
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మంచి రాబడులనిచ్చే కొన్ని ఫండ్స్‌ను ఎంపిక చేశాను. కానీ, వాటి ఎయూఎమ్(అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్–నిర్వహణ ఆస్తులు) తక్కువ స్థాయిలో ఉన్నాయి. రాబడి బాగా ఉన్నప్పటికీ, ఏయూఎమ్ తక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – రామకృష్ణ, విజయవాడ
ఏయూఎమ్ తక్కువగా ఉన్నప్పటికీ, గతంలో మంచి రాబడులు సాధించిన మ్యూచువల్ ఫండ్స్‌లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక్కోసారి భారీగా ఏయూఎమ్‌లు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా తక్కువగా ఏయూఎమ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చే అవకాశాలుంటాయి.
ఒక ఫండ్ మంచి పనితీరు కనబరుస్తోందని, ఇన్వెస్టర్లు ఆ ఫండ్‌లోనే అధికంగా ఇన్వెస్ట్ చేస్తే, ఆ ఫండ్ ఏయూఎమ్ బాగా పెరుగుతుంది. ఒక్కోసారి ఈ అధిక ఏయూఎమ్ ఆ ఫండ్ వృద్ధికి అవరోధం కూడా కాగలదు. అలాగని తక్కువ ఏయూఎమ్ ఉన్న ఫండ్స్ భవిష్యత్తులో మంచి రాబడులు ఇస్తాయన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు.
అయితే మీరు ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులు ఇచ్చిన ఫండ్స్.. వాటి ఏయూఎమ్ తక్కువగా ఉన్నా సరే వాటిల్లో ఎలాంటి శషభిషలు లేకుండా ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్(పీఎమ్‌ఎస్) ద్వారా ఇన్వెస్ట్ చేయమని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు. వీటిపై నియంత్రణ ఏ సంస్థ చూస్తుంది. ఈ సర్వీస్‌కు సంబంధించి పారదర్శకత ఎలా ఉంటుంది ? – ఆంటోని, హైదరాబాద్
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు(పీఎమ్‌ఎస్) అందించే సంస్థల్లో మంచివీ ఉన్నాయి. చెడ్డవీ ఉన్నాయి. పీఎమ్‌ఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అధిక ప్రయోజనాలు వచ్చే అవకాశాలు తక్కువే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఏడాది తర్వాత వాటిని విక్రయిస్తే, వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇది పీఎమ్‌ఎస్‌కు వర్తించదు. పీఎమ్‌ఎస్ విషయంలో ఫండ్ మేనేజర్ మీకు బదులుగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ అధికారం ఆ వ్యక్తికి దక్కుతుంది.
పీఎమ్‌ఎస్ రాబడులు సాధారణంగా స్వల్పకాలిక మూలధన లాభాలై ఉంటాయి. ఈ స్వల్పకాలిక మూలధన లాభాలపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎమ్‌ఎస్‌పై నియంత్రణ సెబీ(సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కు ఉంటుంది. పీఎమ్‌ఎస్‌కు కనీస పెట్టుబడి రూ.25 లక్షలు. ఇది చిన్న ఇన్వెస్టర్లకు పనికి రాదు. నియంత్రణ, పారదర్శకత తదితర అంశాల్లో పీఎమ్‌ఎస్ కంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమంగా ఉంటాయి.
మా నాన్నగారు సీనియర్ సిటిజన్. పిల్లలందరినీ బాగా చదివించారు. అందరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. తన దగ్గర ఉన్న సొమ్ములను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. షేర్లంటే అయనకు పెద్దగా ఆసక్తి లేదు. కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి, వచ్చిన సొమ్ములను తన మనవళ్లకు బహుమతిగా ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్–పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) లేదా ఆల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – రవి కిరణ్, వైజాగ్
పన్ను ప్రయోజనాలతో పాటు గ్యారంటీ రాబడులు కావాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కంటే కూడా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, అలాగే వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అయితే పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పదిహేనేళ్ల దాకా మీరు వెనక్కి తీసుకునే వెసులుబాటు మీకు ఉండదు. అయితే రాబడులు తక్కువగా వస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడులే వస్తాయి.
దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇంతకంటే మంచి రాబడులే పొందవచ్చు. పీపీఎఫ్ కంటే కొంచెం అధిక రాబడులు, ఎప్పుడైనా డబ్బులు తీసుకునే వెసులుబాటు(లిక్విడిటీ) కావాలనుకుంటే మాత్రం డెట్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. అయితే వీటిపై పన్ను భారం ఉంటుంది. మూడేళ్లలోపే డెట్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తి మొత్తం ఆదాయానికి ఈ రాబడిని కలిపి, వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత డెట్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది 20 శాతం(ఇండేక్సేషన్ ప్రయోజనంతో)గా ఉంటుంది.
స్టాక్ మార్కెట్ లాగానే డెట్ మార్కెట్లో కూడా వివిధ బాండ్ల ధరలు పెరుగుతూ, తగ్గుతూ, ఒడిదుడుకులకు గురవుతూ ఉంటాయి. అందుకని డెట్ ఫండ్స్ రాబడులు ఏడాదికి ఏడాదికి మారుతూనే ఉంటాయి. స్వల్పకాలిక రాబడుల్లో కూడా తీవ్రమైన వ్యత్యాసమే ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను మంచి అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. కాబట్టి షేర్లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అంశాన్నీ పరిశీలించవచ్చు. మీ నాన్నగారి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే మాత్రం పీపీఎఫ్‌ను ఎంచుకోండి.
- ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment