్లకు ఏడాదికి 9.75 శాతం నుంచి 10 శాతం వరకూ రిటర్న్‌లు  వచ్చే అవకాశాలున్నాయి. 2008 సంక్షోభానికి ముందు ఫండ్ కంపెనీలు ఇండికేటివ్ రిటర్న్‌లు ఆఫర్ చేసేవి. దీనిని ప్రస్తుతం సెబీ రద్దు చేసింది. ఏది ఏమైనా ఇన్వెస్టర్లకు ఏడాదికి 9.75 శాతం నుంచి 10 శాతం వరకూ రిటర్న్‌లు గ్యారంటీగా వస్తాయి.
 
  ఎఫ్‌ఎంపీలు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్(సీడీ), కమర్షియల్ పేపర్స్(సీపీ), మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, కార్పొరేట్ బాండ్స్, ఒక్కోసారి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కూడా ఎఫ్‌ఎంపీలు ఇన్వెస్ట్ చేస్తాయి. ఎఫ్‌ఎంపీల మెచ్యూరిటీ కాలాన్ని బట్టి పై ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కలిపిగాని, విడివిడిగా కానీ ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణంగా వీటి మెచ్యూరిటీ ఒక నెల నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు స్వల్పకాలిక రాబడుల కోసం ఎఫ్‌ఎంపీల్లో పెట్టుబడులు పెడతారు. వీటితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా బాగానే ఉంటాయి.  ఎఫ్‌ఎంపీలు క్లోజ్డ్ ఎండ్ స్కీమ్‌లు కాబట్టి వీటిని న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌వో) సమయంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మెచ్యూరిటీ అయ్యేదాకా వీటినుంచి వైదొలిగే అవకాశం లేదు.  ఎక్స్ఛేంజ్ ద్వారా మాత్రమే వైదొలిగే అవకాశం ఉంటుంది. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ) ఇన్వెస్ట్ చేసిన రుణ పత్రాలు మార్క్-టు-మార్కెట్‌గా మారిన పరిస్థితుల్లో ఎఫ్‌ఎంపీల ఎన్‌ఏవీలు రుణాత్మకంగా ఉంటాయి. సంబంధిత ఎఫ్‌ఎంపీ అసలైన విలువను ఈ ఎన్‌ఏవీ వెల్లడిస్తుంది. ఎఫ్‌ఎంపీల ఎన్‌ఏవీలు రుణాత్మకంగా మారినప్పటికీ, ఇన్వెస్టర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 
 
 టెర్మ్ ప్లాన్ వార్షిక ప్రీమియం(రూ.)
 హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్ రూ. 17,712
 ఐసీఐసీఐ ప్రు ఐకేర్ రూ. 16,450
 అవైవా ఐ-లైఫ్ రూ. 9,275
  (రూ.50 లక్షల పాలసీ, 20 ఏళ్ల టెర్మ్ ప్లాన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement